పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఎదురీత

*ఎదురీత*

బ్రహ్మ రాసిన
రాతలకన్నా...
బ్రహ్మాండంగా
గీతలు గీసుకుంటున్నా....
దేవుడిచ్చిన వెలితితో
బ్రతుకు బాటలో...
వెనుక పడుతున్నా.....
వెలుతురు కోసం
వెతుకుతునే వున్నా...
లేని కాళ్ళను అనునిత్యం
అతుకుతునే వున్నా...
అవహేళన పాలు చేస్తున్న
అవయవలోపాలను సైతం
అవలీలగా అధిగమిస్తున్నా
నాచేతులతోనే...
విధి విషమంటూ
దూషిస్తూకూచోలేక
తలరాతకు ఎదురీతను
నేర్చుకుంటున్నా....
నడవలేని నాకాళ్ళకు
నమూనాచిత్రం
గీసుకుంటున్నా
తీరని నా ఆశను
నెరవేర్చు కోవాలని
ఆరాటపడుతున్నా....
కాళ్ళు లేవుగానీ....
నేను కళాకారుణ్ణి మరి
కలసి రాని కాలమని
అలసి సొలసిపోతే ఎలా
కన్నీళ్ళే మైనా...
కాళ్ళను తిరిగిస్తాయా...
తలరాతను తిరగేస్తాయా..
అందుకే తీరికగా కూచుని
తీరని ఆశను సైతం
తనివితీరా చిత్రిస్తున్నా....
విధి ఆడిన చిత్రమైన
నాటకంలో చక్కగా నడుస్తూ
నటిస్తున్నా...
నా వంతు పాత్రకు
నేనైతే న్యాయమే చేస్తున్నా...
జాలి చూపులు మాత్రం వద్దు
జేజేలు పలకండి చాలు
నాలోని కళాకారునికి
కాళ్ళు తోడులేని నాచేతుల
నైపుణ్యానికి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

27, ఫిబ్రవరి 2021, శనివారం

ఎందుకలా..?

ఎందుకలా..?

ఎందుకలా ఆవేశపు
 విల్లంబులు సంధిస్తావు
ఎందుకలా కోపమనే
పాపానికి తావిస్తావు 
కోపమెపుడు శాపమే
అది మన పాలిట మనమే
విధించుకొన్న పాపమే
ఆలోచనారాహిత్యానికి
మూలం ఆవేశమే
ఆవేశం వివేకాన్ని అంతరింప
చేస్తుంది...సర్వ నాశనాన్ని
మనిషికి సంతరింపచేస్తుంది
 తొందరపాటెపుడూ
చిందరవందరే ముందుకు
ఆవేశపు నిర్ణయమెపుడూ
 అస్తవ్యస్తమే
ఆలోచనతో చేసే కార్యమెపుడు
ఖచ్చితంగా సఫలీకృతమే
మనిషికి శాంతమే ఆభరణం
మనసు స్వాంతనకు శాంతమే
ఆవశ్యకం
ఒక్కసారి ఆగ్రహాన్ని విడనాడి
అనునయించి చూడండి
అరక్షణంలో పగవాడే
మన శ్రేయస్సుకు అభిలషించే
ఆత్మీయుడై చేయందిస్తాడు
ఉగ్రత్వంతో ఊగిపోతే
ఉరిమి చూస్తూ సలసలా
మరిగిపోతే నలిగిపోయేది
మన హృదయమే
నాశనమయ్యేది మన శరీరమే
అందుకనే ఒక్కక్షణం ఆలోచించండి
ఆవేశాన్ని నియంత్రించండి
ఆలోచనతో అడుగులు
వేయండి
మీలో కోపాన్ని రూపుమాపి
శాంతమనే ఆభరణాన్ని 
మీ మదిలో ధరించండి
మీ మనసును మీరే జయించి
మనీషల్లే జీవించండి.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మధురము గాదా*


ప్రియవదనా...!
నిను వలచిన నా హృదయం 
సుతిమెత్తని ఒక ఉదయమై
నీ చరణాలను స్పృశించినపుడు,
నిరతం నీ స్మరణలో తరించే
నాఅధరాలు మకరందపుఝరులై
ఆ ప్రణయ సుధా వాహినిలో 
పరవశించి ప్రవహించినపుడు,
నా అందెల రవళి,నీమోహనమురళి
శ్రుతిలయలై,
 సమ్మోహనరాగమాలపించినపుడు,
నా నీలి నీలి కురులను చేరి 
నీకరములు అలవోకగ
అరవిరిసిన వలపుల విరులల్లినప్పుడు,
వెన్నెలంటి నీ ఎద పానుపుపై
సేదదీరి నామనసంతా మైమరపుల
మదనమాయినపుడు,
కలవరమైన నా మదిలో 
నీరాక   "కల"వరమై కవ్వించినపుడు
నా మానసతీరాన్ని నీ తలపులు
మలయసమీరాలై పలకరించినపుడు
నా చెంపల్లో విరబూసిన కెంపుల్లో
నీ రూపం సాక్షాత్కరించినపుడు
ఈ కలువకన్నియ కన్నుల నిండిన 
వెన్నెల చంద్రుడు నీవై
మేనక మెరుపుకి తడబడిపోయిన 
ఆ ఋషీంద్రుడు  నీవై
నా వలపుల సడిలో తొలకరి జడివై 
సరసమాడినపుడు,
ఆహా...మధురము గాదా ఆతరుణం!
ఎదురై రాదా యమునా తీరం!
వేణు మాధవా... వలచిన నీ నెచ్చెలి 
మనసంతా మధురోహలు విరిసిన పూదోటే అదిగో మన ఆశల బృందావని
అదియే మన మది దోచిన ఆ మధువని. 

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
                                                   

25, ఫిబ్రవరి 2021, గురువారం

సిద్ధమే

*సిద్ధమే*

గాయాలకు భయపడేది లేదు
రాగాలు నాలో రవళించి నను
మురళిగా మలుస్తాయంటే
ఉలిదెబ్బలకు సిద్ధమే
రమ్యమైన శిల్పమై విరాజిల్లుతానంటే
ఉప్పెనలోనూ ఊపిరోసుకుంటాను
ఉప్పొంగిన అలనేనై నేల తాకుతానంటే
అమావాస్య కంటికి కాటుకగా
కరిగిపోతాను..
రాబోయే వెన్నెలంతా నాపేరిట
రాసిస్తానంటే
నిస్సందేహంగా నిన్నలలో
కూరుకుపోతాను
రేపటి ఉదయంలా
రాణిస్తానంటే
ఓటమినై చరిత్రలో కలిసిపోతాను
రాబోయే యుద్ధంలో విజయఖడ్గంలా
మెరిసిపోతానంటే
ఘటనలన్నీ ఘడియలోపే
గతం కాగితంపై వాలిపోతున్నాయి
అనుభూతులు సైతం అరక్షణంలో
అనుభవాలై మిగిలిపోతున్నాయి
వెతలు చూసి బెదిరిపోతే
ఎదురుగా ఇక శూన్యమేగా..
ఎదురుదెబ్బలు గురువులనుకొని
ఎదురుకోనా నిబ్బరంగా

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

24, ఫిబ్రవరి 2021, బుధవారం

*(దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్మరణలో)*

దేవులపల్లి వారి స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా చంద్రంపాలెంలో జరిగిన 122వ జయంత్యుత్సవాలకు నేను
విశిష్ట అతిథిగా హాజరయ్యాను.
ఆ సభకు ఆంధ్రప్రదేశ్ అప్పటి ఉపముఖ్యమంత్రి వర్యులు, మండలి బుద్ధప్రసాద్ గారు,ఇంకా అతిరధ,మహారధులు
వేంచేసిన  సభలోనే  అతిధిగా తొలి ప్రసంగం చేసే మహద్భాగ్యం
నాకు కలిగింది,
ఆ మహనీయుని ఆశీస్సులు నాయందున్నాయని
భావించి నేటికీ ఆనందపడుతుంటాను.
*(దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్మరణలో)*
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
🌺🌸🌺🌸🙏🙏🌸🌺🌸🌺

చిన్ని హృదయమా...

అందమా...అభివందనం

అందమా...అభివందనం

అందం చిన్నబోయింది
అందాల అధినేత్రి
అందరాని చందమామై
గగనశిగలకెగసి మెరిసింది.
సిరిచందనాలు, సిరిమల్లెపూలు
కలబోసిన ముగ్ధ మనోహర
సౌందర్యం
మధురస్మృతులను
పదిలపరచి మరలరాని
లోకాలకు తరలిపోయింది
అద్భుతాన్ని, అతిశయాన్ని
అభినయంతో అధిరోహించి
చలనచిత్ర సింహాసనాన్ని
అధిష్టించిన లలనా లావణ్యరాశి, 
కలలకూ..కవనాలకూ నెలవైంది
అశేష ప్రేక్షకుల హృదిలో
అతిలోక సుందరై కొలువైంది
అందాల ముద్దుగుమ్మకూ
కుందనాల బొమ్మకూ,
సిరిచందనాల కొమ్మకూ
సిరిమల్లె పూరెమ్మకూ
అశ్రుతప్త నయనాలతో
మా హృదిలోకసుందరి
శ్రీదేవికి అశృ నివాళులు
(అపురూప సౌందర్యరాశి శ్రీదేవి
వర్ధంతి సందర్భంగా)
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

నేనొక నిశ్శబ్దాన్ని

*నేనొక నిశ్శబ్దాన్ని*

నేనొక నిశ్శబ్దాన్ని
అనంతమైన ఆకాశాన్ని 
అనుక్షణం అన్వేషిస్తూ
అవని మూలాన్ని అవలోకిస్తూ
అలా శూన్యం కేసి చూస్తుంటాను
నిన్న రాతిరి రాల్చిన కలలకు
రేపటి ఆశల తీరానికి దూరమెంతని
ఆరా తీస్తుంటాను
సుఖదుఃఖాలకు ఆవల
నిలబడి కావలి కాస్తూ
అలౌకిక ఆనందంలో
ఆదమరచిపోతుంటాను
మాటలకు మౌనానికి మధ్య
అంతరాన్ని అంచనా వేస్తూ
ఆ అంతరాన్ని అమాంతం
భర్తీ చేస్తూ నిదానంగా
నిశ్శబ్దంగా మారిపోతాను
నాలో పురుడు పోసుకున్న
భావాలు పూర్ణత్వాన్ని
ఆపాదించుకుంటాయి..
  జీవనగమనంలో
లక్ష్యం నిర్ధేశించేది నాలోని
నిగూఢత్వమే
గమ్యం గోచరించేది కూడా
నా సమక్షంలోనే
మనోనిశ్చలతను చేకూర్చి
మనసుకు సాంత్వన నిస్తూనే
పరమపథానికి దారులను
 అతిచేరువ చేసే సాధనం నేను
నాలో తెలియని మృధుత్వం
మానవజీవితంలో
ఎన్నో జటిలమైన
 సంఘర్షణలకు సైతం 
సరైన సమాధానం 
మనిషికి,మనసుకూ కూడా
మహత్తరమైన వైద్యం అందించే
ధన్వంతరిని..
నిశిలా అగుపిస్తా గానీ
అసలైన మిసిమి నేను
అంతర్దృష్టితో అన్వేషిస్తే
దేదీప్యమానంగా
సాక్షాత్కరిస్తా..
నిదానంగా పరికించి చూస్తే
ప్రతి మనసుకు
పరిచయమే అక్కరలేని
నిర్వచనాన్ని
నేనొక....నిశ్శబ్దాన్ని.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

22, ఫిబ్రవరి 2021, సోమవారం

*చిన్నబోవా మరి ..*

*చిన్నబోవా మరి ..*

కలికిని, చిలుకల కొలికిని,
చెలియను, చంద్రుని నెచ్చెలిని
కలకంఠిని,కలువకంటిని నేను
కిన్నెరసానిని, వన్నెల అలివేణిని
భామినిని,సుందర సౌదామినిని
వలపుల విరిబోణిని, మెలికల మాలినిని
ఎలతీగబోణిని, ఎలకోయిల రాగాన్ని
అంచను, రాయంచను నేను,
మెలతను, విద్యుల్లతను
సురదనను, సుహాసినిని
సీమంతిని, సొగసుల చామంతిని నేను 
నివ్వెరబోవా ..జవ్వని సౌందర్యానికి   
నిలువలేక సరిసాటిగా ..సృష్టి అందాలు
చిన్నబోవా మరి .. 
ఆ నింగి తారకలు
మిన్నకుండిపోవా..వెన్నెల రాతురులు
చెలరేగిపోవా మరి సెలయేటి గలగలలు
ఇల చేరిపోవా ..దివి చందనాలు
వరదలా కదలవా వింజామరలు
జలజలా  రాలవా .. జలతారు మేఘాలు
వెలవెల బోవా.. మణులు మాణిక్యాలు 
మూగబోవా మరి ముద్ద బంతి పూలు
పడచు ప్రాయాన పడతి పదనిస లివి
అతిశయించిన సొగసు మిసమిస లివి
ఊసులాడే  సన్న జాజి బాసలివి
అసలు సిసలైన కన్నె మోజు రాశులివి.

*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*

*నీ తలపుల సందోహమే*

*నీ తలపుల సందోహమే*

మందానిలము స్పృశించి
అరవిరిసిన మందారంలా 
నీ మందస్మితమున మైమరచి
మనోజ్ఞమాయెను
నామానసతీరం
ఆ తూరుపు రాగం మీటిన
సిందూరంలా
నీ నిట్టూర్పు రాగం మాటున
మంత్రముగ్ధనైతి
నా ఊహల తావులన్నీ
నీ నులివెచ్చని ఊపిరులై
మూసివున్న నా కనురెప్పలపై
మధురమాయె కదా
నీ అధరసంతకం
విరుల పరిమళాలు సైతం
వెదజల్లగ వెరచెనేమో..
ఎదఝల్లను నీ తలపుల 
సుమగంధాలకు తాళలేక,
వివశనైతి ప్రభూ నీ ఎదవాకిట
విరహగీతి పాడుతూ
మదనమైతి ప్రియసఖుడా
మాటరాక మధువనిలో
నీ మధురోహల పరమౌతూ
సందేహం లేదు ప్రియా
ఇది నీతలపుల సందోహం
ఈ సఖి మోహం సాంతం
సమ్మోహన మురళీ...
సదా నీ పాదాక్రాంతం.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

తెలుగు "ధనం"

🌸✍🌸✍🌸✍🌸✍🌸✍🌸
తెలుగు "ధనం"

మధుమాసం మదితాకినటుల
మధుధారలు అదరాలకు 
జాలువారినటుల
మంచి గంధం పూసినటుల
మరుమల్లియ విరబూసినటుల
నాల్క నవనీతం చవి చూసినటుల
పంచదార పాకమున పల్కులు 
ముంచి తీసినటుల
పాలు తేనెల కలబోసిన పరమాన్నంలా...
తియతీయని అనుభూతులు 
నా తెలుగుదనంలో
విడదీయలేని అనుబంధం 
నా తెలుగుదనంతో
ధనముందా ధరణిపై 
తెలుగుధనమును మించి
తెలుగు బాషనుమించి 
తేనియల పలుకులేవీ...
తెలుగు సంస్క్రృతిని తలదన్ను 
సాంప్రదాయ మెక్కడ కానగలము
తెలుగునేలన జనియించిన 
మన భాగ్యమేమని కొనియాడగలము
పలికినంతనే అధరాలకు 
అమృతత్వం ప్రాప్తించేలా
వర్ణించగ పదములకే 
పావనమనిపించేలా
జున్నుమీగడ తరగలా
పాలసంద్రపు నురగలా
వెండివెన్నెల వెలుగులా
పసిడిపచ్చని జిలుగులా
వేయిప్రభాకరుల ప్రభలనే 
తలపించు తేజోవిరాజంలా
శతకోటిచందురుల వెన్నియలు 
తలదన్ను చల్లదనమంతా 
నా తెలుగుదనమందుండ 
ఏ వెలుగులు నింపగలవు 
నిశీధినందున నిజమగు దివ్వెలను
అమ్మచేతి గోరుముద్దకు సరితూగునా 
పరాయి పంచన పరమాన్నం.
తేటతెలుగు లాలిపాటకు 
సరిపోలునా ఏదేని అధ్బుతరాగం
గగనశిఖలకు ఎగిసినా
తరువుమూలం నేలగాదా
నే పీల్చేగాలి సైతం తెలుగు ఊపిరులూదుతుండగ
నేనెలామనగలను 
తెలుగుమరచిన తావుల్లలోన
తేటతెలుగును నోటపలకని
జన్మమూ ఒక జన్మమేనా. 
తెలుగులమ్మ కడుపునబుట్టి.
ఊటబావినొదిలి ఎండమావికై
పరుగులు తీస్తున్నాం
అమ్మబాషనొదిలి అన్యబాషకై అర్రులుచాస్తున్నాం
చేతులెత్తి మ్రొక్కుతాను 
తెలుగన్నదమ్ములార. 
తేటతెలుగు బాషనే 
మీ నోట పలకండి.
తెలుగు వెలుగుల 
బాటనీ చాటిచెప్పండి.
తెలుగుతల్లి శిగలో వాడని 
కసుమాలై విరబూయండి.
వినువీధుల ప్రతిధ్వనించ తెలుగు రాగమాలపించండి.
ఆగగనపు సరిహద్దుమీద 
తెలుగు ఓనమాలు లిఖియించండి.
ఎల్లలు దాటి తెలుగు ఖ్యాతిని
దిగ్ధిగంతాలా చాటిచెప్పండి.
అవనిపై అదృష్టవశాత్తూ 
తెలుగు బిడ్డనయినందుకు
ఎడతెగక గర్విస్తూ...
జైతెలుగుతల్లి..జై జై తెలుగుతల్లి..... 

మిత్రులందరికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో
పేరు: సాలిపల్లి మంగా మణి
కలంపేరు: శ్రీమణి
విశాఖపట్నం
8639145603.
🌸✍🌸✍🌸✍🌸✍🌸✍🌸

20, ఫిబ్రవరి 2021, శనివారం

వెంకన్నా...నిన్నే*

*వెంకన్నా...నిన్నే*

వేడుకోమన్నది అమ్మా
వెంకన్నా.... నిన్నే
శరణు శరణు శరణంటూ
చేరుకోమన్నది అమ్మా
వెంకన్నా....నిన్నే
అమ్మ చెప్పింది ఆనాడు
గోడు వింటావని
జన్మ జన్మంతా వేలుపై
తోడు వుంటావని....*వే*

పదేపదే నీ నామమే
మది నింపుకోవాలని
వదలక నీచరణాలను
అదిమి పట్టుకోవాలని
తనివితీరా నీసేవలో
తరించిపోవాలని
తరగని బాధలెన్నున్నా
తరుణోపయం నీ చరణాలని... *వే*

వెతలంటే భయమెందుకు
వేంకటేశుడున్నాడని
వేయినామాలవాడు
వేలుపై వున్నాడని
ఎలుగెత్తి పిలిచావో
ఎదుటనే నిలిచేనని
ఏలినవాడే దిక్కు
ఏడుకొండలవాడని.... *వే*

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

18, ఫిబ్రవరి 2021, గురువారం

రేపు మాత్రం నాదే...

