పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

సి.పి.బ్రౌన్ సేవా సమితి, సత్కారం

సి.పి.బ్రౌన్ సేవా సమితి, బెంగళూరు వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయ కళామందిరం, డా. టి.సుబ్బరామిరెడ్డి కళావేదిక యందు. ప్రఖ్యాత కన్నడ సాహితీ వేత్త గౌ.పద్మశ్రీ డా.దొడ్డరంగే గౌడ గారు మరియు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు గౌ. డా. ఎ.రాధాకృష్ణ రాజు గారు మరియు సి.పి.బ్రౌన్ సేవా సమితి అధ్యక్షులు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖుల చేతులమీదుగా గేయ విభాగంలో
"గుర్రం జాషువా గారి స్మారక పురస్కారం" అందుకొన్న శుభతరుణం.

29, సెప్టెంబర్ 2018, శనివారం

సాగిపో ముందుకూ...

వద్దురా...చిన్న...వద్దురా!
మొద్దు నిద్దరోవద్దురా....
వద్దురా...కన్న...వద్దురా!
మొద్దు నిద్దరోవద్దురా....

ఎంత పెద్దదో‌‌...లోకం
ఎదురీత నేర్చుకో....
అడుగడుగున గతుకులే
బ్రతుకుబాట వేసుకో...
అవరోధాలెన్నున్నా...
అధిగమించి సాగిపో
ఆరాటాలెన్నున్నా....
పోరాటం నేర్చుకో...
సాగిపో ముందుకూ...
సందేహం ఎందుకూ...
వడివడిగా...అడుగులేసి
ప్రగతి పసిడిబాటకేసి......"వ"

జీవనపోరాటమిదీ....
గెలుపు సూత్రం తెలుసుకో
అసలే కలికలికాలం
ఆచితూచి మసలుకో
వంచన జోలికి పోక
మంచి నడత అలవర్చుకో
ఆవేదనలెన్నున్నా...
ఆలోచన పెంచుకో...
సాగిపో... ముందుకు
సందేహం...ఎందుకూ...
వడివడిగా అడుగులేసి
ప్రగతి పసిడి బాటకేసి...."వ"
  
  ‌                        శ్రీమణి

27, సెప్టెంబర్ 2018, గురువారం

*మేలుకో..మేలుకై*


అయిదేళ్ళ అందలానికే...
అయ్యవార్ల తందనాలు
గద్దెనందుకోవడానికే...
వంగివంగి వందనాలు
నోటికిహద్దులేని
వాగ్ధానాలు,
చేతికెముకేలేని
బహుమానాలు,
పదవిని చేపట్టేదాకా...
కొదవేముందీ..కోతలకు,
అనుకొన్నదిసాగేవరకు
అరచేత్లో స్వర్గంచూపెడతారు
ఆకాశంలోచుక్కలనైనా..
నేలకిదించేస్తారు
తీరా...అందినాక
మనకు పట్టపగలే
చుక్కలు చూపిస్తారు
ఓట్ల భిక్షాటనలో
అడుగడుగునా...హైడ్రామాలు
ఆపై...అమాయకజనానికి
పెడతారు..పంగనామాలు
పర్యవేక్షణలు,
పాదయాత్రలంటూ..
పల్లెపల్లెకూ ...పలకరింపులు
పదేపదే..పడతారు
ప్రజలకు నీరాజనాలు
భయమేల...మీకంటూ
అందరికీ..అభయంఇస్తారు
వట్టిమాటలను కూడా
గట్టిమాటల్లాగే...
నొక్కినొక్కిచెప్తారు..
నాటకాలు,బూటకాలలో
మహానటులను తలపిస్తారు
అడుగడుగునా...
ఆత్మీయరాగమే
ఆలపిస్తారు...
అనుకొన్నది... దక్కిందో
కిక్కురుమనకుంటారు..
ఏవోదిక్కులు చూస్తుంటారు
ఇవీ..మన నాయకులనైజాలు
ఇప్పటికైనా...తెలుసుకోండి
నిజానిజాలు,
ఆసన్నమయ్యింది
అనువైన సమయం
అవినీతిరాజ్యమేలుతున్న
నేటి ప్రజాస్వామ్య వ్యవస్ధలో
నోట్ల వ్యామోహంలో
ఓట్లనమ్ముకోవద్దు
మద్యంమత్తుల్లో...
నాయకులనెన్నుకోవద్దు
మీతలకు మీరే కొరివి
పెట్టుకోవద్దు..
కోరి...కష్టాలను కొనితెచ్చుకోవద్దు
గోముఖవ్యాఘ్రాలన్నమ్మి
గొర్రెల్లా...ఓటేయద్దు
ఒక్కపూటవిందుకోసం
తాగినంతమందుకోసం
మత్తెక్కి మీఓటును
ఎటోవైపు విసిరేస్తే ..
అంతా...అయిపోయాక
అగోరించక తప్పదు
ఐదేళ్ళూ...అరకొరబ్రతుకులతో
అల్లాడకా తప్పదు
'ఓటు'అనే మహత్తరశక్తిని
అపహాస్యంచేయద్దు
అపాత్రదానం అసలేచెయ్యొద్దు
అందులకే....ఆలోచించండి
అర్హులకే పట్టంకట్టండి
ఆదమరచి..హాయిగా
బ్రతుకును కొనసాగించండి
చేయిచేయికలపండి
భరతఖ్యాతి నిలపండి
ప్రతిజ్ఞ చేయండి
ప్రజాస్వామ్యం పరువునిలబెడతామని.
                    శ్రీమణి

