పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, జనవరి 2018, బుధవారం

మహాత్మా..🙏మన్నించు

ఏదీ రక్షణ
ఏదీ శిక్షణ
ఏదీ క్రమశిక్షణ
ఏదీ మంచి చెడుల విచక్షణ
ఏదీ దుష్ట శిక్షణ
ఏదీ శిష్ట రక్షణ
ఏదీ పర్యవేక్షణ
ఏదీ పరిపూర్ణ ప్రజా పరిరక్షణ
ఏదీ సమాజ సంప్రోక్షణ
క్షణక్షణం అనుక్షణం
అంచనాల కందని
అవినీతి భక్షణం
ఎక్కడచూసినా
కక్షా కార్పణ్యం
మొద్దు నిద్దరోతున్న
నాయకత్వ లక్షణం
ఎక్కడుందీ
సమసమాజ వీక్షణం
కాసులున్న వాడింట
నిత్యకల్యాణం
నట్టింట పట్టెడుమెతుకుల్లేక
నిరుపేదల నిరీక్షణం
ఋణం కోరల్లో రైతన్న బ్రతుకు
నిత్యం నిప్పుల తోరణం
నేటి యాంత్రిక యుగంలో
మనిషి జీవనమే ఒక రణం
మంచికి జీవన్మరణం
వంచన చుట్టూ ప్రదక్షిణం
లక్షల వ్యామోహంలో
ఒక్క క్షణమైనా..లేదు మనోవీక్షణం
మానవత్వాన్ని మాట మాత్రానికైనా
వినలేక పోతున్నాం
సాటి మనిషిని మనిషిగా
కనలేక పోతున్నాం
కారణ మెక్కడ
కారుణ్య మెక్కడ
కటికచీకటి కమ్ముకొస్తున్నా
వెలుతురు నిచ్చే నాయకుడెక్కడ
అవినీతి,అన్యాయం
అడుగడుగున స్వార్ధమనే
కాలకూట విష ధారల ధరణి
తడిసి ముద్దవుతున్నా
ఉద్దరించే నాధుడెక్కడ
ఎక్కడ నిజాయితీ నిబద్దత
ఎక్కడ నిస్వార్ధపు ప్రజానేత
ఏదీ నిష్కంళక రాజకీయత
ఏదీ నిజమైన ప్రజాస్వామ్యత
ఏదీస్వాతంత్ర్య ఫల పరిపూర్ణత
మన్నించుమా..మమ్ము
మహనీయమూర్తీ
మరచిపోయామ్మేము...
మీ మహోన్నతస్ఫూర్తి
మహాత్మా... మన్నించు
వీలయితే.. మళ్ళీ జన్మించు
మానవజాతి పరివర్తన కోసం
స్వచ్ఛ భారత జాగృతి కోసం
(మహత్మా గాంధీ వర్ధంతి స్మరణలో)
సాలిపల్లిమంగామణి (శ్రీమణి)

26, జనవరి 2018, శుక్రవారం

69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో

తరాలెన్ని మారినా
చెరలన్నీ వీడినా
స్వాతంత్ర్యం వచ్చినా
గణతంత్రం ప్రకటించినా
మన మంత్రం మాత్రం
అడుగడుగున కుతంత్రం
అణువణువణువునా
అలుముకొన్న అవినీతి తంత్రం
మానవత్వం మరచి మానవుడు
అవతరించె మరయంత్రంగా..ఇక
ఫలమేదీ జాతికి, ప్రతిఫలమేదీ
స్వతంత్ర భారతికి
మారాలి ఈతరం
మారాలి మనమందరం
చెరిపేయాలి మనుషుల
మద్యన అంతరం
కావాలి మంచి మానవతే
మన అందరి ఆచారం
అలవర్చుకోవాలి సాటి
మనిషికి సాయపడే
చక్కని సంస్కారం
అది మన జాతికే మహత్తరవరం
ఆలపించాలి తరంతరం
నిరంతరం వందేమాతరం
ఆమార్పే స్వతంత్ర భరతావని
మెడలో మణిమయ హారం

69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో

సాలిపల్లిమంగామణి (శ్రీమణి)

24, జనవరి 2018, బుధవారం

"మహి"ళ జాతీయబాలికలదినోత్సవంసందర్భంగా...

