*మళ్ళీ ఉదయించాడు*
మునుపు చీకటిచూరుకు వ్రేళ్ళాడుతూ ఉండేవాడు వెలుతురు గుళికను
మ్రింగి మిణుగురులా మారాడు
ఒకప్పుడు ఎడతెగని కన్నీటి ప్రవాహమే
ఇప్పుడు మహాసముద్రంలా
అవతరించాడు
నిన్నటిదారులనిండా నిశీధులూ,నిశ్శబ్దాలే
ఇప్పుడిప్పుడే చైతన్యాన్ని నింపాదిగా తనలోనికి ఒంపుకుంటున్నాడు
ఎన్నివేలసార్లు తలపడ్డాడో తెలవారని నిశిరాతిరితో
కనికరించని కాలం జటిలమైన ప్రశ్నాపత్రాలను
సంధింస్తూ స్థాణువులా నిలబెడితే
ఆవహించిన నిర్వేదం ఆశను అమాంతం మరణశయ్యపైకి విసిరేసింది
అప్పుడే ఆర్తిగా ఆఖరుపేజీ తిరగేసాడు
కొన్ని ఆశావహదృశ్యాలు
మనశ్చక్షువులకు సాక్షాత్కరించి తక్షణకర్తవ్యాన్ని
గోచరింపచేసాయి
అతడు మళ్ళీ ఉదయించాడు
నైరాశ్యపు నిబిడాంధకారాన్ని అధిగమించి అభిజ్ఞుడయ్యాడు
మరణించడమంటే ఓడిపోవడమే..
అందుకే మనుగడతంత్రులను నైపుణ్యంగా సరిచేసుకుంటున్నాడు
నిస్పృహనూ,నిస్త్రాణాన్ని విదారించి అతడిప్పుడు యోధునిలా మారిపోయాడు
పునరుజ్జీవన సూత్రాన్ని ఔపోసన పట్టాక
నైరాశ్యపు చిత్రాలను బ్రతుకు గోడలపై తగిలించడం లేదు
పడిలేచేకెరటాన్ని పదేపదే చూస్తున్నాడు
అతడిప్పుడు సూర్యునిలా
ఉదయిస్తున్నాడు
ఓటమినీ గెలుపునూ అంగీకరించే స్థితప్రజ్ఞతను ధరించాక ఆశలవర్ణాలతో అంతరంగాన్ని అద్భుతంగా
అలంకరించుకొన్నాడు
అతడింక మరణించడు చిట్టచివరి వరకూ
చిగురిస్తూనే వుంటాడు
గమనమెరిగిన మానవుడు
మళ్ళీమళ్ళీ ఉదయిస్తాడు
సందేహంలేదు ఏదో ఒకరోజు అవనిని శాసిస్తాడు.