26, సెప్టెంబర్ 2018, బుధవారం

శ్రమైక సౌందర్య మూర్తి


ప్రకృతిపాదానికి పెట్టిన
పచ్చనిపారాణి
పదహారణాలా
అచ్చతెలుగు అలివేణి
పచ్చనిపచ్చికలో
విరబూసిన పూబోణి
మేలిమి సొగసుల రాణి
మట్టిగంధం పూసుకొన్న
మనసున్న మారాణి
మరుమల్లెల పూబోణి
మంచిముత్యాల తలదన్నే
ఆ ధరణిపుత్రిక దరహాసపు
ధగధగలకు సరితూగగలవా
ఆ నగలూనాణ్యాలూ..
ఆ శ్రమైకసౌందర్యమూర్తిని
చూసినివ్వెరపోవా...
సృష్టిలోని సోయగాలు

                          శ్రీమణి

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరంజిల్లా వారు నిర్వహించిన గురజాడ-156వ జయంతిఉత్సవాలలోభాగంగాశతాధిక కవిసమ్మేళనంలో పాల్గొని సత్కారం పొందిన శుభతరుణం మీఅందరి ఆశీస్సులుఆకాంక్షిస్తూ ...శ్రీమణి

*మనగురజాడ..*

అభ్యుదయ కవితాపితామహుడు
ఆధ్రజాతిచరిత్రలో
అలుపెరుగని
అత్యద్భుత కవీశ్వరుడు
అవిరళ కృషీవలుడు
మనిషిని మనీషిగా మార్చిన
మాన్యుడతడు
కన్యాశుల్కం కావ్యరాజమునొసగిన
కవివరేణ్యుడు
ఆధునిక సాహితీ యుగకర్తయతడు
అశేష ఆంధ్రావని గుండెల్లో
అతడెన్నటికీ కరగని జ్ఞాపకం
అభ్యుదయ కవిత్వంలో
అతడిది చెరగని సంతకం
మహిపై మనకోసం
మహాభిజ్ఞుడై
ఉదయించిన మరకతమణిమాణిక్యం
మాతృభూమి ఘనకీర్తిని
దిగ్ధిగంతాలా చాటిచెప్పిన
మహోన్నతమూర్తియతడు
వ్వవహారిక భాషోద్యమకారుడు
సాంఘికదురాచారాలపై
తన కల కరవాలం
ఝుళిపించి,
కర్తవ్యం బోధించి
కార్యోన్ముఖులను చేసి
కదంతొక్కిన కలంయోధుడు
దేశమంటే మట్టికాదని
దేశమంటే మనుషులంటూ
మనిషిమనిషిలోదేశభక్తిని
మేలుకొల్పిన కవీంద్రుడు
మతమన్నది మాసిపోవునని
మనుషుల్లో జ్ఞానదీపాలు
వెలిగించిన రవీంద్రుడు
స్త్రీలపాలిట వరమై
సంధించిన శరమై
సాంఘికసంస్కరణకై
సమరంగ గావించిన
కవిశేఖరుడు
ఆ మహనీయుని కలాన
జారిన కవనాలు
అమృతాక్షరాలై
విలసిల్లెను తెలుగునాట
నేటికీ ప్రతిధ్వనించె
ప్రతీ తెలుగునోట
పల్లవించి పాటగా
ప్రగతి పసిడిబాటగా
అతడే మనగురజాడ
ఆనాటికీ, ఏనాటికీ
ఆమహనీయుని అడుగుజాడ
తేట తెలుగు వెలుగు జాడ
ఆ మహోన్నతమూర్తికీ
ఆ మానవతా మూర్తికీ
మహాచైతన్యస్ఫూర్తికీ
ఆ సాహితీ యుగకర్తకూ నవయుగవైతాళికునికీ
ఈ చిరుకవనమాలికతో
నివాళులర్పిస్తూ....
అభివందనాలు అభిజ్ఞునికి
సహస్రకోటి వందనాలు
సాహితీమూర్తికి... *శ్రీమణి*

