మసకబారిపోతున్న మానవత్వ దీపం మహోజ్వలంగా ప్రజ్వలించాలంటే
ప్రతి మనిషిలోని అమానుషత్వం పటాపంచలవ్వాలంటే,
నిత్యాగ్నిహోత్రంలా నిరంతరం వినిపించే అబలల కన్నీటి ఆర్తనాదాలకు చరమగీతం పాడాలంటే
అబల బ్రతుకుల అడుగుఅడుగున చితిని పేర్చే నయవంచకులను ,మట్టికలపాలంటే
పెచ్చురేగిన విచ్చలవిడి మదోన్మాదుల మదం అణచాలంటే
మురిగిపోయిన రాజకీయ రోచ్చును ప్రక్షాళన చేబట్టాలంటే ,
అమ్మా ,నాన్నల నడివీదుల పాల్జేసిన నాసిరకపు పుత్రుల పుర్రెల పుచ్చకాయల్లా తెగ నరకాలంటే
ఆలిమెళ్ళో తాళి తెంచి , కన్నబిడ్డల కన్నీట ముంచి , మందుపోసుకు చిందులేసే మందమతుల వీపు విమానం మోత పెట్టించాలంటే ,మితిమీరిన మత్తుల్లో వెర్రి పుంతలు తొక్కుతోన్న యువతకు మార్గం నిర్దేశించాలంటే ,
కుల మతాల వివక్షలను , అల్లంత దూరం తరిమేందుకు , సమ సమాజ స్తాపనకు , జన్మనిచ్చిన భరత భూమికి బంగారు చరితను అద్దడానికి ,
కమ్ముకొచ్చిన కారుమబ్బును కాంతిరేఖ చీల్చినట్టు . ప్రతీ నీవు ప్రబల శక్తి గా
కదం తొక్కిన సింగమల్లె సమాజానికి చెదలు పట్టించిన స్వార్ధపరుల శిరస్సు తెంచి , అవినీతి ఆనవాళ్ళను ఆద్యంతం
పెకలించి ,అన్యాయపరుల ఆగడాలను అమాంతం కాలరాసి , కలలు గన్న సమాజాన్ని కనుల ముందు సాక్షాత్కరించేందుకు , ఎవరో ఎందుకు రావాలి . నువ్వే కారాదా !నవ సమాజ బీజానివి . నువ్వే కారాదా !రేపటి ఉదయించే నవకిరణానివి . స్పందించే మనసుంటే ప్రతీ నీవు మార్గ దర్శి వే ,ఎవరో ఎందుకు రావాలి . నవ సమాజ నిర్మాణంలో ప్రతీ నీవు పునాదిగా మారితే ,
శ్రీమణి @సాలిపల్లి మంగామణి