పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జూన్ 2020, మంగళవారం

*రాళ్ళెత్తిన కూలీలు*


తరతరాలుగా

రాళ్ళెత్తిన కూలీలెవరూ

రాళ్ళెత్తిన కూలీలెవరని

గళాలు ప్రశ్నించడమూ

కలాలు పదేపదే

కదిలించడమూ ఏళ్ళ తరబడి

పరిపాటే గానీ

ఆ రాళ్ళెత్తిన జీవితాలు

రగిలిపోతున్నా...నిజానికి

కనీసం చీమకుట్టినట్టైనా

వుందా బండరాతి సమాజానికి

కంటితుడుపుమాత్రమే

ఒకింత ఓదార్పునైనా 

 ఇచ్చేనా ఈ ఉత్తుత్తిమాటలు

అట్టడుగు బడుగు

జీవితాలెపుడూ

కడగండ్ల గుదిబండలే

ఆదరణ కరువైన 

ఆ బతుకులెపుడూ

సమాధానం దొరకని 

జటిల ప్రశ్నాపత్రాలే

కన్నీటి సిరాలో కరిగిన

బతుకుచిత్రాలే

నిలువెల్లా కరిగిపోతున్నా

నిలువు నీడకూడా

దొరకని నిర్భాగ్యుల

నిర్లిప్త జీవితాలవి

కష్టాలు కన్నీళ్ళకు 

ఆలవాలమైన

కల్లోలజీవితాలవి

వీరికథ పాళీలకే పరిమితం

రాతలలో మాత్రమే రాళ్ళెత్తే

కూలీల ప్రస్తావన

వాస్తవంలో మాత్రం

వారిది అరణ్యరోదన

అడుగడుగున ఆరాటమే

ఎడతెగని పోరాటమే

గతుకుల బ్రతుకు వీధుల్లో

పిడికెడు మెతుకులకై

కడివెడు కన్నీళ్ళే

బ్రతుకు జీవనమంతా

బహు దుర్భరమే

అన్ళీ కాలే కడుపులూ

రాలే బతుకులే

నిరంతర శ్రమజీవులు

నిర్లక్ష్యానికి గురైన

నిర్భాగ్యజీవితాలు

ఒట్టిమాటలు కట్టిపెట్టి

గట్టిమేలు తలపెట్టే

శుభతరుణం వచ్చేవరకూ

వేసారిన జీవితాలకు

వెలుతురు రాగం

ఆమడదూరమే.


*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

29, జూన్ 2020, సోమవారం

అమ్మపెట్టిన అందాలగోరింట

అరుణారుణ

కిరణంలా....

ఎర్రగా పండిన 

నా అరచేతి 

గోరింటనుచూసి

మూగబోయింది

మా పెరటి

ముద్దమందారం...

విరబూసిన 

నా అరచేతినిగని, 

వికసించిన సుమమనుకొని,

ఝుమ్మని తుమ్మెద

ఝంకారం... చేసింది.

తమజాబిలి‌...తరలివెళ్ళి

తరుణిఅరచేత

 కొలువుదీరెనా...అని

తరచితరచి

చూసింది ఆకాశం

ఆశ్చర్యంగా....!

అతిశయమనుకోవద్దు

అందంగా పండింది 

ఆషాఢమాసంలో

నా అరచేయి..

అమ్మ తన అనురాగాన్నంతా

రంగరించి పెట్టింది మరి

అద్భుతంగా పండదా...మరి...

అందగా ఉండదా...మరి.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

28, జూన్ 2020, ఆదివారం

మేలిపొద్దులీయవా...

కథ ముగిసేదేనాడో
వ్యథ సమసేదేనాడో
తూరుపుదారులనిండా 
కూరుకుపోయిన 
నిట్టూరుపురాగాలకు
తెరదించేదేనాడో
ఎప్పుడు వెలిసిపోతాయో
మానస గగనంలో ముసిరేసిన
నైరాశ్యపు మేఘాలు
ఎప్పుడు కలిసిపోతాయో
కాలగర్భంలో కాటేసేరోగాలు
మానవజాతినెల్ల వల్లకాటి 
పరం చేస్తున్న ఆ కలికాలపు 
మహమ్మారికి చెల్లుచీటీ ఏనాడో
మా స్వేచ్ఛకు కంచెలు వేసిన 
ఆ నయవంచక చైనాపుత్రిక
కుత్తుక తెగిపడేదేనాడో
మా ఆశలరెక్కలు విరిచేసిన
వింతపురుగు మరుగయ్యేదేనాడో
నల్లని ఈదినములెల్ల
తెల్లారేదేనాడో 
పెల్లుబికిన ఈ పెనువిధ్వంసం
చల్లారేదేనాడో
జాలి లేని దేవుడా
మేలిపొద్దులీయవా...
సోలిపోతున్న మానవాళికి
మేలుకొలుపు పాడవా..

