నీ తేనె రాగాల మురళీ పదనిసలో నిలువెల్ల నా శ్వాస
నీ నీడ జాడల్లోవడివడిగా అడుగులు వేసా
అరఘడియా మనలేక నీ ఎడబాటులో అలసి సొలిసా
కలువల రేడుని వేడుకొంటి నీ చెలియ గోడు ఆలకించమని
ప్రతి రేయిలో పున్నమి ఎన్నియలు విరజిమ్మమని
చామంతి ,సంపెంగలతో మంతనాలు చేశా
నువ్వు నడిచే దారుల్లో విరబూయమని
కిన్నెరసానిపై కన్నెర్ర చేశా వన్నెలసోయగంతో
నన్ను మీరి నిను మురిపించొద్దని , మైమరపించొద్దని
అది హాయో మాయో తెలియని అయోమయంలో
అల్లాడిపోతున్నా నీకై. తల్లడిల్లి పోతున్నా నీ లాలనకై
నీ అనురాగంలో నను నేనే మరిచిపోవాలని
నీ ప్రేమఝరిలో ముగ్ధనై మురిసిపోవాలని
నీ సమ్మోహన రూపం నిరతం నా కనుపాపలలోనే కదలాడాలని
నా మది దోచిన మురళీ మోహనా .. నీ మనసును నాకే కానుకనీవా
నాఇరు కనుపాపల్లో చిరు దివ్వె వెలిగించి నీకోసం నిరీక్షిస్తున్నా ....
నీ రాక కోసం నిశిరాతిరిలోనూ నిదురమరచి నిలుచున్నా...
రారా కృష్ణా !
మన ప్రణయ రససామ్రాజ్యం లో నా హృదయ పీటమేసాను
కినుక వహించక నీ అలివేణి పై
సందేహము వలదు కృష్ణా నేనే నీ రాధను