పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

5, సెప్టెంబర్ 2015, శనివారం

రా రా కిట్టయ్యా ...


రా రా కిట్టయ్యా ... రతనాల కృష్ణా 
నవనీత  చోరా  .. నా బాల కృష్ణా 
నీపాదాల సిరి మువ్వ రవళితో
 నా ఇంట సిరులు కురిపించగా 
నీ కనుసైగ మాత్రమే మా సకల సౌభాగ్య రేఖ 
చల్లని నీ చూపే మాకు శ్రీ రామరక్ష 
తెల్లవారక మునుపే ముత్యాల ముగ్గులేసాను 
పాలబువ్వను వండి నీకై తలుపు తీశాను 
ముల్లోకములనేలు మురిపాల కృష్ణా 
మురిపించ రావయ్య ముంగిళ్ళలోకి 
అభిమానమంతా అటుకులు బెల్లంతో 
మూట గట్టి మువ్వ గోపాల నీకై వేచి చూస్తున్నాను 
బుడిబుడి తడబడు పసిడి అడుగులతో 
కిల కిల చిరునవ్వుల వెన్నెల మిలమిలతో 
గలగల  సిరి మువ్వలగజ్జెల  చిరు  సవ్వడితో,
తియతీ యని  మురళీ రవళితో 
వేంచేయవయ్యా  వన్నియల కృష్ణా 
భోంచేయి మా ఇంట విందు ఈ పూట 
అలసి ఉన్నా ప్రభూ... నిన్నటి నిద్దురలో నీతో ఆడిపాడి 
నిరీక్షించగ క్షణమైనా  నిలువజాలను నేను 
                         కృష్ణాష్టమి శుభాకాంక్షలతో                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

ఆచార్య శ్రీ నేమాని కృష్ణమూర్తి సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేడుకల సందర్భంగా ఆ మహనీయుని వర్ణిస్తూ నా కవనం ..



ఏమని  పొగడగలము ఎల్లలు దాటిన శ్రీ నేమాని యశో తేజో విరాజ రాజసాన్ని,
ఎంతని  కొనియాడగలము.  ఆ అవిరళ కృషీవలుని,అలుపెరుగని ఋషీశ్వరుని,
అంబరాన్ని తాకిన ఆ  అభిజ్ఞుఁని   ప్రజ్ఞాప్రాభవాన్ని వర్ణించగ ప్రబంధమైనా సరిపడునా... 
ఆ అసమాన ఆచార్య సార్వభౌమునీ ,ఆ అభీకునీ 
సన్నుతించగ పదములున్నవా పృథ్వి పైన. 
ఆ రసాయన శాస్త్రవిదుఁనీ ,చిత్రకళా కోవిదునీ 
ప్రస్తుతించగ పదివేల మాటలు చాలునా.. .. 
ఆ మాన్యుని  కుంచె నుండి ప్రభవించిన నన్నయ, తిక్కన,ఎఱ్ఱన,శ్రీనాధ పోతనామాత్యుల  చిత్రాల అమృతత్వమేమని ప్రసంశించగలము. 
గీతోపదేశమంటి ఎనలేని అపూర్వ చిత్తరువుల మనోహరంగా మలచి ,  మన సంస్కృతీ సౌరభాన్ని దిగ్దిగంతాలా చాటిన ఆకళాభిజ్ఞుని కౌసల్యమెంతని అభివర్ణించగలము. 
మన నయనమ్ములు చేసుకొన్న సుకృతమ్ము గాక వేరు గాదు.  శిష్యకోటి కల్పతరువును, మేరువంటి గురువర్యుని  చేరువగ అభివీక్షించ,
నా కలానికొచ్చిన వైభోగం.ఆహిరణ్య కంకణ సుశోభితుని వర్ణించగ నా కవనమందు. 
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ,రుక్మిణీ దంపతుల అభిదేయమే మన కృష్ణమూర్తి రుక్మిణమ్మ దంపతుల నామధేయమగుట దైవ సంకల్పమే.. గదా 
అలనాడుద్వాపరయుగంలో  ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి  రుక్మిణీ దేవి  సపర్యలు చేసి తరిస్తే ,  నేడు ఈ  కృష్ణమూర్తి 
"నాతిచరామి" అన్న కళ్యాణ మంత్రాన్నివాస్తవంలో ఆచరిస్తూ రుక్మిణమ్మకి అన్నీ తానై   సేవలందిస్తున్న  ఆదర్శ విభుడు. 

