పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

27, నవంబర్ 2016, ఆదివారం

కానరావ శ్రీరామా ......



కానరావ శ్రీరామా ...... కమనీయ గుణధామా 
రఘుకులాన్వయ రామా ..... రమణీయ రామా 
కారుణ్య రామా ...... కళ్యాణ శ్రీ రామా 
 సీతామనోభిరామా...... ఆశ్రిత మందారమా 
 దశరథాత్మజ రామా ... .. ధరణీ జామాత రామా 
కొంగు చాచి వేడుకున్నా ... నను బ్రోవవ కొంగు బంగారమా " కాన"
హనుమ అంతటి భక్తుణ్ణి నే గాను 
శబరిలా కొసరి కొసరి తినిపించగలేను 
చిట్టి ఉడతలా ... నిరతం నిన్నే కొలిచాను. 
చేయి పట్టి కాపాడు చెంగల్వ పూల రామా 
నీరజలోచన రామా... నిఖిలాధార రామా 
వేయి దండాలయా .. మమ్మేలిన శ్రీ రామా       " కాన"
చేయి చాచి అడగగానే,సేద దీర్చు దైవమా ... 
వేయి పున్నములు మా దోసిట నింపివేసినావు,
అలవోకగా అంబుధిపై వారధి నిలిపావు,
పాషాణాన్నే పడతిగ మలిచావు. 
కారు మబ్బు కమ్మేసినా,, కటిక చీకటి బ్రతుకయినా 
నీ పాద స్పర్శతో కళకళ లాడదా... కల్పతరువై అలరారదా.... 
కానరావ శ్రీ రామా... కమనీయ గుణధామా 
రఘుకులాన్వయ రామా... రమణీయ రామా 
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 
ఈ రోజు మా ఇంటిలో నేను శ్రీ రామ దేవుని వ్రతం చేసుకొన్నాను,
అందుకే  నా కవన రామ నామామృతాన్ని
మీ అందరితో కలిసి ఆస్వాదించాలని మీతో పంచుకొంటూ ... 

                                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 
                                                     pandoorucheruvugattu.blogspot.in



23, నవంబర్ 2016, బుధవారం

గానఘనగాంధర్వరవళీ




మన మోహన మురళీ మరలి రాని లోకాలకు మరలిపోయావా 
గానఘనగాంధర్వరవళీ  గగనసిగల కెగసి మెరిసి పోయావా  
రతన స్వరరసరాజమౌళి సురస్వర సేవకై తరలెల్లి నావా 
ఉరికే సంగీత సుమ ఝరి,స్వర రాజశిఖరి,పలుకు మధురిమలు సిరి, 
సరిగమల రస రమ్యలాహిరి,,కర్ణాటక సంగీత ,విరి చందనాల విభావరులు,
 ఆణిముత్యాల సరులై మము చేరి మైమరపుగా మారి 
మలయ మారుతాన్నే మీరి అలరించిన మానసచోరా .. 
నీ మహాభినిష్క్రమణం ఏవత్ సంగీత సామ్రాజ్య మహాంతస్తాపము 
నిన్నటి నీ సమ్మోహన స్వరం నేడు  స్వప్నమయి ఎదురయితే  
నీ గానమినిపించక,మౌనమాయేను మా భాష 
నీ మురళి సవ్వడి లేక మూగబోయేను మా పలుకు 
సరిగమలతో  పసిడి రాగాలు పండించి 
కొసరి,కొసరి నీ సుస్వర  రాగాన్ని వడ్డించి  
తత్వాన్ని,అమృతత్వాన్ని మాపై చిలుకరించి 
నీ కీర్తనలతో శ్రీవారి ఆస్థానమలంకరించి,
వారినలరించగ నేరుగా పాదాల చేరితివో 
 వేణువై గాలిలో ఏకమైపోతివో ... 
 ఏమి సేతురా సామి మేమీ సేతు 
ఏడనున్నా సామి ... నీ గాంధర్వ గానాన్ని మేము మరువగ లేము 
నీ గళాన జారిన  స్వరామృతము సదా గ్రోలుతుంటాము 
ఏడేడు లోకాల ఏడనున్నా గాని 
బాలమురళీ రవమును ఎడతెగని ఆర్తితో ఆలపిస్తూ 
మంగళం వారికి మంగళ నీరాజనాలర్పించుకొంటూ 
మా గుండెగొంతుకలో నిండిపోయిన సంగీత చక్రవర్తికి 
 నివాళులర్పిస్తూ ... ఆ అభిజ్ఞుని ఆత్మకు శాంతి కలగాలని 
                         ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ...... 
                                                             సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 
                                                pandoorucheruvugattu.blogspot.in