పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, జనవరి 2014, బుధవారం

పండూరు

పండూరు  చెరువుగట్టు



పెద్ద చెరువు, పచ్చనిచేలు,
పైరగాలులు, నోరూరించే ఊరగాయలు,
మదిదోచే మామిడితాండ్ర,
ముచ్చటైన మాఊరు పండూరు
పేరుకు తగట్టే మధురాను భూతులు పంచేను మా ఊరు
జ్ఞాపకాల తాయిలాలు దాచేను మాఊరు
మమతాను రాగాల హరివిల్లు మాఊరు,
మధుర ఫలం మా ఊరు
ఆ దివి భువికొసగిన సుమధుర ఫలం మాఊరు,
తూర్పు గోదారమ్మ జడన తురిమిన
విరిమల్లియ మా ఊరు,సిరిమల్లియ నాఊరు
దేవతలు నిర్మించిన వేణుమాధవునిగుడి
కళకళలాడే రైతు సోదరుల సందడి,
గువ్వల చిరుసడి, లేగదూడల గిట్టల సవ్వడి,
అమ్మని తలపించే కమ్మని వడి
ఇవి అమూల్యమైన ఆభరణాలు మా ఊరికి
శాంతి,ఐక్యతలకి నిర్వచనం మాఊరు,
కోస్తాకే కొంగు పసిడి మా ఊరు,
ఎన్నో పల్లెలకాదర్శం మాఊరు



                                                                        శ్రీమణి

23, జనవరి 2014, గురువారం

అక్కినేనికి కన్నీటి వీడ్కోలు


అక్కినేనికి  లెక్కలేని హృదయాలకన్నీటి వీడ్కోలు  

మహాశిఖరం నేలకొరిగిపోయింది 
మహావృక్షం మట్టికలసిపోయింది  
మహోజ్వల తేజం మసకబారిపోయింది
మహానటసామ్రట్ట ధీరం 
మరలరానిలోకాలకు తరలిపోయింది 
చలన చిత్ర సీమలొ మహాధ్యాయం  
మధురపుటలతో ముగిసిపోయింది 
బహుదూరపు బాటసారి 
అందరాని తీరాలకు సాగిపోయె
ప్రేమనగరి రారాజు  
జనసీమనొదిలి అమరసీమకేగెనే 
వెండితెర  నిందుచంద్రుడు 
వన్నెతరగని వెన్నెలిచ్చి 
స్వర్ణచరిత్రకు పయనమాయెను  
శతాబ్దానికొకటయి  పూచినపూవు 
పరమాత్ముని సన్నిదికై దివికెగసిపోయెనే   
పసిడి స్మృతులు పదిలపరచి 
శాశ్వత నిదురలోకి జారిపోయెనా! 
ఓ మహర్షీ.... ఓ మహాత్మా.... ఓ మనోజ్ఞమూర్తీ.... 
ఓ స్పూర్తిప్రధాతా.... ఓమార్గదర్శీ..... ఓ మానవతామూర్తీ  
అనంతలోకాలకు నీవు సాగిపోయినా 
నీఅడుగుజాడలే మాకు శ్రీరామరక్ష 

అక్కినేని అధీశునికి 

                                    అశ్రుతప్త నయనాలతో 
                                                                
                                                                                   శ్రీమణి

19, జనవరి 2014, ఆదివారం

“అమ్మ”

అమ్మ
అరుదగు వాఖ్యం “అమ్మ”
అత్యద్భుత కావ్యం “అమ్మ”
అమృతధారలు అధరాలకు అందించే అమృతభాండం అమ్మ
అఖిలాండకోటి బ్రహ్మాండానికి ఆది మూలం అమ్మ
ఆ విధాత మనకొసగిన అమూల్య కానుక అమ్మ
అర్ధించకనే ఆకలితీర్చు ఆరాధ్యదేవత అమ్మ
మాటలకందని మమతల శిఖరం అమ్మ.
ఊహలకందని ఊర్వి రూపం అమ్మ.
శోకం తెలియని, లోకం ఎరుగని ఆ పాపాయిని
భువికి పరిచయపరచిన పరమపావని అమ్మ
బుడిబుడి నడకల బుడతడి తడబడు అడుగుల
నడకలు నేర్పిన ఆది గురువు అమ్మ.
కోటి ముద్దులతోడ, గోరుముద్దలు చేసి
ఆ సుధాంశుని చూపి సుతునికి
కథలు చెప్పే మహా కవయిత్రి అమ్మ.
పారాడే పాపాయిని
జాతిని కాపాడగ పోరాడే సిపాయిగా,
మనిషిని మనీషిగా జగతికి వెలుగునిచ్చు
దీపంలా మలిచే మహా శిల్పి అమ్మ.
సృష్టిని నడిపించే రెండక్షరాలు అమ్మ
ఈజగతిన "అమ్మకు సాటి అమ్మే"!
అమ్మని మరిపించే మరోపదం "అమ్మే"!


                                                                                                                                          శ్రీమణి