మానవత్వం మూర్తీభవించిన మానవతామూర్తి అతడు . 
ఓ మనీషీ,
ఓ మహర్షీ ,
ఓ మహాత్మా,
ఓ మనోజ్ణమూర్తీ, 
ఓ మార్గదర్శీ, 
ఓ చిత్రకళా చక్రవర్తీ ,
ఓ అభినవ బృహస్పతీ.. 
ఆధర్శ దాంపత్య నిలువెత్తు నిదర్శనమైన  మా 
అభినవ  కృష్ణమూర్తి అయిన మీకు ,మీ సహధర్మచారిణి రుక్మిణమ్మకీ 
ఈ సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేళ పరిపూర్ణ ఆయుష్షునివ్వాలని ఆ పరమాత్మునికి సహస్రకోటి నమస్సులర్పిస్తూ ... 
మీపాదారవిందాలకివే మా అభివందన మందార సుమ మాలికలు . 
                                                                                                   
                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                    

                                              































































29, ఆగస్టు 2015, శనివారం

"మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు"





తెలుగు దనమును మించిన ధనమెక్కడగుపించు ధరణీ తలంపైన , తెలుగు భాషను మించి తేనియల పలుకులేవి . తెలుగు సంస్కృతిని తలదన్ను సాంప్రదాయమెక్కడ కానగలము .నిక్కంగా చక్కని వెలుగుల్ల రేఖ నా తెలుగే ,వేయి పున్నముల రాలిన  వెన్నెల్ల  తునక నా తెలుగే , ఆ తెలుగులమ్మ ఒడిలో పారాడే మనం ,పరమ పావన చరితులం ,స్వప్నమందునైనా మనం తెలుగు మరచి మనలేము. తెలుగు మరచినంతనే మనమే లేము . మన తెలుగు భాషా నిధి. తెలుగు బిడ్దల పెన్నిధి . వెల కట్టగ లేనిదీ . అమూల్యమైన నిధి, కవికీ అందని కమ్మని కావ్యమది .తెలుగుహృదయాల్లో  అణువణువునా నిండిన నది. అదీ తెలుగు రుధిరంలో కలగలసిన సంజీవనది . అదెలా అంటే వర్ణించగ పదములకే పావనమనిపించే లా .. . పలికినంతనే అధరాలకు అమృతత్వం ప్రాప్తించినట్లుగా ... తెలుగు బిడ్డమనే భావనే రాజసమొసగగ ఏ రాజ్యమందున్నా .. 
పరవళ్ళు తొక్కేటి ఉప్పొంగిన గంగా తరంగంలా, పాలసంద్రపు నురగలా ,జున్ను  మీగడతరగలా,  గలగల సాగే సెలయేటి పన్నీటి వరదలా ,ఎల కోయిలల చైత్ర మాస వేవేల మకరంద గీతాలా, పలుకు తేనెల కొలికి అలివేణి అధరాల పారాడు ఝుంటి తేనియ తుంపరలా , పసిడి పచ్చని   తోటలో విరబూసిన   కుసుమ సరాగంలా ,గగన ఫలకంపైన అద్దిన సువర్ణాక్షరాల తేజో విరాజంలా ...  అల నీలిమేఘాల వీధుల్లో విహరించు రాయంచ సోయగంలా ... 
అణువణువు పరవశాన మైమరచే మధురోహల  మాలికలా .. 
వేయి ప్రభాకరుల ప్రభలనే తలపించు మహోజ్వల తేజో ప్రకాశం లా. శతకోటి చందురుల వెన్నియల తలదన్ను చల్లదనమంతా నా తెలుధనమందుండ , ఏ వెలుగులునింపగలవు  నిశీధి హృదయంలో నిజమగు దివ్వెలను . నన్నుగన్న నా తెలుగు నేలను మరిపించు మధురముందా మహీతలంపై . నే పీల్చే గాలి సైతం తెలుగు ఊపిరులూదినట్టుండగా .. నేనెలామనగలను ... తెలుగు లేని తావుల్ల లోన . తెలుగు లేని తెలుగు బిడ్డకు పరిపూర్ణమైన మనుగడేది . తేట తెలుగును నోట పలకని జన్మమేమని చెప్పగలము. తెలుగులమ్మ కడుపునపుట్టి . 
చేతులెత్తి మ్రొక్కుతాను . తెలుగన్నదమ్ములార .. తేట తెలుగు మాటనే మీ నోట పలకండి . తెలుగు తేనెల మూటని చాటి చెప్పండి . అవసరానికి ఇతరభాషను ఆశ్రయించినాగాని  ... అమ్మలాంటి కమ్మని మాతృభాషను మాత్రం మరచిపోకండి . పరభాషా మోజుల్లో తెలుగుకి బూజులు పట్టించొద్దు . తెలుగుతల్లి గుండెల్లో గుభుళ్ళు . పచ్చని తెలుగు పైరులో తెగుళ్ళు మాత్రం పుట్టించొద్దు . తెలుగులమ్మ ఋణం తీర్చగా తెలుగును దిగ్ధిగంధాలా చాటి చెప్పేద్దాం . తెలుగువెలుగుల కీర్తి బావుటా ఎల్లలు దాటి ఎగురవేద్దాం .... ఈక్షణం నుండే తెలుగు భాషా మహాయజ్ఞం కొనసాగిద్దాం .  

