పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

25, జులై 2023, మంగళవారం

శ్రీమణి గజల్

*శ్రీమణి గజల్*

నాకోసం మరుమల్లిగ మారగలవ ఒక్కసారి
ప్రియమార  నాకురులను తాకగలవ ఒక్కసారి

మదిగదిలో  నీరూపమె నిమిషమైన నిదురరాదు
తనివితీర మనపాటను పాడగలవ ఒక్కసారి

మనతలపుల తలవాకిట తన్మయమై  నిలుచున్నా
విరివింటిని వరమీమని కోరగలవ ఒక్కసారి

నీరాకకు పులకరించి హరివిల్లుగ విరిసినాను
నా ఆశల వర్ణాలను చూడగలవ ఒక్కసారి

చిత్తములో చిత్తరువై కొలువుంటే చాలదుమరి
*మణి* మనసును మృదుకవితగ రాయగలవ ఒక్కసారి.

*సాలిపల్లిమంగామణి(శ్రీమణి)*

11, జులై 2023, మంగళవారం

ఈ ఉదయం మునుపటిలా లేదు

*ఈ ఉదయం మునుపటిలా లేదు*

నేను రేపటి కోసం రచిస్తున్నాను
అలసిన రాతిరిపై రాలుతున్న సిరాచుక్కలు
చిమ్మచీకటి కొమ్మపై వాలిన మిణుగురు రెక్కల్లా మినుకు మినుకుమంటున్నాయి
అర్ధరాత్రి దాటినా ఆగదు
నా అక్షరాల కవాతు
కలం,కాగితం
కదిలిపోయిన రాత్రే
ప్రత్యక్ష సాక్ష్యాలు 
చీకటితో యుద్ధంచేసి స్వప్నాలనైతే
కనగలుగుతున్నాయి కళ్ళు
వర్ణాలను కోల్పోయిన హృదయం మాత్రం 
ఈ ఉదయరాగాలను ఆస్వాదించలేకపోతుంది
వెలుతురెందుకో వెలవెలబోతుంది
తెలియని వెలితి ప్రభాతాన్ని ఆహ్వానించలేకపోతుంది
విప్పారిన పూలసోయగాలను
చూసీ చూడనట్టు కనురెప్పలు 
మౌనంగా వాలిపోతున్నాయి
మనసుగోడలకేసిన రంగులు
మళ్ళీ వెలిసిపోతున్నాయి
నలిగిన కన్నుల సాక్షిగా ప్రభవించిన అక్షరాలు పరివర్తన కోసం పరితపిస్తూ ప్రతీఉషస్సునూ
అభ్యర్థిస్తున్నాయి
ప్రతీ ఉదయంలోనూ పరిమళించాలని
అదేంటో పువ్వులు నవ్వడమే లేదు
ఏ గువ్వల సవ్వడి చెవులను సమీపించడంలేదు
ఆశచావక మళ్ళీ మేలుకున్నాను
అరచేతులతో ముఖాన్ని పులుముకుని,
అల్లంత దూరంలో నిశ్శబ్దంగా
ఆకాశహర్మ్యాలు 
పచ్చదనం కోల్పోయిన ప్రకృతి
పగలబడి నవ్వుతోంది 
ఈ ఉదయం మునుపటిలా లేదు.
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*

8, జులై 2023, శనివారం

తెలుగు లోకంలో

ఈనాటి *తెలుగులోకం* చారిత్రక సాహితీ సాంస్కృతిక తెలుగు దినపత్రికలో
ప్రచురించబడిన నా పరిచయం
మిత్రులందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...
తెలుగు లోకం దినపత్రిక వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ....*శ్రీమణి*
🙏🌺🌺🌺🌺🌺🙏