17, సెప్టెంబర్ 2018, సోమవారం

*సర్వసమ్మతం*


నింగిలోనచంద్రమా...
నీదేమతమూ..?
ఉప్పొంగిన సంద్రమా...
నీదేకులమూ...?
ప్రతి తనువున ప్రవహించే
రుధిరమా...నీదే జాతి?
పంచభూతాలదే మతము
పాడే కోయిలదే కులము..?
విహరించే విహంగానిదే మతము...?
వికసించేకుసుమమానిదే
కులము...?
ఆనింగికీ,నేలకూ‌....
లేని ఈ కులమతాల భారం,
మనకెందుకు కులమతాల అంతరం,
మనకెందుకు మతమౌఢ్యం
మనకెందుకు
కులాలతారతమ్యం
మనకెందుకు
ఈ కక్షాకార్పణ్యం
మనకెందుకుహింసాద్వేషం
మనకెందుకుకలహావేశం
మనమంతా..మానవులం
మనదంతా..ఒకే కులం
విశ్వక్షేత్ర శ్రామికులం
విశ్వశాంతి కాముకులం
మనమతం శాంతియుతం
ఐకమత్యమే మన అభిమతం
హిందూ ముస్లిం క్రైస్తవమూ
మతమేదైనా...సర్వసమ్మతం
వసుధైక కుటుంబమే మనజాతి
మనధ్యేయం విశ్వఖ్యాతి

                  *శ్రీమణి*

13, సెప్టెంబర్ 2018, గురువారం

వినాయకచవితి శుభాకాంక్షలుతో

తూరుపు
తెలతెలవారక
మునుపే,
వేకువ
కువకువలాడక
మునుపే....
పరుగుపరుగున వచ్చె
పార్వతీ తనయుడు
అరుదెంచె మాఇంట
విఘ్నేశ్వరుండు
ఓ మూల తెల్లారకుండా...
పదేపదే పిలిచానని
కాబోలు
పలుమార్లు తలిచానని కాబోలు
పలకరించిపోదామని
పరుగెత్తుకొచ్చాడు
ఎలుకకైన చెప్పకుండా
ఏకదంతుడేకంగా....
మా ఇంటికేతెంచాడు
ప్రమధనాధుడొచ్చాడని
పరవశమైపోయాను
సాక్షాత్కరించాడని
సంబరపడి
సాష్టాంగ దండాలు
పెట్టాను...గానీ....
మృష్టాన్న భోజ్యాలు
ఇంకా...వండనేలేదు
పాలలో ఉండ్రాళ్ళు
వేయనేలేదు
కుడుములేమో ఇంకా
ఉడకనేలేదు
పాలవల్లినింకా..
ఫలపఱచనేలేదు
అమ్మకైనా...చెప్పాడో లేదో
మరి....
ఆఘమేఘాలపై
వచ్చి కూర్చున్నాడు...
ఆకలేస్తుందంటూ..
ఆరాటపెట్టాడు
అరనిమిషమైనా....
ఆగలేనన్నాడు
ఇదిగిదిగో వస్తున్న
వక్రతుండా యనుచు
ఆమాట ఈమాటలో
పెట్టి గణపయ్యనేమార్చి
చిటికెలో వంటలను
వండివార్చాను.....
కొసరికొసరి
వడ్డించి
ముద్దుగణపతికి
ముద్దముద్దనూ...
ముదమారతినిపించి
మురిసిపోయాను.

అందరికీ వినాయక చవితి
శుభాకాంక్షలతో...శ్రీమణి

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

నే బ్రతికేసానోచ్...

ఉన్నట్టుండి ..చిమ్మచీకటి
కళ్ళముందంతా
నల్లని మబ్బు కమ్మేసినట్లు
రకరకాల రంగులు
నా కనుదోయి ముందర చిందరవందరగా...
అరఘడియలో నా మేను చల్లగా..దూదిపింజెలా తేలి
నేను  మెల్లగా అవనినొదలి అల్లంతదూరంలో...
అయోమయంగా...
అప్రయత్నంగానే
కనురెప్పలు కళ్ళను కప్పేశాయి...అప్పటికే
నాగుండె దడదడమంటూ రైలుబండిలావేగంపుంజుకుంది.
ఊపిరి ఉప్పెనలా ఎగిసిపడి
అలసి ఆగిపోయేలా వుంది.
పట్టువదలక ప్రయత్నిస్తూనే
వున్నా....ప్రాణం నిలుపుకోవాలని...
పదేపదే పెదవి కదుపుతున్నా
వదులై పోతుంది...ఈజన్మఅని,
ఎవ్వరికీ వినపడదే....
ఎన్ని మార్లు పిలిచానో...
పెదవి దాటనేలేదనుకుంటా...
పట్టించుకొన్న నాధుడే లేడు.
నా గుండె చప్పుడు స్పష్టంగా
వినబడుతుంది...
ఇక శలవా...మరి అన్నట్లు
ఎగిసిఎగిసి పడుతుంది...
ముగిసిపోతున్నట్లుంది..
మూణ్ణాళ్లముచ్చటగా...
నాజీవితం...
ముచ్చెమటలు పోస్తున్నాయి..
ముద్దెవరు చేస్తారు...మురిపెం
ఎవరందిస్తారు....నా ముద్దుల
చిన్నారులకు,
ఒప్పుకోలేక....ఓపికంతా
కూడదీసుకుని...ఒక్క నిమిషం
గట్టిగా... ప్రయత్నించా...
లాభంలేదు.....అయిపోయింది.అంతా...నిశ్శబ్ధం నేనెక్కడ...
ఉన్నానో...లేదో
ఊగిసలాడే....ఊహల
అలికిడికిమెలకువవచ్చిచూస్తే..
ఎదురుగా....ఆందోళనలో
నావాళ్ళందరూ....నాచుట్టూరా
నాకైతే...ఒక్కసారిగా
అరవాలనిపించింది...
*నే బ్రతికేసానోచ్...*
అవును....నేనుబ్రతికేవున్నాను
                *శ్రీమణి*

