పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జూన్ 2020, మంగళవారం

*రాళ్ళెత్తిన కూలీలు*


తరతరాలుగా

రాళ్ళెత్తిన కూలీలెవరూ

రాళ్ళెత్తిన కూలీలెవరని

గళాలు ప్రశ్నించడమూ

కలాలు పదేపదే

కదిలించడమూ ఏళ్ళ తరబడి

పరిపాటే గానీ

ఆ రాళ్ళెత్తిన జీవితాలు

రగిలిపోతున్నా...నిజానికి

కనీసం చీమకుట్టినట్టైనా

వుందా బండరాతి సమాజానికి

కంటితుడుపుమాత్రమే

ఒకింత ఓదార్పునైనా 

 ఇచ్చేనా ఈ ఉత్తుత్తిమాటలు

అట్టడుగు బడుగు

జీవితాలెపుడూ

కడగండ్ల గుదిబండలే

ఆదరణ కరువైన 

ఆ బతుకులెపుడూ

సమాధానం దొరకని 

జటిల ప్రశ్నాపత్రాలే

కన్నీటి సిరాలో కరిగిన

బతుకుచిత్రాలే

నిలువెల్లా కరిగిపోతున్నా

నిలువు నీడకూడా

దొరకని నిర్భాగ్యుల

నిర్లిప్త జీవితాలవి

కష్టాలు కన్నీళ్ళకు 

ఆలవాలమైన

కల్లోలజీవితాలవి

వీరికథ పాళీలకే పరిమితం

రాతలలో మాత్రమే రాళ్ళెత్తే

కూలీల ప్రస్తావన

వాస్తవంలో మాత్రం

వారిది అరణ్యరోదన

అడుగడుగున ఆరాటమే

ఎడతెగని పోరాటమే

గతుకుల బ్రతుకు వీధుల్లో

పిడికెడు మెతుకులకై

కడివెడు కన్నీళ్ళే

బ్రతుకు జీవనమంతా

బహు దుర్భరమే

అన్ళీ కాలే కడుపులూ

రాలే బతుకులే

నిరంతర శ్రమజీవులు

నిర్లక్ష్యానికి గురైన

నిర్భాగ్యజీవితాలు

ఒట్టిమాటలు కట్టిపెట్టి

గట్టిమేలు తలపెట్టే

శుభతరుణం వచ్చేవరకూ

వేసారిన జీవితాలకు

వెలుతురు రాగం

ఆమడదూరమే.


*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

29, జూన్ 2020, సోమవారం

అమ్మపెట్టిన అందాలగోరింట

అరుణారుణ

కిరణంలా....

ఎర్రగా పండిన 

నా అరచేతి 

గోరింటనుచూసి

మూగబోయింది

మా పెరటి

ముద్దమందారం...

విరబూసిన 

నా అరచేతినిగని, 

వికసించిన సుమమనుకొని,

ఝుమ్మని తుమ్మెద

ఝంకారం... చేసింది.

తమజాబిలి‌...తరలివెళ్ళి

తరుణిఅరచేత

 కొలువుదీరెనా...అని

తరచితరచి

చూసింది ఆకాశం

ఆశ్చర్యంగా....!

అతిశయమనుకోవద్దు

అందంగా పండింది 

ఆషాఢమాసంలో

నా అరచేయి..

అమ్మ తన అనురాగాన్నంతా

రంగరించి పెట్టింది మరి

అద్భుతంగా పండదా...మరి...

అందగా ఉండదా...మరి.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

28, జూన్ 2020, ఆదివారం

మేలిపొద్దులీయవా...

కథ ముగిసేదేనాడో
వ్యథ సమసేదేనాడో
తూరుపుదారులనిండా 
కూరుకుపోయిన 
నిట్టూరుపురాగాలకు
తెరదించేదేనాడో
ఎప్పుడు వెలిసిపోతాయో
మానస గగనంలో ముసిరేసిన
నైరాశ్యపు మేఘాలు
ఎప్పుడు కలిసిపోతాయో
కాలగర్భంలో కాటేసేరోగాలు
మానవజాతినెల్ల వల్లకాటి 
పరం చేస్తున్న ఆ కలికాలపు 
మహమ్మారికి చెల్లుచీటీ ఏనాడో
మా స్వేచ్ఛకు కంచెలు వేసిన 
ఆ నయవంచక చైనాపుత్రిక
కుత్తుక తెగిపడేదేనాడో
మా ఆశలరెక్కలు విరిచేసిన
వింతపురుగు మరుగయ్యేదేనాడో
నల్లని ఈదినములెల్ల
తెల్లారేదేనాడో 
పెల్లుబికిన ఈ పెనువిధ్వంసం
చల్లారేదేనాడో
జాలి లేని దేవుడా
మేలిపొద్దులీయవా...
సోలిపోతున్న మానవాళికి
మేలుకొలుపు పాడవా..

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

26, జూన్ 2020, శుక్రవారం

నిజం చెప్పవా...కృష్ణా!

నిజం చెప్పవా...కృష్ణా!
నే... నీదానను కానా..
నీవు లేక నిమిషమైన
నేనుండగలనా...
నిన్నటి నీమాటలన్నీ...
నీటి మీద రాతలా..
చేసుకొన్న బాసలన్నీ..
చెరిగిపోయే ఊసులా...
పెనవేసుకొన్న  మన
మనసుల కధలన్నీ
ఒట్టి కట్టుకధలేనా...
నువ్వుండేదా...గగనంలో
నేనేమో...ఇలాతలంలో
ఆశలరెక్కలతో
విహంగమై విహరిస్తున్నా..
అలుపెరుగని పయనంలో
అనుక్షణమూ...నీకోసం
అన్వేషిస్తున్నా...
ఎన్ని జన్మలెత్తాలిక
వెన్నదొంగా...
నీ పద సన్నిధి చేరగా...
చెప్పు నిజంగా...
నల్లని వాడా...నావల్లకాదిక
తనువంతా కనులై
వేచియుంది.....ఇదిగో...నీరాధిక
        (రాధమాధవీయం)
సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

8, జూన్ 2020, సోమవారం

5, జూన్ 2020, శుక్రవారం

వింతలోకం

మాయదారిప్రపంచమిదిమనుగడంటే మరణమేమానవత్వం,మాన్యతత్త్వంఎడారిలో పూచినపూలువిస్తుపోయే వింతలోకంఎంత దోస్తే అంతపైకంఅడుగడుగున కుట్రాకుతంత్రంఅవనియంతా అవినీతి తంత్రంఎండిపోయిన బ్రతుకు దారిలోమండిపోతున్ప గుండెఛాయలేధరలగుర్రం ధరణినొదిలి ఆకసానికి దౌడుతీసేపైస దక్కక పైరుమళ్ళోబోరుమంటూ భూమినేస్తంఏమిన్యాయమో..ఇదేపాటి ధర్మమో..మంచం లేచిన మొదలు లంఛమే లాంచనమిక్కడమరకలంటిన మనస్తత్వంమసకబారిన మనిషితత్వంపెచ్చుమీరిన కలికాల పైత్యంకాసులకైంకర్యమే  నేటి సమాజ నిత్యకృత్యం.
సాలిపల్లి మంగామణి(శ్రీమణి)