పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

26, జనవరి 2017, గురువారం

మహాత్మా

మహాత్మా!మళ్ళీ పుట్టొద్దు, 
ఆశతో మళ్ళీ పుట్టావో అవమానంతో ఉరిపెట్టుకొంటావు. అందుకే మొరపెట్టుకొంటున్నా ...  నువ్వు పుట్టొద్దు,పుట్టినా మా మద్య పుట్టొద్దు. 
కంపు కొడ్తుందయ్యా... బాపూ ...  నేటి రొంపి వ్యవస్థ
మొండి మరకలు పడ్డాయి మానవత్వం  పై,
పేరుకు ప్రజాస్వామ్యం,తీరుకు నియంతృత్వం 
తెల్లోళ్ళ పాలనలో బానిస బ్రతుకయినా బ్రతికాం 
మన తోడేళ్ళ పాలనలో బ్రతుకు బరువై,మెతుకు కరువై 
చితికిచితికి, చితికి చేరువై అఘోరిస్తున్నాం. 
అణువణువున మన దేశం స్వార్ధ రాజకీయం 
అడుగడుగునా మన దేశం అవినీతికి నిలయం 
మంచం లేచిన మొదలు లంచపు  లాంఛనాలు. 
నిత్యావసరాల ధరలు నిత్యం వేధిస్తుంటే 
నింగికెగసిపోతున్నాయ్ నల్లఖజానాలు. 
వెల పెరిగిన వేగంతో నెల జీతం పెరగదే!
విద్యాలయాలెటూ విద్య విక్రయశాలలై విరాజిల్లుతున్నాయి. 
నేడు చదువుకొనాలంటే చదువు "కొనాలి"మరి. 
నువ్వొదిలెళ్ళిన జ్ఞాపకాలు చెదలు పట్టాయి. 
అహింసావాదానికి ,శాంతి నినాదానికి  నీళ్ళొదిలేసి ఉన్మాదానికి ఊపిరులూది  ఉగ్రవాదంతో ఊగిపోతున్నాం. 
ఎక్కడ చూసినా నెత్తుటి చారికలే,
మన సంస్కృతీ సాంప్రదాయమని వెతికావంటే 
ఇక్కడ వెర్రివాడవంటారు ,వెంటబడి తరుముతారు
 వెర్రితలలేస్తున్న ప్రాశ్చాత్త్య పోకడల వెంటపడ్డారందరూ ... 
అధర్మానికి  ఆలవాలమయి అలరారుతుంది నువ్వు కలలు గన్న నీ కర్మభూమి. 
నీ కల నిజమై అర్ధరాత్రిమహిళ  ఒంటరిగా నడుస్తోంది,అన్నింటా ముందుంది. 
కానీ పట్టపగలే పడతికి రక్షణ లేదంతే,
అనునిత్యం  అరాచకం రాజ్యమేలుతోంది,అనైతికత్వం అగ్రగామియై ముందుండి నడిపిస్తుంది. 
తెల్లోడిని తరిమేశావు,కానీ వాడి పైత్యం మా అందరిలో పాతుకుపోయింది,
ఇప్పుడేం చేస్తావ్,నీ వాళ్ళనెక్కడికి తరిమికొడతావు. నీ వీపు,కడుపు మేమయినప్పుడు 
తప్పులు చెయ్యొద్దన్నావు,తప్పనిసరిగా తప్పులే చేస్తున్నాం,,,
అంటరానితనం లేదులే,అంటురోగాలు తప్ప 
నీతి నియమాలు నీటి మీదరాతలయ్యాయి. 
సమానత్వం ఎలాఉన్నా ... దోచుకున్నోడికి దోచుకొన్నంతా 
దాచుకొన్నోడికి దాచుకొన్నంత ,మండేవాడి కడుపు మండుతునే ఉంటుంది,
నిండే వాడి జేబు నిండుతునే ఉంది,
అడుగడుగునా అవినీతి రక్కసి వికటాట్టహాసం చేతుంది విశ్వ విజేత తానంటూ ... 
నీ పుణ్యభూమిలో సెకనుకొక పుచ్చెలా  తెగి పడుతున్నాయి,తగవులతో తగబడుతున్నాయి.,అహర్నిశలూ శ్రమించి నీ ఆశయాలను అగ్నికి ఆహుతి చేస్తున్నాం. 
నాగరికత ముసుగులో నాసిరకం మానవులం. 
చూసి నిలబడే నిబ్బరముందా ... 
కొన ఊపిరితో కొట్టుకొంటున్న నీ కోరుకొన్న ఆశయాన్ని
తట్టుకొనే దమ్ముందా ...  మట్టికొట్టుకుపోతున్న మానవత్వ విలువలను చూసి, 
కళ్లారా చూడగలవా,,,వెలిసిపోతున్న స్వాతంత్య్రకాంతిని ,
మంట గలిసిపోతున్న మానవత్వ స్ఫూర్తిని 
గమ్మత్తులు చూడాలని మత్తుల్లో  తూలుతూ మరమ్మత్తు చేయలేని మరబొమ్మల్లా మసలుతున్న నీ బిడ్డల గడ్డు పరిస్థితిని,
అందుకే చెప్తున్నా... మహాత్మా మళ్ళీ పుట్టొద్దు;
చల్లని నీ చూపులో ఎర్రని సూరీని ఉదయించనీకు,
తెల్లని నీ శాంతి వస్త్రానికి రుధిరంలో తడవనీకు 
నువ్వు కలలు గన్న స్వాతంత్య్రం కల్లయిందని తెలిస్తే 
చల్లని నీ గుండెకు చిల్లులు పడి చితికి చితికి పోయేకంటే 
నువ్వసలు మళ్ళీ పుట్టొద్దు,నువ్వు నీ కల నిజమయ్యే రోజొస్తే 
మేమే కబురెడతాం ,అప్పటివరకు మనదేశం మరమ్మత్తు చేయమని ఆ భగవంతుని ప్రార్ధించు 
ఆ తపో ఫలాన్ని నేరుగా మాకు ఆపాదించు,తప్పుగా మాట్లాడితే నీ తనయను క్షమించు,
లోకా సమస్థా సుఖినో భవంతు అని మము ఆశీర్వదించు,
                                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి 
                                                        8522899458 
                                                       pandoorucheruvugattu.blogspot.in






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి