పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
24, జులై 2020, శుక్రవారం
మహాభిజ్ఞుడు...గుర్రంజాషువా
22, జులై 2020, బుధవారం
సాహిత్యపునిధి
*సాహిత్యపునిధి*
మహాకవి దాశరథి
ఆంధ్ర కవితా సారథి
అభ్యుదయ కవితా వారధి
అతడొక అక్షరాల నిధి
అచ్చతెలుగు సాహిత్యపు పెన్నిధి
అతడే మన మహాకవి దాశరథి
ఎడతెగనిది వారి కీర్తి
వాడి తగ్గనిది వారి కలం శక్తి
పద్యమే పదునైన ఆయుధంగా
ఉద్యమమే ఊపిరిగా
నిజాంపాలనపై నిప్పులు
కురిపించిన కవనధీరుడు
ఉపాధ్యాయుడు
ఉద్యమకారుడు
నిజాం నవాబుల
పైశాచిక రాజరికపుకాలంలో
కదం తొక్కి దొరతనానికి
ఎదురొడ్డి పోరాడిన కలమది
కారాగారమున సైతం ధారాళంగా
అభ్యుదయ రచనలు చేసి కలంసత్తా చూపించిన కవి దిగ్గజం
వారి అక్షరాలు దొరతనానికి
ఎదురొడ్డి పోరాడిన వాడియైన శరాలు
వారి పదాలు నిజాం నవాబుల
దాష్టీకాన్ని నినదించే
నిప్పులాంటి శపధాలు
వారి కవిత్వం మహాసముద్రం
వారి కలం చైతన్యం రగిలించే
ప్రగతి రథచక్రం
అతడి కలం అజరామరం
అతని రచనలు ఆంధ్రజాతికి
కరతలామలకం
అతడు తెలుగులమ్మ నుదుటున
మెరిసిన ఎర్రని సాహితీ తిలకం.
(శ్రీ దాశరథి కృష్ణమాచార్య వారి 96వ జయంతి సందర్భంగా మహతీ సాహితీ కవిసంగమం వారి దాశరథి ఇ-కవితా సంకలనము కొరకు రాసిన కవిత )
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
16, జులై 2020, గురువారం
రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కవి సమ్మేళనంలో (అంతర్జాల వేదికలో) పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న శుభతరుణం.🌹🍃🌹 ... *శ్రీమణి*
రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కవి సమ్మేళనంలో (అంతర్జాల వేదికలో) పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న శుభతరుణం.🌹🍃🌹
... *శ్రీమణి*
15, జులై 2020, బుధవారం
*వెలుతురు రాగం*
*వెలుతురు రాగం*
జీవన రాగాలన్నీ నిశీధి పాలే
నిన్నలలో నిదురిస్తూ
నిర్లిప్తంగా జీవితాన్ని సాగిస్తుంటే..
రేపటి ఉదయాలన్నీ
ప్రశ్నార్థకాలే
నిర్వేదపు ఛాయలలో
నైరాశ్యపు తావుల్లో
నిత్యం కూరుకుపోతే,
అనుక్షణమూ
ఆశకు ఊపిరిపోస్తూ
అడుగులు వేస్తూ పోతే
ఆసన్నమవదా
అతి చేరువలోనే
ఆశించిన వాసంతం
చిమ్మచీకటి పొరలను
చీల్చుకు నెమ్మదిగా
చిగురిస్తుంది రేపటి ఉదయం
ఎన్నెన్నో నిశీధి రాగాలకు
భరతవాక్యమేమో
ఇక రాబోయేకాలం
తరచి చూడు
తరగని పరవశం
పనిగట్టుకు పలకరిస్తుంది
పరితపిస్తున్న మనసుకు
సరికొత్త పరిమళాన్ని అందిస్తూ
పరిగెత్తుకు వస్తుందిక
వసివాడిన హృదయంలోకి
మిసిమివోలె కలిసొచ్చేకాలం
మించి పోలేదు సమయం
చాలినంత సంతోషం
చెంత చేర్చగ పొంచివుంది
చింతదీర్చే ఒక మంచితరుణం
వేసారక వేచియుంటే
తప్పక వినిపిస్తుంది
వెలుతురురాగం
అలుపెరుగక పయనిస్తే
అదిగో ఆవల ఆశలతీరం.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
6, జులై 2020, సోమవారం
గౌరవ ఉపరాష్ట్రపతివారి పై నిర్వహించిన పోటీలో పాల్గొన్నందుకు పున్నమి సంస్థ వారు అందించిన ప్రశంసాపత్రం.