మాతృ భాషా దినోత్సవ సందర్భముగా బ్లాగరులు అందరికీ    
  
"మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు"                    

                                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


20, ఆగస్టు 2015, గురువారం

నీ నెచ్చెలి నేనెక్కడో ....



నీ తలపులు నా వలపులగుడి తలుపులు తట్టి
అలుపెరుగక మది వెలుపల నీ సవ్వడి వినగానే
బుగ్గ కంది చిరు సిగ్గులమొగ్గల మొలకయి
మెలకువ చేసింది,నిదురించిన నా హృదయాన్ని
అడుగులు తడబడిపోతున్నా,హృదయంపరుగులు తీస్తుంది
మనసంత నీ చింతయి  గిలిగింత పెడ్తుంది
అదేదో వింతలాగుంది.మరుమల్లెల  దొంతరలాగుంది
నా ఎదవాకిలిట  నీ ఊహల కళ్ళాపి చల్లి
రంగవల్లిగా మెరిసే  గగనపు హరివిల్లై
సుమ గంధాలే తనువంతా విరబూసినట్లై
ప్రణయ చందనాన్ని నా మది పై చిలకరించినట్టు
నీలిమేఘాల ఝరిలో నిలువునా తడిపేసినట్టు
క్షణక్షణం ,అనుక్షణం  నాలో నీ స్మరణే ప్రవహించి
నాలో నీవే నివశించి ,అణువణువూ ఆవహించి
 నీ వలపుల ఒరవడిలో మరచితి నేనున్నానని
నిను వలచిన మొదలు
నేనున్నానో ! నీలో నెలవున్నానో !
తెలియని సందిగ్ధంలో సతమతమవుతున్నా
నన్నెరిగిన నీకయినా తెలుసా !........
                    నీ నెచ్చెలి నేనెక్కడో ....                                              సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

నేమాని

అభినందన పత్రిక


సుప్రసిద్ధ రసాయనిక శాస్త్రవేత్త ,ఉత్తమ అధ్యాపకులు అత్యుత్తమ పరిశోధకులు ,చిత్ర కళా కోవిదులు, శిల్పివరేణ్యులు అయిన ఆచార్య నేమాని కృష్ణ మూర్తి గారికి సహస్ర చంద్ర దర్శన మహోత్సవ సందర్భంగా కళావేదిక (నండూరి రామకృష్ణ ),విశాఖ రసజ్ఞ వేదిక (రఘు రామారావు ) మరియు వారి శిష్య బృందం వినమ్రతతో సమర్పించే అభినందన చందనం . 
1933 డిసెంబరు 12 వ తేదీన తనకు తన కుటుంబానికి సర్వం సిద్దింప చేసిన సర్వ సిద్ది రామవరం గ్రామంలో శ్రీమతి లక్ష్మీ నరసమ్మ ,  శ్రీ లక్ష్మీ నారాయణ దంపతుల 3 వ సంతానం గా జన్మించారు . శ్రీ నేమాని కృ శ్రీ నేమాని ష్ణమూర్తి గారు

ఖండాంతర యశో విశాలా !

