*సాహిత్యపునిధి*
మహాకవి దాశరథి
ఆంధ్ర కవితా సారథి
అభ్యుదయ కవితా వారధి
అతడొక అక్షరాల నిధి
అచ్చతెలుగు సాహిత్యపు పెన్నిధి
అతడే మన మహాకవి దాశరథి
ఎడతెగనిది వారి కీర్తి
వాడి తగ్గనిది వారి కలం శక్తి
పద్యమే పదునైన ఆయుధంగా
ఉద్యమమే ఊపిరిగా
నిజాంపాలనపై నిప్పులు
కురిపించిన కవనధీరుడు
ఉపాధ్యాయుడు
ఉద్యమకారుడు
నిజాం నవాబుల
పైశాచిక రాజరికపుకాలంలో
కదం తొక్కి దొరతనానికి
ఎదురొడ్డి పోరాడిన కలమది
కారాగారమున సైతం ధారాళంగా
అభ్యుదయ రచనలు చేసి కలంసత్తా చూపించిన కవి దిగ్గజం
వారి అక్షరాలు దొరతనానికి
ఎదురొడ్డి పోరాడిన వాడియైన శరాలు
వారి పదాలు నిజాం నవాబుల
దాష్టీకాన్ని నినదించే
నిప్పులాంటి శపధాలు
వారి కవిత్వం మహాసముద్రం
వారి కలం చైతన్యం రగిలించే
ప్రగతి రథచక్రం
అతడి కలం అజరామరం
అతని రచనలు ఆంధ్రజాతికి
కరతలామలకం
అతడు తెలుగులమ్మ నుదుటున
మెరిసిన ఎర్రని సాహితీ తిలకం.
(శ్రీ దాశరథి కృష్ణమాచార్య వారి 96వ జయంతి సందర్భంగా మహతీ సాహితీ కవిసంగమం వారి దాశరథి ఇ-కవితా సంకలనము కొరకు రాసిన కవిత )
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
Nice
రిప్లయితొలగించండి