పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, మే 2022, శనివారం

నామమాత్రపు మనిషిని*

*నామమాత్రపు మనిషిని*

నిశ్శబ్దంగా వున్నానని
 నిద్రపోతున్నానుకున్నావా
నిప్పుకణికలను కంఠంలో 
నిక్షిప్తం చేసుకొనే ప్రయత్నంలో 
మౌనాన్ని ఆపాదించుకొన్నానంతే
నామమాత్రపు మనిషిని, 
విధి ప్రయోగించిన 
మారణాయుధాల ధాటికి 
కుప్పకూలిన శరీరాన్ని
కాలం విచక్షణా రహితంగా
ఇనుప ముళ్ళతో దాడిచేసి
మస్తిష్కాన్ని ఛిద్రం చేస్తుంటే
నా కళ్ళు వర్షించే రుధిరధారలు
నిన్ను కాస్తైనా కదిలించలేదా 
నా హృదయం ఆక్రోశంతో స్తంభించి
ఏక్షణమైనా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగాఉంది
జీవించాలనే ప్రయత్నం
జీవశ్చవం నా నిర్వచనం
నా ఊపిరిని నేను పీల్చుకొనే అవకాశాన్ని
నానుండి ఏమాత్రం దూరం చేయద్దని
ప్రాధేయపడుతున్నాను పగబట్టిన కాలాన్ని 
నా శరీరం విషగాయాలతో రసిగారుతుంది
కనికరమన్నది లేకుండా ఖసితీరా
నా జీవనాడులను ఒడిపెట్టి మెలేయవద్దని
వేలసార్లు మొరపెట్టుకుంటున్నాను
తరుముతున్న తలరాతను
నన్ను బ్రతకనీయమని బ్రతిమాలాడుతున్నాను
ఒక్క నిమిషంపాటైనా నిమ్మళంగా
నిలుచోనీయమని.... 
                        *శ్రీమణి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి