పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, మే 2018, మంగళవారం

నందమూరి తా‌రక రామారావు జయంతి

తెలుగు తేజం అతడు
తెలుగు రాజసం అతడు
తెలుగు పౌరుషం అతడు
తెలుగు వారి
ఆత్మగౌరవమతడు
తెలుగుజాతిగుండెల్లో
ఉప్పొంగిన
చప్పపుడతడు
తెలుగుజాతి
గొప్పతనం
దిగ్ధిగంతాలా...
చాటిచెప్పిన
మాతృభూమి
సేవాతత్పరుడతడు
తెలుగు జాతి కీర్తి అతడు
తెలుగు వారి స్ఫూర్తి అతడు
తెలుగు నేలపై ఉదయించిన
నవ చైతన్యమూర్తి అతడు
మాన్యుడతడు
మహనీయుడతడు
మానవతామూర్తి అతడు
కర్తవ్యధీక్షలో
మొట్టమొదటి సైనికుడు
అందంలో రాముడతడు
అందరకీ దేవుడతడు
విశ్వమెరిగిన విజ్ఞుడతడు
విశ్వ విఖ్యాత
నటసార్వభౌముడు
ఆంధ్రులకు అన్నగారిలా
ఆకలిగొన్నవారి పాలి
అన్నదాతగా..
నాయకునిగా..
అధినాయకునిగా..
నిండైనరూపంతో
నిలువెత్తు
తెలుగుతనానికి
ప్రతిరూపంగా
అందమైన
నటనతో
ఆంధ్రుల అభిమాన
కధానాయకునిగా
తెలుగువారిగుండెల్లో
చెరగనిజ్ఞాపకమై..
చలనచిత్రసీమలో
మధురమైన సంతకమై...
మాగుండెల్లో కొలువున్న
అందాలశ్రీరాముడు
శ్రీనందమూరితారకరామారావు
గారిజయంతి సందర్భంగా..
సహస్రాధిక అభివందనములతో
నివాళులర్పిస్తూ..
      శ్రీమణి

26, మే 2018, శనివారం

మధురఫలం..మామిడి

మామిడిపండును చూసి
మనసు పారేసుకోనిదెవరు?
మధురసాల రారాజును
మనసారా కోరుకోనిదెవరు?
పుల్లనిమావిళ్ళను
చూసినంతనే
మన ఉల్లము జిల్లనదా...
అల్లన మామిడిఫలమును
కాంచినంతనే
అలవోకగ మననాలుక
అధరపుటంచులతాకదా...
సురులకు మాత్రమే
అమృతాస్వాదనమా..
అని అలిగిన ప్రకృతి
పట్టుబట్టి
మనకోసం మామిడిలో
మధురసుధను గుమ్మరించెనేమో...
మనపై పట్టరాని మమకారంతో...
మండువేసవిలో
వేసారిన మనకోసం
మధురరసధారల
సేదదీర్చ ఏతెంచినేమో
మనసైన అతిధిలా
మలమలమండేవేసవికూడా
మామిడిపండిచ్చే
తియతీయని రుచిలో
మలయమారుతమై
మనలనలరించునుకదా...
కొత్తావకాయలో
తగినంత
వెన్నపూస జోడించి
వేడివేడి అన్నంలో
కమ్మగా కలపేసి
ముద్దముద్ద లాగిస్తే
ఆసన్నమవదా
అరక్షణంలో
కనులముందు
కమ్మని స్వర్గం
తనివితీరదు
వద్దన్న మాటేరాదు
వందముద్దలైనా...
వరుసగలాగించే పనిలో..
గురుతుకొస్తుందా...సమయం
ప్రాణం జివ్వున లేచిరాదా
మంచం పట్టిన
ముదుసలికైనా...
ఒక్క ముద్దరుచిచూపిస్తే..
ఏమైనాగానీ..
మనసెరిగినదండీ
మన మామిడిపండు
మామంచిదండీ
మన మామిడిపండు

                 శ్రీమణి

23, మే 2018, బుధవారం

😥అరుగును నేను😥

😥అరుగును నేను😥
వీధిఅరుగునునేను
పరుగులలోకంలో
కరిగికరిగి
మరుగునపడిపోయాను
కనుమరుగైపోయాను
అంతస్ధుల మోజులో
అడుగునపడిపోయాను
అసలునేనూ..
ఊరుమ్మడిచుట్టాన్ని
ఊరుమంచి కోరేదాన్ని
ఊరడింపునిచ్చేదాన్ని
ఊసులాలకించేదాన్ని
ఊ..కొట్టేదాన్ని
ఊళ్ళోకొచ్చినదెవరైనా
కూర్చోమంటూనే
కుశలమడిగేదాన్ని
పొరుగింటిముచ్చట్లైనా...
ఇరుగింటఅగచాట్లైనా
ఇంటింటి రామాయణాన్ని
ఇట్టే కనిపెట్టేదాన్ని
నేర్పుగ,ఓర్పుగ
తగవులుతీర్చేదాన్ని
తగినతీర్పులూ..ఇచ్చేదాన్ని
ఎవరిబాధలెన్నైనా..
ఏవేదనలున్నా..
ఓర్పుగా ..ఆలకించి
ఓదార్పునందించేదాన్ని
నేనెరుగని కధలేదు
నన్నెరుగని గడపలేదు
నాతోగడపనిదెవరూ..
నాతోపనిపడనిదెవరికని?
అందరినీ..అక్కునచేర్చుకు
లాలించేదాన్ని
పాలించేదాన్ని
ఆత్మీయతపంచేదాన్ని
అందరినీ ఆదరించి
చేరదీసి,సేదదీర్చేదాన్ని
అసలునేనూ..
అచ్ఛం అమ్మలాంటిదాన్ని
అసలుసిసలు
మానవసంబంధాలకు
పట్టుగొమ్మలాంటిదాన్ని
ఎవరూ..పదిలంచేయని
పాతబంగారాన్ని
రాతినేగాని,ఆపాతమధురాన్ని
నావిలువను,గుర్తించలేనిమీకై..
నిన్నటి మీజ్ఞాపకంగా
మిగిలిపోతున్నా...
ఉరుకులపరుగులతో
ఉక్కిరిబిక్కిరవుతున్న
నా బిడ్డల జీవనగమనం చూసి
బీటలువారి పగిలిపోతున్నా...
                        శ్రీమణి

21, మే 2018, సోమవారం

యద్ధనపూడిసులోచనారాణి కి శ్రద్ధాంజలి

🌹తెలుగు సాహితీ లోకంలో మెరిసిన మహిళామణిదీపం
తెలుగు నవలారచనలలో
అత్యున్నత శిఖరం
అద్భుతకధలను ఆంధ్రావనికందించిన
అమృతకలశం
ఆమె..కలం అజరామరం
ఆమెకధలు కరతలామలకం
ఆమే మన సుప్రసిద్ధ
నవలాసామ్రాజ్యాధినేత్రి
యద్ధనపూడి సులోచనారాణి
మద్యతరగతి మగువలను
తనకలంతో కలల అలలపై
తేలియాడించి,
మద్యతరగతిజీవితాలను
కధావస్తువులుగా...
సగటుజీవితాలకు సజీవసాక్ష్యాలుగా..
కడురమ్యమైన రచనలుచేసి
అశేష ఆంధ్రావనినీ తన రచనల రసాస్వాదనలో
ఓలలాడించి...
కుటుంబసంబంధాలు,
భార్యాభర్తల అనుబంధాలు,
మద్యతరగతి మగువల
వ్యక్తిత్వం,ఆత్మాభిమానం
ఆమెరచనలలో ప్రతిబింబించి
మూడుతరాలపాఠకులను మంత్రముగ్ధులనుగావించి....
రచనాప్రక్రియను
తనదైనశైలిలో కొత్తపుంతలుతొక్కించిన యావత్ నవలా చరిత్రకే
కలికితురాయి,ఆమె
నిన్నటి రచయిత్రి అయినా
నేటికీ ఆమెరచనలు టీవీసీరియళ్ళరూపంలో
ప్రేక్షకుల అభిమానాన్ని
చూరగొంటున్నాయంటే
ఆమె కలం సిరాను బదులు
మన మానసరాగాలను నింపుకొందేమో..అనిపిస్తుంది
ఆవిడను కనులారా..
చూసే భాగ్యం నాకు
కలగలేదు గానీ..
నాచిన్నప్పుడు
మాఅమ్మగారు ఆమెకు అభిమాని,మాఅమ్మగారు ఆవిడనవలలు ఒక్కటికూడా విడవకుండా చదివి
మానాయనమ్మగారికి వినిపించేవారు
ఆక్రమంలోఅది విన్న నేను ఒకవిధమైనమధురమైన అనుభూతికిలోనయ్యేదాన్ని,
అలాచిన్నతనంలోనే ఆమెరచనలపట్ల ఆకర్షితురాలయ్యాను..
ఆవిడరాసిన ఎన్నోకధలను ధారావాహికరూపంలో
చూసిన,చూస్తున్న మనమందరం ధన్యులమే
మధురకధలను పదిలపరచి
గగనసీమకు పయనమైనా
పదిలమేగా పదితరాలకూ
తెలుగువారి హృదయాలలోన
ఆవిడను ఎప్పటికైనా
కలిసి మాట్లాడాలనే నాఆశ
తీరనేలేదు..కానీ ఆ
మహారచయిత్రిని గురించి
మాట్లాడడానికి అర్హతలేని
అణువంతదాననైనా..
ఆమె ఆత్మకు శాంతిని,మోక్షాన్ని ప్రసాదించాలని ఆభగవంతుని
మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నా🌹....శ్రీమణి

20, మే 2018, ఆదివారం

సిరివెన్నెల

సిరిమువ్వల సవ్వడయినా
 చిరు జల్లులుసడియైనా
 విరి తేనియ చిలికినా
 మరు మల్లెలు పరచినా
ప్రణయసుధాఝరిలో
ఇరుమనసులు మైమరచినా
పల్లవించును పాటై
అది సిరివెన్నెల పాటై
మది దోచే మరువంపుతోటై
అది మకరందపు తేట 
ఆణిముత్యాల మూట
మంచి గంధాల పూత 
మధురోహల పూదోట
మధురాక్షరాలుఒలికించే
అక్షరాల అక్షయపాత్ర
ఎలకోయిలమ్మపాట
కులికే సరాగాల సయ్యాట
అది సిరివెన్నెల పాట 
మదిదోచే  మరువంపుతోట
కవనరాజ్యపుకోట
సాహిత్యపు తోటలో
విరబూసిన
ఘనపారిజాత
ప్రతిపదాన నడిచొచ్చిన
నవరాగమదియట 
నరనరాల ప్రవహించే
తెలుగు రుధిర గరిమట
అది సిరివెన్నెల పాట 
మదిదోచిన మరువంపుతోట 

(పూజ్యులు,ఆంధ్రుల ఆరాధ్య 
సినీ గేయ రచయిత,
సరస్వతీ ప్రియ పుత్రులు 
చెరగని చిరునవ్వుల సిరివెన్నెలవారు సీతారామశాస్త్రి గారికి
జన్మదిన సందర్భంగా అక్షరాలనీరాజనమందిస్తూ..
                  శ్రీమణి

19, మే 2018, శనివారం

ప్రియవదనా..నీకై

సంధ్య వాలిపోయే 
సూరీడింటికి ఎల్లిపోయే 
గువ్వలు గూటికి చేరిపోయే 
నీ సవ్వడి మాత్రంలేదాయె
నినుకనుగొనలేక
నిశిరాతిరికూడా..
నిశ్శబ్ధంగా నిదరోయె
నినువెచ్చగ
తాకగలేకవెన్నెల
జాబిలి సైతం
అలిగిచిన్నబోయె
నీజతలేనివెతలో
మరుమల్లియలతకూడా
మిన్నకుండిపోయె...
నీవెదురుగలేక
నిద్దురరాక
నాతనువంతా
నిప్పులపరమాయె
ప్రియవదనా....
నీకైవెదకీవెదకీ
వెలవెలబోయెను
నావదనం
ఓ మదనా
నీ అడుగులసడి
వినబడక
కలవరపడి
పలుకులు
కరువై...
మూగబోయెనే
నాఅధరాలు
కలవరపడి
నాకాటుకకన్నులు
నీకై ఎదురుతెన్నులు
చూస్తుంటే...
నీతలపుల
తడబడి
నిలువునానామది
కలవరపడుతుంటే
కనుమరుగేల..ప్రభూ..
కనికరమేలేదా...
నీవలపులకలకంటిపై..

(మాధవునికై....
రాధఎదురుతెన్నులు)
               శ్రీమణి

16, మే 2018, బుధవారం

విజేత

ఓటమి అంటూ
ఉస్సూరంటే
విజేత కాగలమా ....
అమావాస్య
అంధకారాన్ని
అధిగమించక
పున్నమివెన్నెల
వెల్లివిరిసేనా...
చేదును చవిచూస్తేనేగద
తీపివిలువ తెలిసేది
దూరం అంటూ
ఆగి కూచుంటే
తీరంచేరేనా..
కంటకాలు దాటకుంటే
కామితాలు నెరవేరేనా...
కణకణమండే
నిప్పున కాలక
కనకము నిగ్గుతేలేనా..
విధి విషమంటూధూషిస్తూ
కూచుంటే అదృష్టం..వరిస్తుందా
అలుపెరుగక శ్రమియిస్తే
సాధించలేనిదేముందీలోకాన
ప్రతీక్షణాన్నీ పదిలంగా వినియోగిస్తూ..
ఇంకేముంది చేయాల్సిందని
కాలాన్నే...నిలదీశావో...
నినుమించిన ధీమంతుడు
ఉంటాడా ఉర్వీతలంపై
చేసినపనిలో దైవాన్నే
కనుగొంటే పట్టిందల్లా
బంగారంకాదా...
పట్టుదల వుంటే
కానిది వుందా...
పట్టువీడక ప్రయత్నిస్తే
పసిడి పండదా..
బీడుభూమిలో..సైతం
                
                      శ్రీమణి

11, మే 2018, శుక్రవారం

ఆవేళ

మది మకరందం
చవిచూసినవేళ
హృది మందారం
విరబూసినవేళ
సిరిమల్లెలవానలో
విరితేనియ చిలికినవేళ
అరవిరిసిన నాహృదయం
నీనులివెచ్చని
తలపుల ఒడిలో
తలవాల్చిన వేళ
నిదురరాని
నాకన్నుల్లో
నీకలలే కలబోసి
కలవరపెట్టిన వేళ
జాజిపూల పరిమళాల
జావళీలు పాడినవేళ
జాబిలి వెన్నెల జడిలో
జతమనసులు
జతులాడినవేళ
వింతవింత అనుభూతుల
తనువుమనసు విహంగమై
వినీలగగనంపై విహరించినవేళ
ఆశలు విరబూసిన వేళ
ఆనందం అర్ణవమై ఎగిసినవేళ
మన ప్రణయం
మధురోహల
మైమరచీ మదనునితో
మంతనాలు చేసినవేళ
ఆవేళ....
నాలోన మొదలాయె
వేవేలకదలికలు
ఆవేళ..
నాలోన..కదలాడే
సరికొత్త పదనిసలు
నిను వలచిన
వేళనుండీ
ఈవేళవరకూ
నే తలచింది నిన్నే
నే పిలిచింది నిన్నే
నిద్దురలోనూ..మేలుకొనీ
నీవేగా...నాహృదయానికి
వేలుపనీ...

(రాధామాధవప్రణయామృతం)

               శ్రీమణి

9, మే 2018, బుధవారం

ఆత్మీయసత్కారం

మావిశాఖకళావేదిక ఆద్వర్యంలో ఆచార్య సార్వభౌమ శ్రీవేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి
"భారవి-భారతి"గ్రంధావిష్కరణసభలో
వేదులసుబ్రహ్మణ్యశాస్త్రి
దంపతులచేతులమీదుగా ఆత్మీయసత్కారం
అందుకొన్నశుభతరుణం

7, మే 2018, సోమవారం

విప్లవసూర్యుడు

తెలుగుజాతి వీరుడా....
తెల్లోడిగుండెల్లో
చెళ్ళనిఝుళిపించిన
నిప్పులకొరడా..
మహోజ్వలధీరుడా...
మన్యమహానాయకుడా..
ప్రజ్వలించిన
స్వతంత్ర సమరయోధుడా..
ప్రఛండవిప్లవ సూరీడా..
మహామహా
మహాత్ముడా...
మహిపై
మాకైవెలసిన
మహనీయుడా...
కాలం కరిగిపోతున్నా..
రోజులు దొరలిపోతున్నా..
అద్వితీయమౌ నీ త్యాగం
ధరిత్రి వున్నంతవరకూ
భరతజాతిచరిత్రలో
పసిడిఅక్షరాల
పదిలమై
అలరారుతునేవుంది
నువ్వొదిలెళ్ళిన ధైర్యం
నువు చూపించిన స్థైర్యం
నిరతం మాగుండెల్లో
కదలాడుతునే వుంది
భరతమాత
దాస్యశృంఖలాలు
ఛేదించుటకై
తెల్లకుక్కల
నిప్పులతూటాలకు
ఎదురెళ్ళి
వందేమాతరమంటూ
ఆత్మత్యాగమొనరించిన
అమరజీవీ...
వందలవందనాలుమీకు
ఆచంద్రతారార్కమూ
యావత్ భరతజాతి
అభివందనాలు మీకు

(🌹విప్లవవీరుడు
అల్లూరిసీతారామరాజుగారి
వర్ధంతిసందర్భంగా..అక్షర
నివాళులర్పిస్తూ...🌹)
                 
                          శ్రీమణి

4, మే 2018, శుక్రవారం

ఎట్టానమ్మను కిట్టయ్యా..

