*జీవధార*
నిర్వేదం ఆవహించి ఎడారివైతే
వసంతం కనికరిస్తుందా
అమావాస్యకు మొరపెట్టుకుంటే
వెన్నెల కరుణిస్తుందా
ఏటికి ఎదురీదడమే జీవితం
ఆవలిఒడ్డుకు చేరాలంటే
అలుపెరుగని ప్రయాణమే
ఆశల విస్తరి నిండాలంటూ
ఆకాశంకేసి చూస్తే ఎలా
ఫలితాలు విస్తారంగా
ఆకాంక్షించినపుడు
అవిశ్రాంతంగానే సేద్యం చేయాలి
వెలుతురు,చీకటి
ప్రసరించడంలో సమన్యాయాన్నే అవలంబిస్తుంటాయి,
మనోవేదికను సంసిద్ధం చేయాలంతే
మధురమైన సంగీతమే
మానవ జీవితం
మలచుకోవాలేగానీ
మనుగడవీధులన్నీ
మనోజ్ఞమైన రాగాలనే
ఆలపిస్తూ ఆహ్వానిస్తుంటాయి
ఆస్వాదించే జీవననైపుణ్యాన్ని
అలవరించుకోవాల్సింది
అక్షరాలా మానవుడే
ముసురుకొస్తున్న నైరాశ్యపు
ఛాయలపై ఆశలజీవధారను
విస్తారంగా వర్షింపజేయాలి
ఆత్మస్థైర్యాన్ని ధరిస్తూనే
అవరోధాలనూ అధిగమించడం
అభ్యాసం చేయాలే గాని
గమనమంతా రాగయుక్తంగా
సాగిపోతుంది
హర్షపు ధారలలో తడిస్తేనేకాదు
జీవితం సార్ధక్యం
మండుటెడారిలోనూ నడిస్తేనే
కన్నుల చెలమలు తడిస్తేనే
మహోత్కృష్టమగు
మానవజన్మకు సాకల్యం.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి