పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

25, మే 2023, గురువారం

గోదావరి ఊసులు మాసపత్రికలో

🙏🌹🌹🌹🌹🌹🙏
తపస్వి *గోదారి ఊసులు* అంతర్జాల తెలుగు మాస పత్రిక.. మే - 2023
మొదటి పత్రికలో  నా ముఖచిత్రంతో(కవర్ పేజీ సెలబ్రిటీగా)వేయడంతో పాటు 
నా పరిచయాన్ని ప్రచురించిన 
తపస్వి మనోహరం
గోదావరి ఊసులు మాసపత్రిక
యాజమాన్యానికి,నాపరిచయాన్ని అందించిన శ్రీ మధుసూదన్ గారికి మనసారా
కృతజ్ఞతలు తెలుపుకుంటూ
సహరచయితలు,రచయిత్రులకు అభినందనలు తెలుపుకుంటున్నాను
మన పత్రిక ఇంకా ఎంతోమంది
కవులను, కవయిత్రులను ప్రోత్సహిస్తూ విజయవంతంగా
సాగిపోవాలని ఆకాంక్షిస్తూ..

*సాలిపల్లి మంగామణి,(శ్రీమణి)*
🙏🌹🌹🌹🌹🌹🙏

13, మే 2023, శనివారం

పదమై నర్తిస్తూ

*పదమై నర్తిస్తూ..*

పల్లవి రాస్తున్నాను 
పదమై నర్తిస్తూ
అలసినఘడియలపై 
అనుభూతులు గుప్పిస్తూ
అనంతమైన అన్వీక్షావిహంగాలు 
హృదయగవాక్షం తెరుచుకుని 
రివ్వున ఎగిరిపోతూనే వున్నాయి
వారించగలేని ప్రేక్షకపాత్ర 
చేతలుడిగి చూస్తుంది
నిన్నని మోస్తున్నానని
కనికరించదుగా కాలం 
కదిలిపోతూనే వుంటుంది 
భారమైన కనురెప్పలు విప్పారేలోపు
వేకువ చెక్కిలిపై చెక్కిన గురుతుల్లా
వెన్నెలచేసిన సంతకాలు
అవధుల్లేని పరవశానికి ప్రతీకలై
నిన్న తళుకులీనిన స్వప్నాలు
ఆఘ్రాణించకనే
అంతర్థానమవుతుంటే
అవలోకనం చేసుకొనే ప్రయత్నంలో 
అలా అంతరంగంలో పొదిగిన
అనుభూతులను ఆర్తిగా గుమ్మరించాను
అక్షరనక్షత్రాలై కాగితాన్ని
కవనంతో అలంకరించాయి
కాలం కరిగిపోయింది
అక్షరాలా ఆక్షణం మాత్రం
చెక్కుచెదరక నిలిచిపోయింది
అందుకే అక్షరాలంటే
అంతటి అనురక్తి
నేను రాసుకొనే అక్షరాలు 
ఎన్నో అంతర్జ్వలనాలకు
అనులేపనాలు 
ఆశలకు ఆలంబనగా నిలిచే
నా అక్షరాలలో నేను
ఆకాశమంత
నిజానికి ఇదంతా
నా చుట్టూరా ప్రపంచం
నేను మాత్రం తలపులతో
తక్షణమే ప్రపంచాన్ని చుట్టేస్తూ
నిరంతర విహారిని.

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*