పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

15, నవంబర్ 2018, గురువారం

*అదిగో....ఆశలతీరం*

ఆసరా...దొరికింది...
ఆశల తీరానికి దూసుకుపోవడమే ఇక,
కాలం కసితీరా కాటేయాలని చూసినా‌...
ఎడతెగని నా మనోధైర్యం ఉందిగా...
అదే నా భరోసా...
వెతలెన్నున్నా....తల రాతని ..తల పట్టుకోను
మొదలంటూ... పెట్టాగా
వెనుదిరిగే మాటేలేదు
గమ్యం చేరేదాకా....
చేరేందుకు వేరే దారులెన్నున్నా...
నాదెపుడూ.... రహదారే
కన్నుల నిండా... కన్నీరున్నా...
విజయం మాత్రం... నా కనుసన్నల్లోనే
కారుమబ్బులు కమ్ముకొస్తున్నా...
కటిక చీకటి అలుముకొస్తున్నా...
కనులముందు నా ఆశయం
కాంతిరేఖై నాకు దారి చూపిస్తుంటే
ఎంతటి కష్టమైనా....
పలాయనం చిత్తగించాల్సిందే,
మడమ త్రిప్పని నా సంకల్పానికి
సలాం అంటూ...గులామవ్వాల్సిందే..,
కన్నీరెందుకు కార్చాలి
కష్టానికీ, సుఖానికీ పైసా.. ఖర్చు లేదనా...?
బాధలన్నీ భగవంతుడు తీర్చేస్తే.....
బద్ధకంతో నేను మొద్దు నిద్దరోవాలా....
ఇది అహంకారం కాదు
అత్యుత్సాహం అసలే కాదు
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
భారమైనా....దూరమైనా...చేరేతీరాలి..
అదిగో.... ఆవల తీరం
అల్లదిగో.... ఆశలతీరం

                    *శ్రీమణి*

13, నవంబర్ 2018, మంగళవారం

సుస్వరాలకోకిలమ్మ‌‌.. మనసుశీలమ్మ


🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸

ఏ గానమాలకించగానే..
గగనం సైతం పులకిస్తుందో...
ఏ స్వరం వినగానే మది
మరుమల్లెల పరమవుతుందో

ఏ గాత్రం వింటూనే...
ప్రతి హృదయానికి
చైత్రం ఎదురవుతుందో..
ఏ మరందపు పాటల ఝరిలో..
రాగాలన్నీ... మానసరాగాలై
పరవశమవుతాయో...

ఎవరి గళంనుండి
అమృతం అలవోకగా
జాలువారుతుందో...
ఎవరి గొంతు వినిపించగానే...
ఆబాలగోపాలమూ
ఆనందరాగమాలపిస్తుందో...

ఆమే....
మనసుస్వరాల కోయిలమ్మ
మనసెరిగిన మన సుశీలమ్మ

అవును ఆ కంఠం మనసుమనసునూ
తట్టిలేపుతుంది..
తాను పాడిన పాటకు
తనువంతా... తన్మయమై
వెన్నెలతానమాడుతుంది
ఆమెపాడితే... మైమరచి
మన మది... మకరందం చవిచూస్తుంది
ఆమెపాడితే... ప్రకృతి పరవశమై ప్రణయ వీణలు మీటుతుంది
ఆమె పాడితే ఎద ఎదలో
మధురోహల పూదోట
విరబూస్తుంది

ఆహా..ఎంత భాగ్యము నాది
గాన కోకిలకు
చిరుకవనమర్పించ
నా కలమునకెంతటి సౌభాగ్యమో...
ఆ సంగీతసామ్రాజ్ఞిని సన్నుతించ
ఆ అపర విద్యున్మాలినికీ...
ఆ సుస్వరాల సుమ మాలినికీ...
అక్షర నీరాజనాలర్పిస్తూ...
సుస్వరాల పూలకొమ్మ
సుశీలమ్మకు
పుట్టినరోజు శుభాకాంక్షలతో
   
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸

11, నవంబర్ 2018, ఆదివారం

నాగులచవితి


మీ పాపాలు
బాపాలని
మాపాలి పడి.....
పాలెన్ని పోసినా...
అవి మట్టిపాలే...
మీ ఇంట
కోటిదీపాలు
వెలగాలంటే
కోపాలు,తాపాలు
కాదు..కాసింత
మానవత్వపు పాలు
పెంచి చూడు...
                 ఇట్లు
               *నాగన్న*

                   శ్రీమణి

5, నవంబర్ 2018, సోమవారం

కళాసరస్వతి అవార్డు తీసుకున్న శుభతరుణం


నేడు వరంగల్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రాంగణంలో
"కళానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ, గోదావరి ఖని",  వారు నిర్వహించిన సాహితీరంగంలో జాతీయస్థాయి తెలంగాణా కళా సరస్వతీ, మదర్ థెరీసా అవార్డు 2018 అందుకొన్న శుభతరుణం... మీ ఆశీస్సులు కాంక్షిస్తూ...
🌿🌺🌸🌺🌸🙏🌸🌺🌸🌺🌿

2, నవంబర్ 2018, శుక్రవారం

దేవులపల్లి122వ జయంతి సందర్భంగా

నిన్నటి రోజున దేవులపల్లి వారి స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లాలోచంద్రంపాలెంలో జరిగిన 122వ జయంత్యుత్సవాల చిత్రాల సమాహారం. ఈ సభలోనే నా తొలి అతిధి ప్రసంగం చేసినది. ఆ మహనీయుని ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నందునే నాకు ఈ సదవకాశం లభించిందని నన్ను అన్నివిధాలా ప్రోత్సహించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమణి
🌺🌸🌺🌸🌺🙏🙏🌺🌸🌺🌸🌺