పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జూన్ 2020, మంగళవారం

*రాళ్ళెత్తిన కూలీలు*


తరతరాలుగా

రాళ్ళెత్తిన కూలీలెవరూ

రాళ్ళెత్తిన కూలీలెవరని

గళాలు ప్రశ్నించడమూ

కలాలు పదేపదే

కదిలించడమూ ఏళ్ళ తరబడి

పరిపాటే గానీ

ఆ రాళ్ళెత్తిన జీవితాలు

రగిలిపోతున్నా...నిజానికి

కనీసం చీమకుట్టినట్టైనా

వుందా బండరాతి సమాజానికి

కంటితుడుపుమాత్రమే

ఒకింత ఓదార్పునైనా 

 ఇచ్చేనా ఈ ఉత్తుత్తిమాటలు

అట్టడుగు బడుగు

జీవితాలెపుడూ

కడగండ్ల గుదిబండలే

ఆదరణ కరువైన 

ఆ బతుకులెపుడూ

సమాధానం దొరకని 

జటిల ప్రశ్నాపత్రాలే

కన్నీటి సిరాలో కరిగిన

బతుకుచిత్రాలే

నిలువెల్లా కరిగిపోతున్నా

నిలువు నీడకూడా

దొరకని నిర్భాగ్యుల

నిర్లిప్త జీవితాలవి

కష్టాలు కన్నీళ్ళకు 

ఆలవాలమైన

కల్లోలజీవితాలవి

వీరికథ పాళీలకే పరిమితం

రాతలలో మాత్రమే రాళ్ళెత్తే

కూలీల ప్రస్తావన

వాస్తవంలో మాత్రం

వారిది అరణ్యరోదన

అడుగడుగున ఆరాటమే

ఎడతెగని పోరాటమే

గతుకుల బ్రతుకు వీధుల్లో

పిడికెడు మెతుకులకై

కడివెడు కన్నీళ్ళే

బ్రతుకు జీవనమంతా

బహు దుర్భరమే

అన్ళీ కాలే కడుపులూ

రాలే బతుకులే

నిరంతర శ్రమజీవులు

నిర్లక్ష్యానికి గురైన

నిర్భాగ్యజీవితాలు

ఒట్టిమాటలు కట్టిపెట్టి

గట్టిమేలు తలపెట్టే

శుభతరుణం వచ్చేవరకూ

వేసారిన జీవితాలకు

వెలుతురు రాగం

ఆమడదూరమే.


*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి