పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, మే 2014, శుక్రవారం

సవరించిన నా కురుల సాక్షిగా !


సవరించిన నా కురుల సాక్షిగా !నేనే  నీ జవరాలిని .
 చేసుకొన్న బాసల తోడు  నేనే నీ సరిజోడు
నా తుది  శ్వాస వరకు నా ఉనికి  నీ కొరకే 
నా మనసు  నిరంతరం  నీ  హృదయంలోనే  మసలుతోంది  మోన  సుందరిలా 
 దాని  మోనరాగమాలకించి  నీ  ప్రణయ  రస  సామ్రాజ్ఞిగా  పదిలపరచుకోవా 
 బరువై పోయిన  నా  కనురెప్పల చాటుకు  అరుదెంచావు  కమ్మని కలవై 
వేవేల  వర్ణాల నా స్వప్న లోకాన  విహరించి నీ మేను అలసియున్నదేమో 
సేద  తీర్చెద  రావా  నీ  నెచ్చెలి  వెచ్చని  ఒడిలో    
నా  కనుసన్నల  నీ  రూపం   సమ్మోహనమవుతుంటే
  నా  అధరపుటంచుల  నీ తలపులు   వలపుల వానై  మధువొలకబోసే 
అదుపు  తప్పి  నీ  ఆశలు ఆకాశపుటంచులపై  నా  చిత్రమే  గీస్తుంటే 
 చిత్తరువై  నిలుచున్నాయ్ నీలి మేఘ మాలికలు 
సృష్టిలోని  బంధాలన్నీ  మాటరాక  నిలుచున్నాయ్ .  మన ప్రణయ బంధాన్ని చూసి 
అద్భుతానికే  అచ్చేరువేసింది  అత్యద్భుతమైన  మన ప్రణయ పరిమళాన్ని పసిగట్టి 
అమృతానికీ  ఆకలయింది  మన ప్రేమ సుధను  ఒక్క మారైనా ఆశ్వాదించాలని 
ఆలోచించకుండా  సంతకం పెట్టింది  ప్రేమదేవత
 మన జంట హృదయాల పైన  పసిడి  అక్షరాలతో 
ప్రేమ  విజేతలయ్యారని (శ్రీను +మణి=శ్రీమణి )
                                               ప్రేమాభివందనాలతో (ప్రేమికులందరికీ )

                                                                   సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

29, మే 2014, గురువారం

నేనే ముఖ్యమంత్రి నయితే



అద్భుతాలు సాధించలేకున్నా  అనుకొన్నదిమాత్రం   సాధిస్తా
అవినీతి పరులను   అమాంతంగా అధఃపాతాళానికి  తోసేస్తా 
నింగికెగసిన  నిత్యావసరాల  ధరలకు నిచ్చెన లాగి పారేస్తా 
అడ్డగోలు దళారుల ఆగడాలు  అణచేస్తా 
తల్లిదండ్రులను తరిమేసిన తనయుల  తాట వలిచేస్తా 
అబలల  కన్యాయం  చేసినోళ్ళ తోళ్ళు  వలిచి  చెప్పులు కుట్టిస్తా 
 బడుగు జీవి బ్రతుకుల్లో పచ్చడి మెతుకులు బదులు  పరమాన్నమే వడ్డిస్తా 
  బలిసినోడికి  పచ్చడి మెతుకులు కూడా చవి చూపిస్తా 
 తెలుగు జాతి  కీర్తి బావుటా ఎల్లలు దాటి ఎగెరేస్తా
  కుల మతాల  వివక్షతను  కూకటి వేళ్ళతో పెకలిస్తా 
సమ సమాజ స్థాపనకై అహర్నిశలు   శ్రమిస్తా
వరకట్నపిశాచాల పీచమణిచి వేసేస్తా
అలసి ఉన్న జీవితాల పాలిట ఆపన్నహస్తమవుతా
సీమాంద్ర ను   స్వర్గసీమగా  మలిచేందుకు తుది ఘడియ వరకు శ్రమిస్తా
అదృష్టవశాత్తూ ఆంధ్ర బిడ్డనైనందుకు తెలుగుతల్లి ఋణం  కొంతైనా తీరుస్తా


                                                                                      సాలిపల్లి  మంగామణి  @శ్రీమణి 


25, మే 2014, ఆదివారం

అలుపెరుగక సాగిపో ఆశయాల తీరం కై

          

పడిలేచే  కెరటానికి ఇసుమంతైనా ఉందా  ! అలసట
నిత్యం ఘోషించే సంద్రానికి నోరెండిపోతుందా ... 
అలుపెరుగక అవనిని పాలించే ఆ సూరీడుకి ఆటవిడుపు ఏనాడు !
నిత్యం వీచే గాలికి  విశ్రాంతి ఏ క్షణమైనా .. దొరికేనా !
నిశిరాతిరిలోను నిదుర మరచి పాలించే రేరాజు  సెలవు తీసుకొన్నాడా !
అంతెందుకు ఆకాశం  రాజీనామా చేస్తుందా 
ఆ  నీలి మబ్బు  పదవీ విరమణ  చేస్తుందా !
ఆగి  కూర్చుంటుందా అరక్షణమైనా ! ఆ సాగే  సెలయేరు 
మీ ప్రాణికోటి బరువుకి తల్లడిల్లి 
తనవల్ల  కాదంటూ  చేతులెత్తెస్తుందా .. మన పుడమి తల్లి 
అమ్మే పురిటినొప్పులు  సహించనంటే  మనకీ  జన్మెక్కడిది 
మనకై  పాటుపడే 
పంచభూతాలకు , ప్రకృతికీ  లేని  విసుగూ ,అలసట ;అసహనం ,నిరాశ 
మనకోసం  మనమే  పాటుపడే  మానవాళికి  మాత్రం ఎందుకు ?
ఆశావహ దృక్పధానికి ఆదర్శం  సృష్టి లోని  ప్రతి అణువు 
అందుకే  ఆశతోనే జీవించు  ఆశయాల  తీరం  చేరడానికి 
అలుపెరుగక  శ్రమించు 
అనుకొన్నది  సాధించడానికి 

                                                                                సాలిపల్లి మంగా మణి @శ్రీమణి