పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, జనవరి 2018, బుధవారం

మహాత్మా..🙏మన్నించు

ఏదీ రక్షణ
ఏదీ శిక్షణ
ఏదీ క్రమశిక్షణ
ఏదీ మంచి చెడుల విచక్షణ
ఏదీ దుష్ట శిక్షణ
ఏదీ శిష్ట రక్షణ
ఏదీ పర్యవేక్షణ
ఏదీ పరిపూర్ణ ప్రజా పరిరక్షణ
ఏదీ సమాజ సంప్రోక్షణ
క్షణక్షణం అనుక్షణం
అంచనాల కందని
అవినీతి భక్షణం
ఎక్కడచూసినా
కక్షా కార్పణ్యం
మొద్దు నిద్దరోతున్న
నాయకత్వ లక్షణం
ఎక్కడుందీ
సమసమాజ వీక్షణం
కాసులున్న వాడింట
నిత్యకల్యాణం
నట్టింట పట్టెడుమెతుకుల్లేక
నిరుపేదల నిరీక్షణం
ఋణం కోరల్లో రైతన్న బ్రతుకు
నిత్యం నిప్పుల తోరణం
నేటి యాంత్రిక యుగంలో
మనిషి జీవనమే ఒక రణం
మంచికి జీవన్మరణం
వంచన చుట్టూ ప్రదక్షిణం
లక్షల వ్యామోహంలో
ఒక్క క్షణమైనా..లేదు మనోవీక్షణం
మానవత్వాన్ని మాట మాత్రానికైనా
వినలేక పోతున్నాం
సాటి మనిషిని మనిషిగా
కనలేక పోతున్నాం
కారణ మెక్కడ
కారుణ్య మెక్కడ
కటికచీకటి కమ్ముకొస్తున్నా
వెలుతురు నిచ్చే నాయకుడెక్కడ
అవినీతి,అన్యాయం
అడుగడుగున స్వార్ధమనే
కాలకూట విష ధారల ధరణి
తడిసి ముద్దవుతున్నా
ఉద్దరించే నాధుడెక్కడ
ఎక్కడ నిజాయితీ నిబద్దత
ఎక్కడ నిస్వార్ధపు ప్రజానేత
ఏదీ నిష్కంళక రాజకీయత
ఏదీ నిజమైన ప్రజాస్వామ్యత
ఏదీస్వాతంత్ర్య ఫల పరిపూర్ణత
మన్నించుమా..మమ్ము
మహనీయమూర్తీ
మరచిపోయామ్మేము...
మీ మహోన్నతస్ఫూర్తి
మహాత్మా... మన్నించు
వీలయితే.. మళ్ళీ జన్మించు
మానవజాతి పరివర్తన కోసం
స్వచ్ఛ భారత జాగృతి కోసం
(మహత్మా గాంధీ వర్ధంతి స్మరణలో)
సాలిపల్లిమంగామణి (శ్రీమణి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి