పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
5, జులై 2020, ఆదివారం
మేలైన తరుణమనీ...,
4, జులై 2020, శనివారం
ఎంకన్న ఇయ్యాల పలకరించాడు
2, జులై 2020, గురువారం
భారీమూల్యం
చీకటికాటుక పెట్టుకొన్నట్టు
చుట్టూరా శూన్యం
బతుకుపొత్తంలో
ఒక భయానక అధ్యాయం
ఎన్ని తప్పిదాలకు పర్యవసానమో
చెల్లించుకొంటుంది మానవాళి
భారీమూల్యం
నైరాశ్యపు నడివీధిలో
నడయాడుతుంది
మనుష్యజీవనం
విధి విలాసమో
ఇది వినాశకాలమో
కాలధర్మమో
కలికాలపు కర్మమో
తల్లడిల్లుతూనే
తలపడుతుంది ఇలాతలం
ఇసుమంతైనాలేని కణం
వినాశనానికి
విశ్వప్రయత్నమూ చేస్తూ..
కమ్ముకొస్తున్న మరణఛాయలతో
కమిలిపోతుంది మానవహృదయం
మరోభూమిపై మనుగడ సాగించలేక
సృష్టి వైచిత్రికి తాళలేక
పరిస్థితికి తలవంచనూలేక
ఏదో తెలియని సందిగ్ధంలో
తలమునకలు అవుతూ
స్థాణువులా నిలబడింది
అశేష ప్రపంచం
ఎప్పుడు వినిపిస్తుందో మరి
వేకువతట్టున వెలుతురు రాగం
ఎప్పుడు కనిపిస్తుందో మరి
కలిసొచ్చే ఆ కారుణ్యపుమేఘం.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
1, జులై 2020, బుధవారం
🙏ప్రత్యక్ష నారాయణుడు🙏
వైద్యుడా అభివందనం
ప్రాణాదాతా నీకు ప్రణామం
విరామమెరుగని
విరాట్స్వరూపా
వినమ్రపూర్వక నమస్సులివిగో
వైద్యో నారాయణో హరిః
వైద్యుడే మనపాలిట ప్రత్యక్ష
నారాయణుడు
ఊపిరి పోసింది ఆ దేవుడైతే
ఉసురును నిలిపింది వైద్యుడే
ఆ అపరబ్రహ్మ ఆపన్నహస్తమే
మనను ఆదుకునే అపర సంజీవని మంత్రం
అనారోగ్యమగు జీవితాల్లో
ఉదయించే అంశుమాలి వైద్యుడే
నిరంతర శ్రమజీవులు
నిజమైన దేవుళ్ళు
ఓర్పు సహనంలో ధరణిమాత
ఆత్మజులు వారు
స్వాస్థ్యము చేకూర్చుటలో
ధన్వంతరి వారసులు
అవిరళకృషీవలురు
అలుపెరుగని ఋషీశ్వరులు
కరోనా కదనరంగంలో దూకిన
మొట్టమొదటి సైనికులు వీరే
ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నంలో
తమ ప్రాణాలను సైతం
పణంగాపెట్టిన నిస్వార్ధసేవకులు
ఏమిచ్చి తీర్చుకోగలం
ఆ ప్రాణదాతల ఋణం
వైద్యో నారాయణో హరిః అని
శిరస్సువంచి
ప్రణమిల్లడం తప్ప .
(అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
30, జూన్ 2020, మంగళవారం
*రాళ్ళెత్తిన కూలీలు*
తరతరాలుగా
రాళ్ళెత్తిన కూలీలెవరూ
రాళ్ళెత్తిన కూలీలెవరని
గళాలు ప్రశ్నించడమూ
కలాలు పదేపదే
కదిలించడమూ ఏళ్ళ తరబడి
పరిపాటే గానీ
ఆ రాళ్ళెత్తిన జీవితాలు
రగిలిపోతున్నా...నిజానికి
కనీసం చీమకుట్టినట్టైనా
వుందా బండరాతి సమాజానికి
కంటితుడుపుమాత్రమే
ఒకింత ఓదార్పునైనా
ఇచ్చేనా ఈ ఉత్తుత్తిమాటలు
అట్టడుగు బడుగు
జీవితాలెపుడూ
కడగండ్ల గుదిబండలే
ఆదరణ కరువైన
ఆ బతుకులెపుడూ
సమాధానం దొరకని
జటిల ప్రశ్నాపత్రాలే
కన్నీటి సిరాలో కరిగిన
బతుకుచిత్రాలే
నిలువెల్లా కరిగిపోతున్నా
నిలువు నీడకూడా
దొరకని నిర్భాగ్యుల
నిర్లిప్త జీవితాలవి
కష్టాలు కన్నీళ్ళకు
ఆలవాలమైన
కల్లోలజీవితాలవి
వీరికథ పాళీలకే పరిమితం
రాతలలో మాత్రమే రాళ్ళెత్తే
కూలీల ప్రస్తావన
వాస్తవంలో మాత్రం
వారిది అరణ్యరోదన
అడుగడుగున ఆరాటమే
ఎడతెగని పోరాటమే
గతుకుల బ్రతుకు వీధుల్లో
పిడికెడు మెతుకులకై
కడివెడు కన్నీళ్ళే
బ్రతుకు జీవనమంతా
బహు దుర్భరమే
అన్ళీ కాలే కడుపులూ
రాలే బతుకులే
నిరంతర శ్రమజీవులు
నిర్లక్ష్యానికి గురైన
నిర్భాగ్యజీవితాలు
ఒట్టిమాటలు కట్టిపెట్టి
గట్టిమేలు తలపెట్టే
శుభతరుణం వచ్చేవరకూ
వేసారిన జీవితాలకు
వెలుతురు రాగం
ఆమడదూరమే.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
29, జూన్ 2020, సోమవారం
అమ్మపెట్టిన అందాలగోరింట
అరుణారుణ
కిరణంలా....
ఎర్రగా పండిన
నా అరచేతి
గోరింటనుచూసి
మూగబోయింది
మా పెరటి
ముద్దమందారం...
విరబూసిన
నా అరచేతినిగని,
వికసించిన సుమమనుకొని,
ఝుమ్మని తుమ్మెద
ఝంకారం... చేసింది.
తమజాబిలి...తరలివెళ్ళి
తరుణిఅరచేత
కొలువుదీరెనా...అని
తరచితరచి
చూసింది ఆకాశం
ఆశ్చర్యంగా....!
అతిశయమనుకోవద్దు
అందంగా పండింది
ఆషాఢమాసంలో
నా అరచేయి..
అమ్మ తన అనురాగాన్నంతా
రంగరించి పెట్టింది మరి
అద్భుతంగా పండదా...మరి...
అందగా ఉండదా...మరి.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
28, జూన్ 2020, ఆదివారం
మేలిపొద్దులీయవా...
26, జూన్ 2020, శుక్రవారం
నిజం చెప్పవా...కృష్ణా!
8, జూన్ 2020, సోమవారం
*ఈవారం అక్షరాలతోవ* *లోస్టార్ ఆఫ్ ది వీక్ గా ఎంపిక* *అయిన శుభసందర్భంలో**మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ* *శ్రీమణి*
*ఈవారం అక్షరాలతోవ* *లోస్టార్ ఆఫ్ ది వీక్ గా ఎంపిక* *అయిన శుభసందర్భంలో*
*మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ*
*శ్రీమణి*