రసాయనిక శాస్త్రంలోనాలుగు దశాబ్దాలుగా మీరు చేసిన అవిరాళ కృషికి నిదర్శనం మీ రచనలు. శిష్యగణమూను, లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా, న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫెలోగా, ఆస్త్రియన్లో లైసన్ బోర్డు మెంబరుగా ఉండడంతో పాటు ఆస్ట్రియా, ఇటలీ, ఇరాన్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్స్ ,అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, వివిధ వైజ్ఞానిక సదస్సులలో పరిశోధక పత్రాలు సమర్పించి దశదిశలా విశ్రాంత యశులై మీ శిష్య కోటికి మార్గదర్శకులయ్యారు . . 


పరిశోధక పరమేష్ఠీ !

ఆంధ్ర విశ్వకళా పరిషత్ రసాయనిక శాస్త్ర విభాగంలో పరిశోధనకు పట్టంగట్టి 40 మంది విద్యార్ధులకు పర్యవేక్షణ వహించిన పరిశోధక పరమేష్ఠి మీరు . పరిశోధనారంగంలో మీరు చూపిన సర్వతోముఖ ప్రతిభావ్యుత్పత్తులను సర్వ సంభావనీయాలుగా గుర్తించి మీ సిద్ధాంత వ్యాసానికి ఉత్తమ సిద్ధాంత వ్యాస పురస్కారాన్ని ,మీకు ఉత్తమ పరిశోధక పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది ..ఆంధ్ర విశ్వకళా పరిషత్తు. జాతీయ , అంతర్జాతీయ వైజ్ఞానిక సంచికల్లో మీ పరిశోధనా వ్యాస పరంపరలు తమ కీర్తిని వెదజల్లుతూ ఉన్నాయి . 1979 లో మీ రచన మెథడ్స్ ఇన్ ఎంజైమాలజీని న్యూయార్క్ లోని కార్నిల్ విశ్వవిద్యాలయం ప్రచురించడం ఆ పుస్తక ప్రామాణికతను చెప్పక చెప్తోంది. ఆకాశవాణి ద్వారా మీరు వినిపించిన వైజ్ఞానిక తరంగాలు ఆంధ్రుల అంతరంగాలను అలరించాయి . 







చిత్ర కళా కోవిదా !

వర్ణ మిశ్రమాలు రసాయినాల్లోనే  కాకుండా మీ ఎదలో కూడా చోటు చేసుకొని మీ చేతి కుంచె ద్వారా అపురూపచిత్రాలుగా ప్రాణం పోసుకున్నాయి ధన్వంతరి, చరుకుడు వంటి బిషగ్వరులు , వాల్మీకి, వ్యాసుడు , కాళిదాసాది కవికుల గురువులు . ఐన్ స్టీన్మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి శాస్త్రజ్ఞులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, కర్ణాటక సంగీత త్రిమూర్తులు, నన్నయాది తెలుగు కవులు జీవకళ ఉట్టిపడుతూ మీ చేతిలో రూపుదిద్దుకొన్నారు . నెహ్రూ  వంటి దేశనాయకులూ, శ్రీ కందుకూరి శివా నందమూర్తిగారి వంటి గురుమూర్తులు చిత్రాలు మీకు ఆయా వ్యక్తులఫై గల గౌరవానికి నిదర్శనాలు . ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తిక్కవరపు లక్ష్మీనారాయణ గారి సభలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఉపాధ్యక్షుల నిలువెత్తు చిత్రాలు . విశాఖపట్టణం కళా భారతిలో లో తెలుగు కవులు  నన్నయ్య, తిక్కన ఎఱ్ఱన, శ్రీనాధ పోతనలు, త్యాగయ్య ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల చిత్రాలు మన సాంస్కృతిక వారసత్వాలుగా నిలిచి ఉండటం ఒక ఎత్తు అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అతిధిగృహంలో  ఎనిమిది అడుగుల గురజాడ అప్పారావుగారి చిత్రపటం హైదరాబాద్ అసెంబ్లీహాలులో ఎనిమిది అడుగుల తెన్నేటి  విశ్వనాధం గారి చిత్రం, జపాన్ లో గాంధీ చిత్రపటం, అమెరికా లో త్యాగయ్య చిత్రపటం ఉండటం మరో ఎత్తు. గీతోపదేశం కురుసభలో పాంచాలి వంటి పౌరాణిక ప్రతిపత్తి గల మీ చిత్రాలు భావితరాలకు చిత్రకళలో మార్గదర్శకాలుగా నిలిచేవి.

శిల్పివరేణ్యా !

ప్రముఖ శిల్పి ఆదిరాజు సుబ్రహ్మణ్యం గారి శిష్యరికంలో మీరు నేర్చిన విద్య ఎంతగానో రాణింపు పొందింది. మీరు శిల్పీకరించిన గౌతమబుద్దుని శిల్పం ఆంధ్ర విశ్వకళాపరిషత్ గ్రంధాలయ ప్రవేశ ద్వార సమీపంలో దర్శనమిస్తూ 'ధర్మం శరణం గచ్చామి' అనే సూక్తిని విద్యార్థులకు జ్ఞప్తికి తెస్తూ ఉండడం ముదావహం.

వివిధ పురస్కార విజేతా!

కళా వైజ్ఞానిక రంగ ప్రతిభులైన మిమ్మల్ని ఎన్నో పురస్కారాలు వరించాయి. ఇంటా బయటా కూడా పెక్కు పురస్కారాలను గెలుచుకున్న ప్రజ్ఞామూర్తులు మీరు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమెరికా వారి మిలీనియా అవార్డును చేపట్టారు. ఉత్తమ పరిశోధక, ఉత్తమ అధ్యాపక, సియస్ఐఆర్ వారి ఎమరెటస్ సైంటిస్ట్ పురస్కారాలతో పాటు              శ్రీ సోమేశ్వర సాహితి, అడవిబాపిరాజు ట్రస్టువారి చిత్ర కళాపురస్కారాలు, న్యాయవాది శ్రీ శివరామదాసు గారి స్వర్ణ పతకం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ద్వారా స్వర్ణ పతకం, మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, మా టీవీ విశాఖ స్వభాను ఉగాది పురస్కారం, అఖిల భారత హస్త కళావేదిక ఢిల్లీవారి స్వర్ణ పతకం, ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్ ఢిల్లీ వారి భారతదేశపు ఉత్తమ పౌర సన్మానపతకం మీ కీర్తికిరీటపు ధగధగలలో కొన్ని మాత్రమే.




బహు దేశ నాయక సమ్మానిత శాస్త్రకళాభిజ్ఞా!

మీ అదృష్టం సాటిలేనిది. దేశనాయకులెందరో మిమ్మల్ని సన్మానించి ఆనందించారు. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఉపప్రధాని బాబుజగజ్జీవన్ రామ్., రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్, ఉపరాష్ట్రపతి శ్రీకృష్ణ కాంత్ , గవర్నర్ కుముద్బెన్ జోషి, శ్రీ  పీ.వీ.రంగయ్యనాయుడు, శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి, శ్రీ భీమసేన్ సచార్, జనరల్                    శ్రీ కె.వి. కృష్ణారావు, ప్రధాన న్యాయమూర్తులు శ్రీ ఆవుల సాంబశివరావు, శ్రీ పున్నయ్య, లోక్ సభ స్పీకర్ శ్రీ గంటి మోహనచంద్ర బాలయోగి ,ఇటీవల కాలంలో మాజీ ప్రధాని శ్రీ పి .వి .నరసింహరావు గారు మిమ్మల్ని సన్మానించిన మాన్యులు .

సువర్ణ కంకణ విభూషితా !

కళా వైజ్ఞానిక రంగాలలో అందె వేసిన మీ చేతికి సువర్ణ కంకణాలు ,సింహ తలాటాలు అలంకరించడంలో ఆశ్చర్య మేముంది . సువర్ణ రజత పతకాల సంఖ్యకు లెక్కేముంది .

అనురాగ అర్ధాంగ లక్ష్మీ సంపన్నా !

మీ శాస్త్ర రంగంలోనూ ,అంతరంగం లోనూ మిమ్మల్ని అనుసరించే ఇల్లాలు మీకు లభించడం అదృష్టాల్లోకెల్లా అదృష్టం . మీరు కృష్ణులయితే ఆమె రుక్మిణి కావడం దైవ నిర్ణయం. మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా గుర్తించి కళావేదిక సన్మానించడం అభినందనీయం. ఆచార్యులైన మీ ఇద్దరూ కలిసి "మానవ మనుగడలో రసాయన శాస్త్రం" అనే రచనను కూర్చడం అపూర్వం.

ఆచార్య సార్వభౌమా !

తన ఎద ఎల్లమెత్తన, శిష్యులన్న ఎడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన అన్నట్లు మీ శిష్య వాత్సల్యం ఎనలేనిది.         మీ పర్యవేక్షణలో శాస్త్రజ్ఞులుగా రూపొందిన మేం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం . మా ఎదలో మీ యెడల గల భక్తిని ఈ సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేడుకను జరిపించి ఛాత్ర గణ సంపూజితులు ,అంతే వాస్యుపాసితులు అయిన మీరు మాకీ అపూర్వ, అపురూప అవకాశం  ఇచ్చినందుకు కృతజ్ఞతా పూర్వక వందనాలు. శిష్య గణ భక్తి భూషణ భూషితులైన దంపతులు ఇరువురికీ  ఈనాడు సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేడుకలను నిర్వహించే భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తూ .. .. ..
                                           
                 మీ శిష్యకోటి,మరియు కళావేదిక (నండూరి రామకృష్ణ ),విశాఖ రసజ్ఞ వేదిక (రఘురామారావు )



18, ఆగస్టు 2015, మంగళవారం

ప్రణయమా అభివందనం....




ప్రేమంటే  గెలుపు 
ప్రేమంటే మలుపు 
ప్రేమంటే తియ  తీయని తలపు 
ప్రేమంటే వసివాడని వలపు 

ప్రేమంటే ఓదార్పు 
ప్రేమంటే మాయని మైమరపు 
ప్రేమంటే ఒక హాయి నిట్టూర్పు 
ప్రేమంటే జత హృదయాల పలకరింపు 
ప్రేమంటే ఒక తొలకరి పులకరింపు 
ప్రేమంటే అనురాగసుధల చిలకరింపు 
ప్రేమంటే నమ్మకమనే తెగింపు 
నిజమైన ప్రేమెప్పుడూ త్రిప్పదు మడమ 
ఓడిపోతే అది కేవలం మోహపు భ్రమ 
ఎప్పటికీ ప్రేమ మకరంధాన్నే చిందిస్తుంది 
కన్నీటిని చిమ్మిదంటే ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసిందనే 
స్వచ్చమైన ప్రేమ మనిషి మట్టి కలిసినా
మనస్సునంటే  పయనిస్తుంది ,
మరణమన్నది మనిషికేగా .. మనసుకెందుకు అంటుతుందది 
అందుకే ప్రణయమా ... నీకు  అభివందనం 

అందుకో .. .. ప్రతీ మది నీరాజనం . 
                                                                      సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                           pandoorucheruvugattu.blogspot.in

16, ఆగస్టు 2015, ఆదివారం

పద సౌందర్యం



లివేణి  ఆధరమ్ములు మకరంధపు ఝరులని తలచి  తుమ్మెద ఝుమ్మని గ్రోలబోయెనే 
oదువదన సౌదర్యం  మదనుడినీ మంత్రముగ్ధుని గావించగా 
విద పాదాల పారాణి శోభించ ప్రకృతి పరవశించి పోగా 
లతీగబోణి కూని రాగాలు  ఎలకోయిలకే మెలకువ తేగా 
లికి  కాటుక కన్నుల కాంతికి కలకంఠులందరికీ కనులు కుట్టగా 
చెలియ సిగ సోయగానికి మల్లియ అందం వెలవెల బోగా 
వ్వని జడపాయలు మెలికలు జలపాతపు ఒంపులతో  తలబడిపోయే
రుణీమణి నుదుట తిలకం అరుణారుణ కిరణంలా మెరుపులీనుతుంటే 
ధారణి  ధరహాసపు ధగధగ  జలతారును మరిపిస్తుంటే 
నెచ్చెలి నడకల వయ్యారము మయూరికే మతి,భ్రమిస్తే
డతి కులుకులు పంచదార గుళికల చవులూర  చిలుకలూ  కినుక వహిస్తే 
భామిని సౌందర్యాన్ని ఏమని వర్ణించాలని కవి కవనం కవ్విస్తుంటే 
ముదిత మోమును ముద్దాడిన ముంగురుల భాగ్యమే భాగ్యమో 
వ్వని  కరమున  జాలువారిన  రంగవల్లికి యోగమేమని చెప్పగలము . 
మణి తలపులు తడిమిచూసిన కలల రాతిరి ధన్యమే కద 
లన  తనువున నాట్యమాడిన చీరదే  జన్మవరమో 
విరిబోణి పాదాల పారాడె అందియల ఆనందమేలాగు వర్ణించగలము 
శోభనాంగిని అలంకరించిన సిరి  చందనాలదేమి పుణ్యము 
సురదన సుందర వదనం తాకిన మలయమారుతమ్ముదెంత సుకృతము 
oసయాన మిసమిసలు గాంచిన  అసలు సిసలైన జతగాని అదృష్టఫలమెంత లెక్కించ గలమా ...........
                                                          
