ఆసరా...దొరికింది...
ఆశల తీరానికి దూసుకుపోవడమే ఇక,
కాలం కసితీరా కాటేయాలని చూసినా...
ఎడతెగని నా మనోధైర్యం ఉందిగా...
అదే నా భరోసా...
వెతలెన్నున్నా....తల రాతని ..తల పట్టుకోను
మొదలంటూ... పెట్టాగా
వెనుదిరిగే మాటేలేదు
గమ్యం చేరేదాకా....
చేరేందుకు వేరే దారులెన్నున్నా...
నాదెపుడూ.... రహదారే
కన్నుల నిండా... కన్నీరున్నా...
విజయం మాత్రం... నా కనుసన్నల్లోనే
కారుమబ్బులు కమ్ముకొస్తున్నా...
కటిక చీకటి అలుముకొస్తున్నా...
కనులముందు నా ఆశయం
కాంతిరేఖై నాకు దారి చూపిస్తుంటే
ఎంతటి కష్టమైనా....
పలాయనం చిత్తగించాల్సిందే,
మడమ త్రిప్పని నా సంకల్పానికి
సలాం అంటూ...గులామవ్వాల్సిందే..,
కన్నీరెందుకు కార్చాలి
కష్టానికీ, సుఖానికీ పైసా.. ఖర్చు లేదనా...?
బాధలన్నీ భగవంతుడు తీర్చేస్తే.....
బద్ధకంతో నేను మొద్దు నిద్దరోవాలా....
ఇది అహంకారం కాదు
అత్యుత్సాహం అసలే కాదు
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
భారమైనా....దూరమైనా...చేరేతీరాలి..
అదిగో.... ఆవల తీరం
అల్లదిగో.... ఆశలతీరం
*శ్రీమణి*