(స్వామీ వివేకానంద)
జీవుడే దేవుడనీ,
శక్తియే జీవితమని
బలహీనత మరణమనీ
భయం పెద్ద పాపమనీ
నిర్భయంగా సాగమనీ
యువతే భవితకు మూలమనీ
ఆత్మస్థైర్యమే ఆయుధమని
విజ్ఞానమే విలువగు ధనమనీ
అజ్ఞానం ఛేదించమని
చదువుకు సంస్కారం ఆవశ్యకమనీ
స్త్రీ శక్తే జాతికి జీవధాతువనీ
ప్రేమతత్వం విడనాడ వలదనీ
దరిద్రనారాయణ సేవే
మానవ జాతికి పరమావధి యని
ఆరంభం అతిచిన్నదయినా
ఘనమగు ఫలితం తధ్యమని
లక్ష్యసాధనకు గమ్యం ఆవశ్యమని
జాతికి హితమును
హితవుగా ప్రభోదించి
అఖండ భారతాన్ని
తన జ్ఞాన ప్రభలతో
జాగృతమొనరించిన
ఆధ్యాత్మిక అద్వితీయ శక్తి
సనాతన ధర్మ సంరక్షణకై
అహర్నిశలు శ్రమించిన
అలుపెరుగని ఋషీ
నిరంతర సత్యాన్వేషీ
ఓమనీషీ
ఓ మహర్షీ
ఓమహోన్నతమూర్తీ
ఓ మార్గదర్శీ
ఓమానవతాచక్రవర్తీ
ఓమనోజ్ఞమూర్తీ
చిరుప్రాయమందునే నీవుఅమరుడవైనా
ధరిత్రి వున్నంత వరకూ
తరతరాల చరిత్రలో
చెరగని చరిత్రవే నీవు
అమృత తుల్యమగు
మీ దివ్య సూక్తులే
మాకు శిరోధార్యం
ఆనాటి
మీఅడుగుజాడలే
మాకు శ్రీరామరక్ష..
స్వామీవివేకానందుని
జయంతి సందర్భంగా
సాలిపల్లిమంగామణి (శ్రీమణి)