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

26, జూన్ 2020, శుక్రవారం

నిజం చెప్పవా...కృష్ణా!

నిజం చెప్పవా...కృష్ణా!
నే... నీదానను కానా..
నీవు లేక నిమిషమైన
నేనుండగలనా...
నిన్నటి నీమాటలన్నీ...
నీటి మీద రాతలా..
చేసుకొన్న బాసలన్నీ..
చెరిగిపోయే ఊసులా...
పెనవేసుకొన్న  మన
మనసుల కధలన్నీ
ఒట్టి కట్టుకధలేనా...
నువ్వుండేదా...గగనంలో
నేనేమో...ఇలాతలంలో
ఆశలరెక్కలతో
విహంగమై విహరిస్తున్నా..
అలుపెరుగని పయనంలో
అనుక్షణమూ...నీకోసం
అన్వేషిస్తున్నా...
ఎన్ని జన్మలెత్తాలిక
వెన్నదొంగా...
నీ పద సన్నిధి చేరగా...
చెప్పు నిజంగా...
నల్లని వాడా...నావల్లకాదిక
తనువంతా కనులై
వేచియుంది.....ఇదిగో...నీరాధిక
        (రాధమాధవీయం)
సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

8, జూన్ 2020, సోమవారం

5, జూన్ 2020, శుక్రవారం

వింతలోకం

మాయదారిప్రపంచమిదిమనుగడంటే మరణమేమానవత్వం,మాన్యతత్త్వంఎడారిలో పూచినపూలువిస్తుపోయే వింతలోకంఎంత దోస్తే అంతపైకంఅడుగడుగున కుట్రాకుతంత్రంఅవనియంతా అవినీతి తంత్రంఎండిపోయిన బ్రతుకు దారిలోమండిపోతున్ప గుండెఛాయలేధరలగుర్రం ధరణినొదిలి ఆకసానికి దౌడుతీసేపైస దక్కక పైరుమళ్ళోబోరుమంటూ భూమినేస్తంఏమిన్యాయమో..ఇదేపాటి ధర్మమో..మంచం లేచిన మొదలు లంఛమే లాంచనమిక్కడమరకలంటిన మనస్తత్వంమసకబారిన మనిషితత్వంపెచ్చుమీరిన కలికాల పైత్యంకాసులకైంకర్యమే  నేటి సమాజ నిత్యకృత్యం.
సాలిపల్లి మంగామణి(శ్రీమణి)

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

మనసంతా నువ్వే..






మౌనంగా...ఉన్నా...
నా మనసంతా నువ్వే...
మాటలాడ లేకున్నా...
నా ధ్యాసంతా... నువ్వే
నా కనుపాపలో నిన్ను
కాపాడుకొంటున్నా...
కవి(కవయిత్రి)ని కదా...కవనంతో
కాలం గడిపేస్తున్నా....
అక్షరాలతో..నిన్ను అభిషేకిస్తున్నా...
నా పద భావాలపల్లకిలో
ఊరేగిస్తున్నా....
నీ ఊహలకు 
ఊయలేసి
ఊరడిస్తూనే ఉన్నా...
నీతలపులలో
తలవాల్చుకు 
 నిదురిస్తున్నా....
మరచిపోలేను..ప్రభూ...
నువు నా మది గీసిన చిత్తరువు
విడిచిపోలేను...ప్రభూ
నా ప్రతి శ్వాస లోనూ...నీవు.
(రాధమ్మ కవనంలో కిట్టయ్య స్మరణం)
                      శ్రీమణి

12, జనవరి 2020, ఆదివారం

ఓమహర్షీ-ఓమార్గదర్శీ

ఓమహర్షీ-ఓమార్గదర్శీ
(స్వామీ వివేకానంద)

జీవుడే దేవుడనీ, 
శక్తియే జీవితమని
బలహీనత మరణమనీ 
భయం పెద్ద పాపమనీ
నిర్భయంగా సాగమనీ
యువతే భవితకు మూలమనీ
ఆత్మస్థైర్యమే ఆయుధమని
విజ్ఞానమే విలువగు ధనమనీ
అజ్ఞానం ఛేదించమని
చదువుకు సంస్కారం ఆవశ్యకమనీ
స్త్రీ శక్తే జాతికి జీవధాతువనీ
ప్రేమతత్వం విడనాడ వలదనీ
దరిద్రనారాయణ సేవే 
మానవ జాతికి పరమావధి యని
ఆరంభం అతిచిన్నదయినా
ఘనమగు ఫలితం తధ్యమని
లక్ష్యసాధనకు గమ్యం ఆవశ్యమని
జాతికి హితమును 
హితవుగా ప్రభోదించి 
అఖండ భారతాన్ని 
తన జ్ఞాన ప్రభలతో 
జాగృతమొనరించిన 
ఆధ్యాత్మిక అద్వితీయ శక్తి
సనాతన ధర్మ సంరక్షణకై
అహర్నిశలు శ్రమించిన
అలుపెరుగని ఋషీ
నిరంతర సత్యాన్వేషీ

ఓమనీషీ
ఓ మహర్షీ
ఓమహోన్నతమూర్తీ
ఓ మార్గదర్శీ
ఓమానవతాచక్రవర్తీ
ఓమనోజ్ఞమూర్తీ
చిరుప్రాయమందునే నీవుఅమరుడవైనా
ధరిత్రి వున్నంత వరకూ 
తరతరాల చరిత్రలో
చెరగని చరిత్రవే నీవు
అమృత తుల్యమగు
మీ దివ్య సూక్తులే 
మాకు శిరోధార్యం
ఆనాటి 
మీఅడుగుజాడలే
మాకు శ్రీరామరక్ష..

స్వామీవివేకానందుని 
జయంతి సందర్భంగా
సాలిపల్లిమంగామణి (శ్రీమణి)

27, ఫిబ్రవరి 2019, బుధవారం

జాబిలికి జాబు






ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన 
తియతీయని భావాలను 
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగాననో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..
ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన
తియతీయని భావాలను
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగాననో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..

జాబిలి నాకిచ్చిన
జవాబు కాబోలు‌....
శ్రీమణి  

23, ఫిబ్రవరి 2019, శనివారం

హతవిధీ

అతుకుల,గతుకుల
బ్రతుకుబాటలో....
బితుకు,బితుకుమని
మెతుకులు కోసం
వెతుకులాటలివి
వెతలే...గతులై
చితికిపోతున్న
చిన్నారుల,కన్నీటి కతలివి.
ఆదుకొన...లేక
అతీ...గతీ....చూడలేక
అక్కున చేర్చుకోనూలేక
చేతకాక....
చేయూత నీయలేక
హతవిధీ...అని
చతికిలపడి
చేతలుడిగి నే రాస్తున్న
చేతగాని రాతలివి
ఆ అభాగ్యులనాదుకొనగ
ఆర్తితో,అభ్యర్ధన చేయ
ఆభగవంతునికి
నాదు కన్నీటిజోతలివి😰
శ్రీమణి

అఖండజ్యోతి..."స్త్రీ" మూర్తి

అమృతమూర్తీ...
ఓ  "స్త్రీ"మూర్తీ
ఆదిశక్తీ...
అవనిపై వెలిగే  
''అఖండ జ్యోతీ ''
ఏ కవి వర్ణించగలడు 
నీ  స్త్రీ జాతి కీర్తి
ముత్తెపు సిరుల 
మృదు దరహాసం
ముదితా ....నీ  సొంతం
మంచు తుంపరల
చల్లదనం నీ మది సాంతం
నీ  ఆదరణతో ..ఆ ధరణిని తలపించీ,నీ ఔదార్యం ఈఅవనికి ఆభరణం చేసీ
మమత మానవత 
నిర్వచనం నీవై
అనురాగం ఆప్యాయత  చిరునామావై
అనంత సృష్టికి ప్రతిరూపం నీవై
జగతిని వెలిగించే దీపం నీవై
ఓ  జననివై
తనయవై
సహోదరి నీవై
సహధర్మచారిణివై
నీ కర్తవ్య పాలనలో
కృతకృత్యురాలవై
అన్నింటా  నీ జాతి
ముందడుగేస్తున్నా ..
కన్నీట కరుగుతున్న కధలెన్నెన్నో ..
కటికచీకట్లో మ్రగ్గుతున్న వ్యధలెన్నెన్నో...
స్త్రీ ని గౌరవించండీ
అదే....జాతిప్రగతి
అతివను రక్షించకుంటే
అదిఅవనికి...అధోఃగతి
మహిళను పూజించుటయే మనమహోన్నతసంస్కృతి
కాపాడండి...స్ర్తీజాతిని
ఇనుమడింపచేయండి
మహిళాఖ్యాతిని
ద్విగుణీకృతం గావించండి
దివ్యమైన వనితాశక్తిని
పెంపొందించండి
అతివలోధైర్యమూ..స్ధైర్యమూ,
సహకరించి,ప్రోత్సహించి
ప్రోద్భలమందించి..
అన్నదమ్ములందరినీఅభ్యర్ధిస్తూ
మహిలో మహిళామూర్తులను
గౌరవించే
మహోన్నతమూర్తులందరికీ
సహస్రకోటి వందనాలతో
        .... శ్రీమణి

20, ఫిబ్రవరి 2019, బుధవారం

జాబిలికి జాబు

ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన
తియతీయని భావాలను
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగాననో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..
జాబిలి నాకిచ్చిన
జవాబు కాబోలు‌....
                  శ్రీమణి