ఆడుబుట్టువు లేక ఆదిఅంతములేదు 
సుదతి  లేని  సృష్టి శూన్యమేగా.. !ఇక
మహిళ లేని మహిపై మనుగడేదీ
పడతి పుట్టుక లేక పరిపూర్ణతుండునా..
ఇభయాన లేని ఇహముండునటయా..
కలకంఠి లేక కళగట్టునానేల
అనంతజీవన ప్రస్థానంలో 
ఆమే జగతికి ప్రధమస్ధానం
అరుదగు వాక్యం స్త్రీ మూర్తి 
అక్షరాలకందని భావం 
అత్యధ్భుత కావ్యం
అనంతసృష్టికి ప్రతిరూపం 
అమృతమయమవు 
ఉర్వీ రూపం
అమ్మాయి గా పుట్టి 
అర్ధాంగిగా మెట్టి 
అమ్మగా మరుజన్మమెత్తి 
బామ్మగా పదవి  చేపట్టి 
అడుగడుగునా త్యాగం,
అంతులేని అనురాగం 
రంగరించి అద్భుతమైన స్త్రీ జన్మను 
సఫలం గావించిన స్త్రీ మూర్తిని 
పొగిడేందుకు చాలునా 
పృధివి పైన పదాలు. 
రాసేందుకు చాలునా... రాతాక్షరాలు, 
ఊహించగలమా !
మహిళ లేని మహిఆనవాలు 
పసికందులను త్రుంచి,
త్రృణప్రాయముగనెంచి
ఆదిమూలమునందె చిదిమిపారేదురే...
జననిలేదన్నచో జగమున్నదటయా...
యోచించిచూడరే ఒక ఘడియయినా
పూజించుపడతిని..
పుడమితల్లిగనెంచి
గౌరవించుము తనని ఆదిశక్తిగతలచి...
(జాతీయబాలికలదినోత్సవంసందర్భంగా...
ఎంతోమంది గర్భస్ధశిశువు ఆడపిల్లలని తెలుసుకొనిఆదిలోనే అంతంగావిస్తున్న..పైశాచిక చర్యను నిరసిస్తూ...ఆడుబిడ్డలను కాపాడమని...అభ్యర్థిస్తూ...)
           సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

23, జనవరి 2018, మంగళవారం

22, జనవరి 2018, సోమవారం

🙏చక్కనయ్యా🌹అక్కినేని..🙏

మహాశిఖరం నేలకొరిగిపోయింది 
మహావృక్షం మట్టి కలసి పోయింది  
మహోజ్వల తేజం మసకబారి పోయింది
మహానటసామ్రట్ట ధీరం 
మరలరాని లోకాలకు తరలిపోయింది 
చలన చిత్ర సీమలో మహాధ్యాయం  
మధుర పుటలతో ముగిసిపోయింది 
వెండితెర నిండు చంద్రుడు
వన్నె తరగని వెన్నెలిచ్చి
పసిడి స్మృతులను పదిలపరచి
స్వర్ణచరితకు పయనమాయెను

ఓ ఆంధ్ర తేజమా
ఓ ఆంధ్రజాతి ఆణిముత్యమా
ఓ అసమాన నటసౌరభమా
అశేష ప్రేక్షకుల గుండెల్లో
నెలవైన ఆంధ్రుల ఆరాధ్య
నవరస నటసామ్రాట్...
చక్కనయ్యా..అక్కినేనీ
అందుకో..మాలెక్కలేనన్ని
హృదయాల కడపటి కన్నీటి వీడుకోలు
అశ్రుతప్త నయనాలతో 

సాలిపల్లిమంగామణి (శ్రీమణి)
                                              (పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరణవార్త తెలిసిన మరునిమిషం బరువెక్కిన హృదయంతో నే రాసుకున్న
చిరుకవనం,)

ఓం శ్రీ సరస్వతీ దేవ్యైనమః

జననీ జ్ఞానప్రదాయిని శ్రీవాణీ
విద్యున్మాలిని  వీణాపాణీ శర్వాణీ...
సౌదామినీ శాస్త్రరూపిణీ సువాసినీ....
అక్షర రూపిణీ అమృతవర్షిణీ
అర్చింతును హంసవాహినీ
నిను అక్షర మాలికల తోడ
నిత్యం కొలుచు కొందు
కొంగు బంగరు తల్లీ
నిను చిరు కవనమ్ముల తోడ
ప్రణమిల్లెద పద్మలోచనీ 
నీ పాదాల చెంత
కవితా కుసుమాలతో
అనుగ్రహించు అక్షరరూపిణీ
ఈ సాహిత్యాంబుధిలో
నీటి బొట్టై  నిలిచేందుకు
ఆశీస్సులందించు అమృతవర్షిణీ
మా హృదయంలో అనునిత్యం నువ్వుదయించీ...
మాపై నీ దయ నుంచీ ప్రసరింపుము
పలుకు తేనెల తల్లి సాహితీ కల్పవల్లి
నీ కృపాకరుణా కటాక్ష వీక్షణాలు  
నా ఈ చిరు కవితార్చనపై

