పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

తెలుగు "ధనం"

🌸✍🌸✍🌸✍🌸✍🌸✍🌸
తెలుగు "ధనం"

మధుమాసం మదితాకినటుల
మధుధారలు అదరాలకు 
జాలువారినటుల
మంచి గంధం పూసినటుల
మరుమల్లియ విరబూసినటుల
నాల్క నవనీతం చవి చూసినటుల
పంచదార పాకమున పల్కులు 
ముంచి తీసినటుల
పాలు తేనెల కలబోసిన పరమాన్నంలా...
తియతీయని అనుభూతులు 
నా తెలుగుదనంలో
విడదీయలేని అనుబంధం 
నా తెలుగుదనంతో
ధనముందా ధరణిపై 
తెలుగుధనమును మించి
తెలుగు బాషనుమించి 
తేనియల పలుకులేవీ...
తెలుగు సంస్క్రృతిని తలదన్ను 
సాంప్రదాయ మెక్కడ కానగలము
తెలుగునేలన జనియించిన 
మన భాగ్యమేమని కొనియాడగలము
పలికినంతనే అధరాలకు 
అమృతత్వం ప్రాప్తించేలా
వర్ణించగ పదములకే 
పావనమనిపించేలా
జున్నుమీగడ తరగలా
పాలసంద్రపు నురగలా
వెండివెన్నెల వెలుగులా
పసిడిపచ్చని జిలుగులా
వేయిప్రభాకరుల ప్రభలనే 
తలపించు తేజోవిరాజంలా
శతకోటిచందురుల వెన్నియలు 
తలదన్ను చల్లదనమంతా 
నా తెలుగుదనమందుండ 
ఏ వెలుగులు నింపగలవు 
నిశీధినందున నిజమగు దివ్వెలను
అమ్మచేతి గోరుముద్దకు సరితూగునా 
పరాయి పంచన పరమాన్నం.
తేటతెలుగు లాలిపాటకు 
సరిపోలునా ఏదేని అధ్బుతరాగం
గగనశిఖలకు ఎగిసినా
తరువుమూలం నేలగాదా
నే పీల్చేగాలి సైతం తెలుగు ఊపిరులూదుతుండగ
నేనెలామనగలను 
తెలుగుమరచిన తావుల్లలోన
తేటతెలుగును నోటపలకని
జన్మమూ ఒక జన్మమేనా. 
తెలుగులమ్మ కడుపునబుట్టి.
ఊటబావినొదిలి ఎండమావికై
పరుగులు తీస్తున్నాం
అమ్మబాషనొదిలి అన్యబాషకై అర్రులుచాస్తున్నాం
చేతులెత్తి మ్రొక్కుతాను 
తెలుగన్నదమ్ములార. 
తేటతెలుగు బాషనే 
మీ నోట పలకండి.
తెలుగు వెలుగుల 
బాటనీ చాటిచెప్పండి.
తెలుగుతల్లి శిగలో వాడని 
కసుమాలై విరబూయండి.
వినువీధుల ప్రతిధ్వనించ తెలుగు రాగమాలపించండి.
ఆగగనపు సరిహద్దుమీద 
తెలుగు ఓనమాలు లిఖియించండి.
ఎల్లలు దాటి తెలుగు ఖ్యాతిని
దిగ్ధిగంతాలా చాటిచెప్పండి.
అవనిపై అదృష్టవశాత్తూ 
తెలుగు బిడ్డనయినందుకు
ఎడతెగక గర్విస్తూ...
జైతెలుగుతల్లి..జై జై తెలుగుతల్లి..... 

మిత్రులందరికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో
పేరు: సాలిపల్లి మంగా మణి
కలంపేరు: శ్రీమణి
విశాఖపట్నం
8639145603.
🌸✍🌸✍🌸✍🌸✍🌸✍🌸

3 కామెంట్‌లు: