పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జూన్ 2016, గురువారం

దోబూచులేలా ....


చిలుక నడిగి కులుకు  నేర్చుకున్నా.... 
తారక నడిగి తళుకు తెచ్చుకొన్నా... 
మేనక నడిగి మెలికలు అందిపుచ్చుకొన్నా 
 జాబిలికి జాబు రాసుకున్నా... జామురాతిరి వెన్నెల ఒలకబోయమని 
జడివానకు కబురెట్టా ... ఎట్టాగైనా ముత్యాల జల్లు కురవాలని  
హరివిల్లును  అడిగి  పానుపేసా ... నీలి మేఘాల దుప్పటి అప్పడిగి తెచ్చా ... 
పిల్లగాలి పరదాను విసరమన్నా.. కోయిలమ్మను మనకు జోల పాడమన్నా..
మధుపంతో  మంతనాలు చేసి మకరందం అధరాలకు అద్దేయమన్నా.... 
సూరీడికి మనవి  చేసుకొన్నా ... నెమ్మదిగా ఉదయించమని 
 అన్నీ సిద్ధం చేసా... ముద్దుల నా కృష్ణా 
 సద్దు సేయక వచ్చి కనులు మూస్తావని 
 ముద్దులన్నీకలిపి వెన్నముద్దలిస్తావని 
 వలపులన్నీ మురళిలో మూటగట్టి 
 నీ ప్రణయరాగాలలో ఓలలాడిస్తావని 
వేచియున్నా... ప్రియా .. 
దోసిట నా చిరునగవుల సిరులతో 
సిగలో సిరి మల్లియ మాలికతో 
ఎగసే నా మనసును ఊరడించలేకున్నా ... 
ఆలస్యం  సేయక రా..  కృష్ణా అలసిన నీ రాధిక కై  
దోబూచులు చాలించి దరి చేరవా మాధవా నీ ప్రేమికకై . 

                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి 






5, జూన్ 2016, ఆదివారం

పచ్చని చెట్టుని....ఆయువు పట్టుని,



నేను,పచ్చని చెట్టుని,వెచ్చని మీ  ఆయువు పట్టుని,
ఆడుకోమన్నా.. వాడుకోమన్నా... కడుపు నింపుకోమన్నా... నా అణువణువు మీకర్పించి, మమ్ము కాపాడామన్నా.. ..
కొట్టొద్దని,గొడ్డలి పెట్టొద్దని,మొత్తుకొన్నా... మొరపెట్టుకొన్నా.. 
అర్ధించా,అదిలించా,కదిలించా,కడకు కల్లోలంతో బెదిరించా,
పరితపించా .. ప్రకోపించా... ప్రకృతి ప్రళయాలతో ప్రజ్వలించా !మీ పరివర్తనకై నిరీక్షించా,
నీరసించి పోయా,నీరుగారిపోయా..  మీ నిర్లక్ష్యపు ధోరణికి,
తడవ,తడవకూ ... పుడమి గుండె పగులుతున్నా... లేదే  మీలో చలనం 
 బిత్తరపోయిన ఉత్తరఖండ విలాపాన్ని కనులారా చూసినా.... మేలుకోరేం . 
మితిమీరిన పాపానికి ,రగులుతున్న భూతాపం రంకెలు వేస్తున్నా.. లక్ష్యపెట్టరే 
సునామీలా , సుడి గుండాలా,వరదలా,ఉప్పెనై ,హుదుద్ రక్కసి తుఫానులా, .. ముంచేసినా 
 పగులుతున్న ప్రకృతి   గుండె చప్పుడు మీ చెవికి చేరనప్పుడు ,
  విచిత్ర రోగాలతో విలవిలలాడినా ... మీ నోరు మెదపనప్పుడు 
సాంకేతికత పేరుతో పెచ్చుమీరుతున్న మర జీవనాలు 
పట్టణీకరణ తో పచ్చదనానికి మీరు పలికే వీడుకోలు 
మరుగవబోతున్న పిచ్చుకే రేపటి మీ  నాశనానికి ఆనవాలు,
ఇప్పటికే  జరగరాని ఘోరం జరిగిపోయింది,ఓజోను పొర చిరిగి చిరిగి హాలాహలాన్ని వెదజల్లుతోంది,మరుగుతున్న భూతాపం హరియించే మా జాతిని రక్షించే బదులు భక్షించేస్తే 
మిము రక్షించగ రాముడయినా ..... దిగిరాడే,
మానవ తప్పిదానికి ప్రకృతి ప్రతీకారంతో సర్వనాశనం చేయకముందే మేలుకోండి. మీ నేరాలను  మీరే సరిదిద్దుకొనే చిట్ట చివరి అవకాశం. 
ప్రకృతిని పరిరక్షించండి,పచ్చదనాన్ని కాపాడండి,పల్లెను రక్షించండి,
 ప్రకృతి భీభత్సానికి బీజాలు వేసిన మీరే,శరణాగతి అంటూ మోకరిల్లండి,,
లెక్కకు మించి మొక్కలు పెంచి,పచ్చదనానికి,నాంది పలకండి. 
రేపటి స్వచ్చ భారతి ప్రగతికి చెట్లను నాటి పసిడి మెట్లను నిర్మించండి, 
                (ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా చేయి చేయి కలపండి,కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించగ నడుం బిగించండి.)

                                                                               సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

1, జూన్ 2016, బుధవారం

కలవో... కల్పనవో!


జలతారు మెలికా... జవ్వని మేని తళుకా ..
వెలుతురు తునకా... కలువకంటి కులుకా ...
స్వాతి ముత్తెపు సినుకా ... మధురఅధరాల సినుకా ...
పంచవన్నెల చిలుకా  ... పంచదారల గుళికా ...
మలయ సమీర వీచికా...విరిసిన  సిరిమల్లికా
నా  నయనాల లోగిళ్ళ మెరిసిన తొలి కానుకా ....
నా  మానస వీణకు ప్రభవించిన  వలపుల  ప్రవల్హికా...
 కలవో... కల్పనవో,నా ప్రణయపు కవనంలో విరబూసిన కవితాచ్చరవో
కనుల మాటునా... కనురెప్ప చాటునా కన్ను గీటుతూ,మదిని మీటుతూ
నిన్నటి కలలో కనువిందును చేసి,
 నీ వలపుల వలలో  నను బంధీ చేసి,..
 నీ తలపులలో తలమునకలు చేసి
 నీ ప్రేమ లోగిలిలో నను దాసుని చేసి
 ఏ నీలి మేఘాల ముసుగులో దాగావో !
 ఏ మువ్వల సవ్వడిలో  సిరి మువ్వై మోగావో .. 
 ఏ  పువ్వుల పరిమళంలో చేరి పరవశించావో... 
 జాలి లేదా చెలీ!నిను వలచిన ప్రియసఖునిపై 
 గేలి చేయక సఖీ నా హృదయంలో ప్రణయాన్ని,
ఏచోట నీవున్నా.. ఆఘమేఘాలపై నను చేర  రావా... 
నీకై నిరీక్షించు నా హృదయానికి  తొలి కానుక నీవా... 
           (తన స్వప్న సుందరికై ఒక  ప్రేమికుని విన్నపం)
                                                            సాలిపల్లిమంగామణి@శ్రీమణి