వసంతపంచమి శుభదినం సరస్వతీ దేవి పాదపద్మములకు  చిరు కవితార్చన

సాలిపల్లిమంగామణి (శ్రీమణి)
                                             

12, జనవరి 2018, శుక్రవారం

ఓమహర్షీ-ఓమార్గదర్శీ

ఓమహర్షీ-ఓమార్గదర్శీ
స్వామీ వివేకానంద

జీవుడే దేవుడనీ,
శక్తియే జీవితమని
బలహీనత మరణమనీ
భయం పెద్ద పాపమనీ
నిర్భయంగా సాగమనీ
యువతే భవితకు మూలమనీ
ఆత్మస్థైర్యమే ఆయుధమని
విజ్ఞానమే విలువగు ధనమనీ
అజ్ఞానం ఛేదించమని
చదువుకు సంస్కారం ఆవశ్యకమనీ
స్త్రీ శక్తే జాతికి జీవధాతువనీ
ప్రేమతత్వం విడనాడ వలదనీ
దరిద్రనారాయణ సేవే
మానవ జాతికి పరమావధి యని
ఆరంభం అతిచిన్నదయినా
ఘనమగు ఫలితం తధ్యమని
లక్ష్యసాధనకు గమ్యం ఆవశ్యమని
జాతికి హితమును
హితవుగా ప్రభోదించి
అఖండ భారతాన్ని
తన జ్ఞాన ప్రభలతో
జాగృతమొనరించిన
ఆధ్యాత్మిక అద్వితీయ శక్తి
సనాతన ధర్మ సంరక్షణకై
అహర్నిశలు శ్రమించిన
అలుపెరుగని ఋషీ
నిరంతర సత్యాన్వేషీ

ఓమనీషీ
ఓ మహర్షీ
ఓమహోన్నతమూర్తీ
ఓ మార్గదర్శీ
ఓమానవతాచక్రవర్తీ
ఓమనోజ్ఞమూర్తీ
చిరుప్రాయమందునే నీవుఅమరుడవైనా
ధరిత్రి వున్నంత వరకూ
తరతరాల చరిత్రలో
చెరగని చరిత్రవే నీవు
అమృత తుల్యమగు
మీ దివ్య సూక్తులే
మాకు శిరోధార్యం
ఆనాటి
మీఅడుగుజాడలే
మాకు శ్రీరామరక్ష..

స్వామీవివేకానందుని
జయంతి సందర్భంగా
సాలిపల్లిమంగామణి (శ్రీమణి)

11, జనవరి 2018, గురువారం

Indian blogger awards2017

Indiblogger.in ప్రతీ ఏటా నిర్వహించే ఇండియన్ బ్లాగర్ అవార్డ్స్ లో తెలుగు కేటగిరిలో  నా బ్లాగ్
https://pandoorucheruvugattu.blogspot.com కు
Indian blogger 2017 award వచ్చిందని మిత్రులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

10, జనవరి 2018, బుధవారం

రాధారాధన

నిను చేరే దారిని  సరళం చేస్తే
గరళాన్నైనా చిరు నవ్వుతో సేవించేస్తా !
నిన్ను చూడగ కనులకు కానుకనిస్తే
కటిక చీకటినైనా ఆహ్వానిస్తా
నా ప్రణయం తెలుపగ 
నా అధరాలకు భాగ్యమునిస్తే
ఆపై మూగబోయినా
నే మురిసిపోతా...
నీ మనసును ఒకపరి గెలుచుటకై ,
నిరంతరమూ నే ఓడిపోతా !
నా కన్నుల పొదరింటికి నువ్వొస్తానంటే
నూరేళ్ళైనా కనురేప్పేయక  
నిరీక్షిస్తూనే  ఉంటా !
నమ్మరాదా కృష్ణా..
ఈ రాధ ఆరాధనని..
నీకై  తెల్లవారుతోంది ఉదయం
నీ కోసమే ఆ సాయం సమయం
కలను కూడా ఆదేశిస్తా !
నిన్నే తనతో తీసుకురమ్మని .
లేకుంటే  కరిగిపొమ్మని .
ఇల నా జీవితాన్నే శాశిస్తా !
నీ జత లేదంటే  శూన్యం కమ్మని,
నువ్వోస్తావనే  
నే జీవిస్తున్నా !
నీకోసమే నిరీక్షిస్తున్నా..
నిద్దురలోనూ  మేలుకొని....

సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

<a href="https://www.indiblogger.in/iba/2017/winners/regional-languages" target="_blank"><img src="https://indiblogger.s3.amazonaws.com/iba/winners-2017/winner-poster-10225.png" alt="Winner of The Indian Blogger Awards 2017 - Regional Languages"></a>