*ఆమె వెళ్ళిపోయింది*
ఆమె వెళ్ళిపోయింది
బంధాలు అనుబంధాలు
ఊపిరాడనివ్వలేదు
వెలుతురు కోసం
చీకటిని ప్రాధేయపడుతూ
కుప్పతొట్టి దగ్గరే తపస్సుచేసేది
సృష్టించిన అమ్మ
కాదు కాదు
ఆ శుష్కించిన బొమ్మ
కన్నప్రేగుబంధాల పెనుగులాటలో
నేలజారి భళ్ళున ముక్కలైపోయింది
కాసుల వంతులాటలో
విసిగి వేసారి వీధుల పాలయింది
నిన్న తల్లిని కాబోతున్నానని విర్రవీగిన
వెర్రిబాగులతనం తలంపుకొచ్చి
ఆతల్లి గుండెగొంతుక
అగాధంలో కూరుకుపోయింది
ప్రాణం నిర్దాక్షిణ్యంగా దేహం నుండి
విడివడుతుంటే
కొడిగట్టబోతున్న దీపం
మరణంతో యుద్ధంచేస్తుంది
ఆఖరిమజిలీ ఒక దయనీయ
ఘట్టానికి వేదికగా నిలిచింది
అమ్మను వదిలించుకోవాలని
అనురాగాన్ని విదిలించుకోవాలని
రెక్కలొచ్చిన పక్షుల తగవులు
పగలబడి నవ్వుతుంది
అమ్మ విగతశరీరం
మౌనంగా మాట్లాడుతుంది
కనిపెంచిన వాత్సల్యం
భద్రం బిడ్డా....
రోజులు ఏమాత్రం మంచిగా లేవు...
అయినా అది మాతృత్వపు నైజం
అందుకే మన్నిస్తూనే మరలిపోయింది
ఆశీర్వదిస్తూనే
ఆత్మలా అనంతవాయువుల్లో
కలిసిపోయింది
ఆమె వెళ్ళిపోయింది.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=BjWMPHgrSpKa4T3Z