*రేపు మాత్రం నాదే*
కాలమా....కణకణమండే
నిప్పుల్లో నను కాల్చేసినా...
నే నిరాశలో కూరుకుపోను
నిగనిగలాడే అగ్నిబీజమై అవతరిస్తా..
నేనడిచే దారుల్లో రాళ్ళు,ముళ్ళూ 
పేర్చి నువు పరీక్షించాలనుకున్నా...
ఉస్సూరంటూ.. 
నిస్పృహలో కూరుకుపోను
నిరాశతో....
నిట్టూరుస్తూనిలబడిపోను
లక్ష్యం చేరే తీరతాను
లక్షల ఆటంకాలున్నా....
నిన్నటి నా కలలన్నిటినీ 
నిర్ధాక్షిణ్యంగా..నువు చిదిమేసినా....
రేపటివాస్తవమై,ఉదయిస్తూనేవుంటా...విజయానికి శంఖారావం 
పూరిస్తూనే వుంటా...
నిన్న నాది కాకున్నా...
ఉన్నమాట చెబుతున్నా...
రేపు మాత్రం నాదే
ఓటమి గోడపై రాసుకున్న
గెలుపుసూత్రం మాత్రం నాదే....
లేదు,రాదు, కానేకాదనే
వదులైపోయిన పదాలకికచెల్లు
కనుచూపు మేరలో
రెపరెపలాడే విజయకేతనాన్నే
ఇక వీక్షిస్తుంటాయి నాకళ్ళు
మళ్ళీ,మళ్ళీ....
పడిలేచే కెరటం నా ఆదర్శం 
పరుగులు తీసేకాలంలో 
ఎదురీదే ప్రతి ప్రయత్నంలో...
చిగురించే మోడే నాకు మార్గదర్శకం
పునరుజ్జీవన మంత్రంలో...
నను తట్టి లేపుతుంది
కారుమబ్బులు కమ్ముకొస్తున్నా...
కటికచీకటి ముసురుకొస్తున్నా... 
కాంతి రేఖకై అన్వేషిస్తూనే వుంటా....
నాకల కరవాలంచేబూని,కవినై
ఉదయించే రవినై....కలకాలం
జీవిస్తూనే వుంటా...
నే చిరంజీవినై.
 *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

17, ఫిబ్రవరి 2021, బుధవారం

*మౌనహంతకీ*

*మౌనహంతకీ*

కలలు కూలిన శబ్ధం 
కలకలం రాల్చిన నిశ్శబ్దం
అవిసిపోతుంది ప్రాణం
అలసిపోతుంది జీవనం
బతుకు నాటకంలో
రాకాసి ఘట్టం
కనికరించదుగా 
ఈ కలికాలం చక్రం
ఊపిరి రెక్కలు విరిచేసిన
మౌనహంతకీ ...
మాననీయవే మనసు గాయాలను
బ్రతుకు సౌధం బ్రద్దలుచేసి
యుద్ధమెలా చేస్తావు
వాలిపోయిన మరణశయ్యతో
గరళసేవనమే 
పరిపాటై
మనసుగొంతుక మూగబోయింది
పగటినీ ఆక్రమింంచాయిగా
చీకటిరాత్రులు
ఎన్ని ఎండిన క్షణాలో
మనసునిలా మండిస్తున్నాయి
మనసు పొరలకు మరుపు పూసే
మంత్రముంటే  బాగుండునేమో
శరణు శరణు కాలమా ఇక
మరణమైనా ...మంచిదే మరి
మనిషిగా ఇక మహిని విడిచి
మధుర కథలా మిగిలిపోదును

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

13, ఫిబ్రవరి 2021, శనివారం

*కొన్ని జీవితాలంతే*

*కొన్ని జీవితాలంతే*

పుట్టింది
అమావాస్య చీకటికి కాదు..
అమ్మ గర్భంలోనే
కానీ అంధకారం
అక్కున చేర్చుకొంది
జగన్నాటకంలో
అభాగ్యుని పాత్రధారి మరి
పొగచూరిన బ్రతుకులు
అదృష్టం పొడసూపని
జీవితాలు
నీరెండిన ఈ కన్నులు
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు
అలమటించే
ఆ ఆకలిప్రేగులు నిత్యాగ్నిహోత్రాలు
తప్పెవరిదైనా ...
తగలబడింది మాత్రం
రేపటి భవితవ్యం
విధి బలీయమంటారా
ఈ వీధిపాలైన బాల్యం.

  *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*