పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, ఆగస్టు 2023, మంగళవారం

చంద్రయాన్3.. పసిడిపర్వం

చంద్రయాన్3...పసిడిపర్వం

భూభాగమును వీడి
నీలిమేఘములకేగి 
హాయి హాయిగ సాగి జాగుసేయక
చంద్రబింబమును చుంబించాలని ఆశ
(చిన్ననాడు నే రాసుకున్న కవిత)
కోరిక నెరవేరేలానే వుంది
కూతవేటు దూరంలోనే ఆశకు ఆధారం
కనిపిస్తుంది
నాకైతే అందాల చందమామ అందేసిందనిపిస్తుంది 
చిత్రం కదూ...
చంటిపాప ఏడ్వడమేంటో
చందమామ రావడమేంటో
కలువలు విరబూయడమేంటో
చలువలరేడు వెన్నెలొలకబోయడమేంటో
నువ్వొస్తావని నువ్వొస్తావని
అమ్మ చెప్పిన 
ఆ కమ్మని అబద్ధం
నమ్మాలనే వుంది
నీపై నే రాసుకున్న కవనపూల సుగంధం
ఎదను ఇంకా మీటుతునే వుంది
ప్రతిపున్నమికీ ఆరుబయట జాబిలితో
ఊసులు అలవాటే
ఆపై మామను అక్షరాలలో బంధించడమూ నాకు 
పరిపాటే....

ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన 
తియతీయని భావాలను 
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగానో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..
జాబిలి నాకిచ్చిన 
జవాబు కాబోలు‌.

ఇలా...సాగిపోయేది జాబిలితో
నా మనోవిహారం..
కానీ నీ జాడ తెలిసాకా....
అడుగులు నేలపై నిలబడడం లేదు
ఆలోచనలు అంతరిక్షాన్ని విడిచిపెట్టడమూ లేదు
మట్టిలో కలిసే లోపు మహత్తరమైన ఘట్టాన్ని
వీక్షించే భాగ్యం దక్కింది
అదృష్టవశాత్తూ భరతావనిలో
జన్మించినందుకు బహగర్వంగా వుంది
శతమయూఖుని దక్షిణ ధృవాన్ని తాకి 
భరతావని తన సత్తా చాటుకుంది
భారతీయ ప్రజ్ఞానం విశ్వవినువీధులపై
విజయోత్సవ పతాకమై విరాజిల్లుతోంది 
ఈనాటి విజయయాత్ర
అజరామరమై మిగిలిపోతుంది
మరోచరిత్రకు పయనమైనట్టు
మానవాళి ఉప్పొంగిపోతుంది
మనిషిగా పుట్టినందుకు 
మహదానందంగా వుంది 
ఆ అద్భుతం కనులనుండి కదలడం లేదు
ఒక చారిత్రాత్మక ఘట్టానికి
నేనుసైతం సాక్ష్యంగా నిలిచానన్న
గర్వంతో హృదయం ఉప్పొంగిపోతుంది 
ఒక ఉత్కృష్టమైన గెలుపును
కైవసం చేసుకున్నామన్న 
వాస్తవం నన్ను ఆకాశమంత
విశాలం చేసింది
పట్టువదలని విక్రమ్
సుధాంశునిపై వేసిన పచ్చబొట్టు
రాబోయే తరాల అభివృద్ధికి
తొలిమెట్టై మార్గనిర్దేశం చేస్తుందని
మనమంతా ఆశిద్దాం
మనసారా కోరుకుందాం.
జయహో భారతదేశం
జయజయహో భారతదేశం.

*సాలిపల్లిమంగామణి ( శ్రీమణి)*
విశాఖపట్నం
నా కవన సమీరాన్ని వీక్షించండి
👇👇👇👇👇👇
https://youtu.be/6-6ZzIzuFwA?si=4z8aZohjRiBXjdod

21, ఆగస్టు 2023, సోమవారం

దరఖాస్తు

*దరఖాస్తు*

నా రాతలు నన్ను రాసుకోనివ్వండి 
ఖర్చయిపోయిన కాలమెటూ తిరిగిరాదు నాకనులను అద్భుతమైన కలలనైనా కననీయండి తనివితీరా ఆస్వాదించి కవితలుగా మలచుకోనివ్వండి ఓదార్పుకోసమో..ఒక మార్పు కోసమో.. రెండు చేతులు జోడించి నిను వేడుకున్నాను ఎండిన పూలరెక్కలు పైకెగరేసి 
నను ఏరుకోమన్నావు
పరీక్షలన్నీ రాసేసాను ఫలితాలకోసం చూడనునేను
 నానెత్తిన నిప్పులకుంపటి పెట్టిన నీకు నా ఓరిమి సత్తా తెలియకపోదు నన్ను నాటిన ఓదేవుడా...ఏదో రోజు దృష్టిని నాపై సారించకపోతావా 
నా చెంపల జారిన కన్నీటి చుక్కల లెక్కను తేల్చకపోతావా 
మీదుమిక్కిలి కష్టాలే నాపై కుమ్మరించావు
వెక్కి వెక్కి ఏడ్చానన్నమాటేగానీ నేనేమీ వెనుదిరగలేదు 
ఏంచేస్తావో మరీ 
నావేదన నింపిన నివేదనపత్రాన్ని నీముందుంచాను 
తక్కెడవేస్తావోలెక్కలుచూస్తావో నాగురించి ఒక్కసారి ఆలోచించు మనిషేమీ రెండుసార్లు జన్మించడు నేలకేసి బాదినా నెగ్గుకు వస్తూనే ఉన్నాను నా దరఖాస్తును ఏపునఃపరిశీలిస్తావని ఆకాంక్షిస్తూ అక్షరాలబాటలో అలా నడిచిపోతున్నాను.
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)* https://youtube.com/@srimanikavanasameeram