5, జులై 2020, ఆదివారం
మేలైన తరుణమనీ...,
4, జులై 2020, శనివారం
ఎంకన్న ఇయ్యాల పలకరించాడు
2, జులై 2020, గురువారం
భారీమూల్యం
చీకటికాటుక పెట్టుకొన్నట్టు
చుట్టూరా శూన్యం
బతుకుపొత్తంలో
ఒక భయానక అధ్యాయం
ఎన్ని తప్పిదాలకు పర్యవసానమో
చెల్లించుకొంటుంది మానవాళి
భారీమూల్యం
నైరాశ్యపు నడివీధిలో
నడయాడుతుంది
మనుష్యజీవనం
విధి విలాసమో
ఇది వినాశకాలమో
కాలధర్మమో
కలికాలపు కర్మమో
తల్లడిల్లుతూనే
తలపడుతుంది ఇలాతలం
ఇసుమంతైనాలేని కణం
వినాశనానికి
విశ్వప్రయత్నమూ చేస్తూ..
కమ్ముకొస్తున్న మరణఛాయలతో
కమిలిపోతుంది మానవహృదయం
మరోభూమిపై మనుగడ సాగించలేక
సృష్టి వైచిత్రికి తాళలేక
పరిస్థితికి తలవంచనూలేక
ఏదో తెలియని సందిగ్ధంలో
తలమునకలు అవుతూ
స్థాణువులా నిలబడింది
అశేష ప్రపంచం
ఎప్పుడు వినిపిస్తుందో మరి
వేకువతట్టున వెలుతురు రాగం
ఎప్పుడు కనిపిస్తుందో మరి
కలిసొచ్చే ఆ కారుణ్యపుమేఘం.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
1, జులై 2020, బుధవారం
🙏ప్రత్యక్ష నారాయణుడు🙏
వైద్యుడా అభివందనం
ప్రాణాదాతా నీకు ప్రణామం
విరామమెరుగని
విరాట్స్వరూపా
వినమ్రపూర్వక నమస్సులివిగో
వైద్యో నారాయణో హరిః
వైద్యుడే మనపాలిట ప్రత్యక్ష
నారాయణుడు
ఊపిరి పోసింది ఆ దేవుడైతే
ఉసురును నిలిపింది వైద్యుడే
ఆ అపరబ్రహ్మ ఆపన్నహస్తమే
మనను ఆదుకునే అపర సంజీవని మంత్రం
అనారోగ్యమగు జీవితాల్లో
ఉదయించే అంశుమాలి వైద్యుడే
నిరంతర శ్రమజీవులు
నిజమైన దేవుళ్ళు
ఓర్పు సహనంలో ధరణిమాత
ఆత్మజులు వారు
స్వాస్థ్యము చేకూర్చుటలో
ధన్వంతరి వారసులు
అవిరళకృషీవలురు
అలుపెరుగని ఋషీశ్వరులు
కరోనా కదనరంగంలో దూకిన
మొట్టమొదటి సైనికులు వీరే
ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నంలో
తమ ప్రాణాలను సైతం
పణంగాపెట్టిన నిస్వార్ధసేవకులు
ఏమిచ్చి తీర్చుకోగలం
ఆ ప్రాణదాతల ఋణం
వైద్యో నారాయణో హరిః అని
శిరస్సువంచి
ప్రణమిల్లడం తప్ప .
(అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*