పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, మే 2022, శనివారం

నామమాత్రపు మనిషిని*

*నామమాత్రపు మనిషిని*

నిశ్శబ్దంగా వున్నానని
 నిద్రపోతున్నానుకున్నావా
నిప్పుకణికలను కంఠంలో 
నిక్షిప్తం చేసుకొనే ప్రయత్నంలో 
మౌనాన్ని ఆపాదించుకొన్నానంతే
నామమాత్రపు మనిషిని, 
విధి ప్రయోగించిన 
మారణాయుధాల ధాటికి 
కుప్పకూలిన శరీరాన్ని
కాలం విచక్షణా రహితంగా
ఇనుప ముళ్ళతో దాడిచేసి
మస్తిష్కాన్ని ఛిద్రం చేస్తుంటే
నా కళ్ళు వర్షించే రుధిరధారలు
నిన్ను కాస్తైనా కదిలించలేదా 
నా హృదయం ఆక్రోశంతో స్తంభించి
ఏక్షణమైనా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగాఉంది
జీవించాలనే ప్రయత్నం
జీవశ్చవం నా నిర్వచనం
నా ఊపిరిని నేను పీల్చుకొనే అవకాశాన్ని
నానుండి ఏమాత్రం దూరం చేయద్దని
ప్రాధేయపడుతున్నాను పగబట్టిన కాలాన్ని 
నా శరీరం విషగాయాలతో రసిగారుతుంది
కనికరమన్నది లేకుండా ఖసితీరా
నా జీవనాడులను ఒడిపెట్టి మెలేయవద్దని
వేలసార్లు మొరపెట్టుకుంటున్నాను
తరుముతున్న తలరాతను
నన్ను బ్రతకనీయమని బ్రతిమాలాడుతున్నాను
ఒక్క నిమిషంపాటైనా నిమ్మళంగా
నిలుచోనీయమని.... 
                        *శ్రీమణి*

25, మే 2022, బుధవారం

ఇదేమి సిత్రమో !

ఇదేమి సిత్రమో !
ఆ మదనుని 
మహిమాస్త్రమో!
నీ ప్రణయరసామృత 
సేవనవైచిత్రమో!
ముడి వేసినమనసుల 
మైమరపుల సరాగమో 
నీ జతలో నాకు  
గురుతు రాదు సమయం 
నీకోసం ఆఉదయం
నీకోసమే ఆసాయంసమయం
నీ సరసన నాహృదయం ,
నిత్య విహంగ వీక్షణము 
నిను చూడక క్షణమయినా...
  తరగదు ఆ తరుణం 
             
               శ్రీమణి

8, మే 2022, ఆదివారం

అమ్మ

*అమ్మ*

అరుదగు  వాక్యం “అమ్మ”.
అత్యద్భుత కావ్యం “అమ్మ”
అమృతధారలు అధరాలకు
అందించే అమృతభాండం "అమ్మ"
అఖిలాండకోటి బ్రహ్మాండానికి
ఆది మూలం "అమ్మ"
ఆ విధాత మనకొసగిన
అమూల్య కానుక "అమ్మ"
అర్ధించకనే ఆకలితీర్చు
ఆరాధ్యదేవత "అమ్మ"
మాటలకందని
మమతలశిఖరం "అమ్మ"
ఊహలకందని
ఉర్వీ రూపం "అమ్మ"
శోకం తెలియని, లోకం ఎరుగని
ఆ పాపాయిని భువికి
పరిచయపరచిన పరమపావని "అమ్మ"
బుడిబుడి నడకల బుడతడి తడబడు అడుగుల నడకలు నేర్పిన
ఆది గురువు "అమ్మ"
కోటి ముద్దులతోడ, గోరుముద్దలుచేసి ఆ సుధాంశుని చూపి సుతునికి కథలు చెప్పే మహా కవయిత్రి "అమ్మ"
పారాడే పాపాయిని జాతిని కాపాడగ పోరాడే సిపాయిగా, మనిషిని మనీషిగా జగతికి వెలుగునిచ్చు దీపంలా మలిచే మహా శిల్పి "అమ్మ"
సృష్టిని నడిపించే రెండక్షరాలు "అమ్మ"
ఈజగతికి అమ్మకు సాటి "అమ్మే"
అమ్మని మరిపించే మరోపదం "అమ్మే"!

అనంత సృష్టికే
మాతృమూర్తులైన అమృతమూర్తులు
అయిన తోటి స్త్రీ మూర్తులందరికీ
పాదాభివందనాలతో...
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...
(2013లో  నాచే విరచితమై చిగురాకులు అనే నా మొదటి కవితా సంపుటిలో ప్రచురితమైన *అమ్మ*  అనే ఈకవిత ఎంతోప్రాచుర్యం చెంది పలువురిప్రశంసలు పొందడంఆనందంగాఉంది.) *సాలిపల్లిమంగామణిశ్రీమణి*

7, మే 2022, శనివారం

తెలంగాణా రాష్ట్రం పరకాలలోక్రాంతిజ్యోతి మహిళ సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థ వారి అధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉగాది క్రాంతిజ్యోతి నంది పురస్కారం 2022 అందుకొన్న శుభతరుణం మీఅమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*శ్రీమణి*🙏🪷🪷🙏🪷🪷🙏

తెలంగాణా రాష్ట్రం పరకాలలో
క్రాంతిజ్యోతి మహిళ సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థ వారి అధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉగాది క్రాంతిజ్యోతి నంది పురస్కారం 2022 అందుకొన్న శుభతరుణం మీఅమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*శ్రీమణి*
🙏🪷🪷🙏🪷🪷🙏

5, మే 2022, గురువారం

పడమటి సంధ్యారాగం

పలకరించిన
పడమటి సంధ్యారాగం
పరవశించిన
పసిడి పచ్చని సరాగం
ప్రకృతి గీసిన చిత్తరువుకు
మైమరచి ఈ మానసరాగం.

                *శ్రీమణి*