ఎట్టానమ్మను కిట్టయ్యా..
నిన్నెట్టా...నమ్మను కిట్టయ్యా..
చెట్టాపట్టాలేస్తావు
చుట్టూ నువ్వే వుంటావు
చిటికెలో..
చెట్టూచేమల
మాటున నక్కీ
నన్నష్టాకష్టాలెడతావు
కనికట్టేదో చేస్తావు
కళ్ళకు గంతలు కడతావు
హద్దులేని ప్రేమంటావు
నీముద్దుచెలియ నేనంటావు
మూసిన కన్నులు
తెరిచేలోపు
ముద్దుగుమ్మలచెంతకు
పరుగులుతీస్తావు
నీసన్న చెక్కిలి
నవ్వులు రువ్వీ
చెలియల
మనసును
దోచేస్తావు
నాహృదయపు
తలుపులు నీకై
తెరిచా...కిట్టయ్యా...
నీవలపులతలపులు
మాత్రంపలుభామలపైనా
పరచేవా....
నాగుండె సప్పుడు విన్నావా..
ఎప్పుడు కిట్టయ్యంటాది
మల్లెచెండంటి
నీ మనసుమాత్రం
మగువలమద్యన
మారుతుంటది
ఎన్నిజన్మాలెత్తాలయ్యా
నల్లనయ్యా...
నీ ఎద సన్నిధి చేరాలంటే
ఓచల్లనయ్యా...
            
                    ..శ్రీమణి

శ్రీ మహాలక్ష్మి

సిరిమహాలక్ష్మికి 
సిరిచందనాలు
శ్రీమహలక్ష్మికీ
మరుమల్లెపూలు
వరలక్ష్మి పదములకు
సిరిమువ్వ అందియలు
ఆదిలక్ష్మీ నీకు
అమృతాభిషేకాలు
  దాన్యలక్ష్మీ నీకు
పరమాన్న,పాయసాలు
  ధైర్య లక్ష్మీ నీకు
మణులు,మాణిక్యాలు
  గజలక్ష్మీ నీకు
రతనాలగాజులు
సంతానలక్ష్మీ నీకు 
సాష్టాంగ ప్రణామాలు
  విజయలక్ష్మీ నీకు
నిత్యనీరాజనాలు
  విద్యాలక్ష్మీ నీకు
విరుల వింజామరలు
  ధనలక్ష్మీ నీకు
షోడశోపచారాలు

అష్టలక్ష్మీ దేవులకు
అష్టదళపద్మాల
అర్చింతు...అత్యంతభక్తితో
అభయమ్మునీయవే
అమ్మలందరికమ్మ
  శ్రీ మహాలక్ష్మీ
  కటాక్షించగరావే
కరుణాక్షతలతోడ
శ్రీ కనకమహాలక్ష్మి
     శుక్రవార శుభోదయం
అందరికీ శుభంకలగాలని
   ఆకాంక్షిస్తూ ..........
                             శ్రీమణి

1, మే 2018, మంగళవారం

శ్రమజీవి..అమ్మ


మనకు జన్మనిచ్చే
జీవన్మరణ పోరాటంలో
మరుజన్మనెత్తిన
మాతృమూర్తి ..
తన ఆదరణతో
ఆధరణిని తలపించే
అమృతమూర్తి
మేలుకొన్నది మొదలు
మనమేలుకై పరితపించే
పరిశ్రమించే త్యాగమూర్తి
తనుతిన్నా
తినకున్నా
అడగకనే మనకు
ఆకలితీర్చే
కారుణ్యమూర్తి
అడుగడుగున
ముళ్ళన్నీ తన
అరచేత అదిమిపట్టి
మన భవితకు
పూలపానుపుపరచే
పరమపావనమూర్తి
మమతానురాగాల
మహనీయమూర్తి
మన మాతృమూర్తిని
మించి శ్రమజీవులెవ్వరూ
మహిపైన
అమ్మ  శ్రమను వర్ణించగ
అక్షరాలు సరిపోవునా
అమ్మ లేక ఉంటుందా
"అవని"ఆనవాలు
అమ్మని మరపించే
మరోదైవం "అమ్మే"
సృష్టిని నడిపించేది
ఆరెండక్షరాల "అమ్మే"
మరి అమ్మేకదా
మొట్టమొదటి శ్రమజీవి
మననుద్దరించగ
ధరణిపైన జనియించిన
ధన్యజీవి
(మాతృమూర్తులందరికీ కార్మిక
దినోత్సవ శుభాకాంక్షలతో)
                 శ్రీమణి