పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, జూన్ 2014, శనివారం

తెలుగు "ధనం"



నల్లనయ్య  పిల్లనగ్రోవి ఆలపించిన రాగంలా !
చల్లనయ్య  చిందించిన పున్నమి వెలుగు సరాగంలా !
మధుమాసం మది తాకి నటుల ,
మధుదారలు  అధరాలకు  జాలువారినటుల ,
మంచిగంధం   పూసినటుల ,
మరు మల్లియ విరబూసినటుల ,
నాలుక  నవనీతం చవి  చూసినటుల ,
పాలూ ,తేనెలు బోసి  వండిన  పరమాన్నంలా ... 
పంచదార  పాకమున పల్కులు  ముంచి  తీసినటుల ,
తియ తీయని  అనుభూతులు  నా  తెలుగుదనంలో .. 
విడదీయలేని  అనుబంధం  నా  తెలుగు దనంతో ... 
నా  తెలుగులమ్మ  సుమ సరములోని  వాడని  కుసుమంగా  నిలవాలని ,
విను వీధులు  వినిపించగ  తెలుగు పాట పాడాలని ,
ఎల్లలు  దాటి  చల్లని  మా తెలుగుతల్లి  ఖ్యాతి  దిగ్దిగంతాలా  ఎలుగెత్తి  చాటాలని ,
ఆ  గగనపు సరిహద్దు మీద తెలుగు  ఓనమాలు  లిఖించాలని , 
చిన్ని ఆశ  మాకు.   జన్మ భూమి  ఋణం  తీర్చుకోవాలని ,
పట్టా  చేతబట్టి పొట్ట  చేత  పట్టుకోని  పొరుగు నేలకై  మేము  తరలినా ... 
మరలునా  మా  మాతృభూమిపై  తరగని  మమకారం . 
అమ్మే  లేదంటే  ఏ  జీవికైన  జన్మెక్కడిది ?
తెలుగే   లేదంటే  తెలుగుబిడ్డకు  వెలుగెక్కడిది ?
అమ్మ  చేతి   గోరుముద్దకు  సరి తూగునా పరాయి  నేలపైన  పరమాన్నం . 
తేటతెలుగు  లాలిపాటకు  సాటి  ఏదీ  అధ్బుత రాగం ?
ఆకాశపుటంచులు   తాకినా ... తరువు  ఎరుగదా  తన  మూలం  నేలయని . 
ఖండాంతరాలు  దాటెగిరినా .. మా  కన్నతల్లి  గుండె చప్పుడు  మారుమ్రోగుతోందిక్కడ . 
ప్రతీ  నిమిషం  అమ్మ ఒడిని  తలుచుకొంటూ .. 
కర్తవ్య పాలనలో  పరాయి నేలపైన  పరుంటూ ... 
తెలుగుకై  తెలుగన్నదమ్ములం  తెగ  మురిసి  పోతున్నాం . 
అవనిపై  అదృష్టవశాత్తూ  తెలుగు  బిడ్డలమైనందుకు గర్విస్తున్నాం . 
      
  సాలిపల్లి మంగామణి @ శ్రీమణి ,
http://pandoorucheruvugattu.blogspot.in  








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి