నిత్యం ఘోషించే సంద్రానికి నోరెండిపోతుందా ...
అలుపెరుగక అవనిని పాలించే ఆ సూరీడుకి ఆటవిడుపు ఏనాడు !
నిత్యం వీచే గాలికి విశ్రాంతి ఏ క్షణమైనా .. దొరికేనా !
నిశిరాతిరిలోను నిదుర మరచి పాలించే రేరాజు సెలవు తీసుకొన్నాడా !
అంతెందుకు ఆకాశం రాజీనామా చేస్తుందా
ఆ నీలి మబ్బు పదవీ విరమణ చేస్తుందా !
ఆగి కూర్చుంటుందా అరక్షణమైనా ! ఆ సాగే సెలయేరు
మీ ప్రాణికోటి బరువుకి తల్లడిల్లి
తనవల్ల కాదంటూ చేతులెత్తెస్తుందా .. మన పుడమి తల్లి
అమ్మే పురిటినొప్పులు సహించనంటే మనకీ జన్మెక్కడిది
మనకై పాటుపడే
పంచభూతాలకు , ప్రకృతికీ లేని విసుగూ ,అలసట ;అసహనం ,నిరాశ
మనకోసం మనమే పాటుపడే మానవాళికి మాత్రం ఎందుకు ?
ఆశావహ దృక్పధానికి ఆదర్శం సృష్టి లోని ప్రతి అణువు
అందుకే ఆశతోనే జీవించు ఆశయాల తీరం చేరడానికి
అలుపెరుగక శ్రమించు
అనుకొన్నది సాధించడానికి
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి