పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
28, అక్టోబర్ 2022, శుక్రవారం
నేడు సహరి వారపత్రికలో ప్రచురితమైన నా కవిత *నేనిప్పుడు జీవనది* చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయగలరు. *శ్రీమణి*🙏🌹🌹🌹🌹🙏
21, అక్టోబర్ 2022, శుక్రవారం
నేనొక ఒంటరి శిలను
*నేనొక ఒంటరిశిలను*
ఏముందీ జీవితమంటే
విరిగిన కలల శకలాలు
ఒరిగిన ఆశలశిఖరాలు
కాలవిన్యాసంలో కకావికలమైన
సగటు మనిషి గమనం
సందిగ్ధావస్థలో సగభాగం
సరిదిద్దుకొనే ప్రయత్నంలోనే
మళ్ళీ రేపటిఉదయం
తోలు బొమ్మలాట బతుకు
అతుకులు కోకొల్లలు
ఆడించేది విధి
వింత ఆటే మరి మనషనే జీవిది
ఆలోచనతెరలను
కదలించినపుడు ఒక్కోచోట
కదలనంటూ క్షణాలు స్తంబించి
మొరాయిస్తుంటాయి
నెరవేరని ఆకాంక్షలు
నేరం నీదేనంటూ..నాకేసి
చూపుడు వేలును సారించినపుడు
నెర్రెలిచ్చిన ఆకాశంలా
బీటలు వారిపోతుంటాను
వికలమైన నామనసెందుకో
సకలం కోల్పోయినట్టు
ఇప్పుడు నేను ఒంటరి శిలను
శిధిలమైన ఆశల ఆనవాళ్ళ మధ్యలో
స్థాణువునై నిలుచున్నాను.
నిజానికి నేనెందుకు దోషిని
దోసిలినిండిన ఆశలను
ఆఘ్రాణించలేదనా...
తరలిపోతున్న కాలాన్ని
తనివితీరా ఆస్వాదించలేదనా
నేను నడుస్తూనే వున్నాను
నా అడుగులు మాత్రం అక్కడే నిలబడిపోయాయి
నేను మాట్లాడుతూనే వున్నాను
నా గుండెదే మూగనోము
నేనైతే నేనున్న ఈ జీవితంలో
అత్యద్భుతంగా నటిస్తున్నానే
లోలోపల మాత్రం మూర్తీభవించిన నిశ్చలత్వం...ఎందులకో.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
20, అక్టోబర్ 2022, గురువారం
పల్లెవాణి దినపత్రికలో ప్రచురితమైన నా కవిత*దేవుడా* చదివి మీ అమూల్యమైన స్పందన తెలియజేయగలరు...*శ్రీమణి*🌹🙏🙏🙏🙏🌹
19, అక్టోబర్ 2022, బుధవారం
జీవధార
*జీవధార*
నిర్వేదం ఆవహించి ఎడారివైతే
వసంతం కనికరిస్తుందా
అమావాస్యకు మొరపెట్టుకుంటే
వెన్నెల కరుణిస్తుందా
ఏటికి ఎదురీదడమే జీవితం
ఆవలిఒడ్డుకు చేరాలంటే
అలుపెరుగని ప్రయాణమే
ఆశల విస్తరి నిండాలంటూ
ఆకాశంకేసి చూస్తే ఎలా
ఫలితాలు విస్తారంగా
ఆకాంక్షించినపుడు
అవిశ్రాంతంగానే సేద్యం చేయాలి
వెలుతురు,చీకటి
ప్రసరించడంలో సమన్యాయాన్నే అవలంబిస్తుంటాయి,
మనోవేదికను సంసిద్ధం చేయాలంతే
మధురమైన సంగీతమే
మానవ జీవితం
మలచుకోవాలేగానీ
మనుగడవీధులన్నీ
మనోజ్ఞమైన రాగాలనే
ఆలపిస్తూ ఆహ్వానిస్తుంటాయి
ఆస్వాదించే జీవననైపుణ్యాన్ని
అలవరించుకోవాల్సింది
అక్షరాలా మానవుడే
ముసురుకొస్తున్న నైరాశ్యపు
ఛాయలపై ఆశలజీవధారను
విస్తారంగా వర్షింపజేయాలి
ఆత్మస్థైర్యాన్ని ధరిస్తూనే
అవరోధాలనూ అధిగమించడం
అభ్యాసం చేయాలే గాని
గమనమంతా రాగయుక్తంగా
సాగిపోతుంది
హర్షపు ధారలలో తడిస్తేనేకాదు
జీవితం సార్ధక్యం
మండుటెడారిలోనూ నడిస్తేనే
కన్నుల చెలమలు తడిస్తేనే
మహోత్కృష్టమగు
మానవజన్మకు సాకల్యం.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
16, అక్టోబర్ 2022, ఆదివారం
నేటి పల్లెవాణి దినపత్రికలో
నేటి *పల్లెవాణి* దినపత్రికలో ప్రచురితమైన నా కవిత
*మార్పు మంచిదే*
చదివి మీ అమూల్యమైన
స్పందన తెలియజేయగలరు
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
6, అక్టోబర్ 2022, గురువారం
ఆగదుగా ఈగమనం
*ఆగదుగా ఈగమనం*
కష్టమింట పుట్టామని
పొట్ట ఊరుకుంటుందా
కట్టలు తెంచుకున్న కన్నీటికి
కాలం బదులిస్తుందా
నడుంకట్టి నడపకుంటే
కదలదుగా బ్రతుకురథం
బ్రతుకు తెరువు వేటలో
కదులుతున్న మాతృత్వం
కర్తవ్యంపాలనలో
ఆ కన్నతల్లి ప్రయాణం
కడుపారా కన్నబిడ్డకు
కన్నీటిని తాపించలేక
తపించే తల్లిగుండె ఆరాటం
ఆకలి మెలిపెట్టినా
అలుపెరుగని పోరాటం
సేదదీర తావులేని
పేదతనం శాపమైతే
ఊరట ఊసేలేక
ఉస్సురంటూ జీవితం
ముద్ద నోటికందాలంటే
ముప్పొద్దుల శ్రమదానం
పస్తులూ పరిపాటంటే
ప్రాణం నిలబడుతుందా
కడుపుతీపి మమకారం
కాలు నిలవనిస్తుందా
అరనిమిషం పాటైనా
ఆగదుగా ఈ గమనం
ఎంతైనా ఓరిమిలో ధరణికదా
మాతృమూర్తి
తలకు మించి భారమైనా
వెనుకాడక సాగుతుంది.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*