8, సెప్టెంబర్ 2018, శనివారం

అక్షరాస్యత


అభ్యసించాలన్నా‌.‌‌...
అక్షరీకరించాలన్నా....
గణించాలన్నా‌....
గణుతికెక్కాలన్నా.‌.
వివరించాలన్నా‌‌...
విషయాన్ని గ్రహించాలన్నా..
మనోభావాలను...
వ్యక్తపరచాలన్నా...
సమాజస్ధితిని
వీక్షించాలన్నా...
పరిస్థితిని పర్యవేక్షించాలన్నా
పరిశీలించాలన్నా‌...
పరిశోధించాలన్నా...
జ్ఞానాన్ని ఆర్జించాలన్నా...
విజ్ఞానాన్ని సముపార్జించాలన్నా...
చరిత్ర గుర్తించాలన్నా.‌..
చరిత్ర సృష్టించాలన్నా‌...
ముందడుగేయాలన్నా...
ముందుతరాలకు
మన సంస్కృతి సాంప్రదాయాలను
అందించాలన్నా...
అభివృద్ధిని అందిపుచ్చుకోవాలన్నా...
అనుకొన్నది సాధించాలన్నా...
అక్షరమేగా‌...అనువైన
ఆయుధం
మానవ మేధస్సుకు
అక్షరమేగా
అక్షయమౌ ‌‌...ఇంధనం
అక్షరమేగా అత్యద్భుత వరం
అక్షరమేగా సంధించే శరం
అక్షరాస్యత తోనే
ఆర్ధిక స్వాతంత్ర్యం
అక్షరాస్యతయేగా
అచంచల ఆత్మవిశ్వాసం
అందరినీ చదివిద్దాం‌.
సంపూర్ణ అక్షరాస్యత సాధిద్దాం
వందకూవందశాతం
అక్షరాస్యతే మన నినాదమైతే
భరతావనికదే అభివృద్ధి పధం
*✍నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శుభాకాంక్షలతో..✍*
                                    
                         *శ్రీమణి*

3, సెప్టెంబర్ 2018, సోమవారం

నిరీక్షణ


నినుచేరేదారిని
సరళంచేస్తే...
గరళాన్నయినా
చిరునవ్వుతో
సేవించేస్తా...
నిను వీక్షించగ
కనులకు భాగ్యంవస్తే
ఆపై
అంధత్వాన్నయినా
ఆనందంగా ఆహ్వానిస్తా...
ఒకపరి నీమది గెలుచుటకై
నిరంతరం నేను ఓడిపోతా...
నా ప్రణయం తెలుపగ
నా అధరాలకు భాగ్యమునిస్తే
ఆపై మూగబోయినా
నే మురిసిపోతా...
నా కన్నుల పొదరింటికి నువ్వొస్తానంటే
నూరేళ్ళైనా కనురేప్పేయక 
నిరీక్షిస్తూనే  ఉంటా !
నమ్మరాదా కృష్ణా..
ఈ రాధ ఆరాధనని..
నీకై  తెల్లవారుతోంది ఉదయం
నీ కోసమే ఆ సాయం సమయం
కలను కూడా ఆదేశిస్తా !
నిన్నే తనతో తీసుకురమ్మని
లేకుంటే  కరిగిపొమ్మని
నా జీవితాన్నే నే శాశిస్తా !
నీ జత లేదంటే  శూన్యం కమ్మని,
నువ్వొస్తావనే 
నే జీవిస్తున్నా !
నీకోసమే నిరీక్షిస్తున్నా..
నిద్దురలోనూ  మేలుకొని....
(రాధామాధవీయం)
                      శ్రీమణి