                                                                               సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి 

15, ఆగస్టు 2015, శనివారం

స్వతంత్రతి భారతి



శతాబ్ధాలు చేరువవుతున్నా .... 
దశాబ్ధాలు దొర్లిపోతున్నా ... 
కాలగమనం పరుగులెడుతున్నా ... 
జన జీవనం గగన తలానికి పయనమవుతున్నా ... 
నేనెప్పటికీ 
భారతీయ గుండెల్లో గుభాళించు స్మృతినే 
అమర వీరుల త్యాగ నిరతికి నిత్య హారతినే 
బానిసాంధకారాన్ని చీల్చి ఉద్భవించిన  జ్యోతినే 
ఆసేతు హిమాచలం గర్వించే ఖ్యాతినే  
దిగ్ధిగంతాలా పరిమళించిన పసిడి సంస్కృతినే 
మరులుగొన్న రత్నగర్భ వాకిట మెరిసిన స్వాతంత్ర్య సంక్రాంతి ని నేనే 
నేనే స్వతంత్ర భారతిని ,నేనే స్వతంత్రతి భారతిని 
మన జాతి ప్రగతికి 
ఒకే ఒక్క నా వినతి 
అవినీతిని విడనాడు 
మరచిపోకు మంచీ చెడు 
ధర్మ నిరతికై పాటుపడు 
ఐక్యతతో ముందుకు నడు 
ఓటమన్నది లేదు చూడు 
ఈ తల్లి భారతి ఆశీస్సులు ఎన్నటికీ నీకు తోడు 
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో 
                           సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

16, జులై 2015, గురువారం

పొరపాటా ?ఏమరపాటా .. ?


గోదారమ్మ గుండె బరువయ్యింది
కన్నీళ్ళతో చేరి చెరువయ్యింది
కడుపుకోతతో  తో బావురుమంది  . 
కల్ప తరువంటి కన్నతల్లిఒళ్లో 
బిడ్డకి  భద్రత  కరువయ్యింది . 
పొరపాటో ,
గ్రహపాటో 
ఏమరపాటో,
ఏ దిష్టి చెరపాటో ,
వెన్నంటే ఉండాల్సిన అధికార యంత్రాంగం
 దిక్కులు చూస్తుందో ... 
కన్నులుండి గ్రుడ్డితనం ఆవరించిపోయిందో 
నిర్లక్ష్యం నిలువునా నిండు బ్రతుకులు బలి కోరిందో 
.కన్నీరు పెట్టి "కొంటే" ప్రాణం తిరిగొస్తుందా 
ముందే మేల్కొని ఉంటే ఏడ్చే పని మీకుందా ...?
(ఇకనైనా దయచేసి నిర్లక్ష్యం వీడండి . అమాయకుల ప్రాణాలు కాపాడండి  . )
                                                      అభ్యర్ధనతో ......                                  
                                              సాలిపల్లి మంగామణి @శ్రీమణి 






11, జులై 2015, శనివారం

నీటి చుక్క ... ...


           నీటి చుక్క ... ... 

అమృతధారను తెచ్చి అరచేత పోసినా
అరక్షణము మనగలమా  అర్ణమ్ము  లేక
సిరులెన్ని ఉన్ననూ జలసిరులు కాననిచో
ఉర్వీతలంబంత   రిత్తమే కాదా,  
భావి  నీటి వెతల  భరతవాక్యమ్ము  పాడగా
వృధా సేయక ఊరక  ప్రాణాధారమ్మును
అడుగంటి పోతున్న అంభువులనదిమిపట్టి 
వానచినుకును ఒద్దిగ్గా ఒడిసిపట్టి ,
భద్రమ్ము సేయరా ప్రతి నీటి చుక్కా ... ... 
                                                   
                                                     సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                                  
                                                         
                                                         

8, జులై 2015, బుధవారం

రాజన్నజయంతి సందర్భంగా ...వేవేల నీరాజనాలతో నా నివాళి


మరువగలమా మహాత్మా... 
మరులుగొన్న నాయకత్వ గరిమ . 
అభివర్ణించగ తరమా !
అత్యద్భుత నీ కర్తవ్య ధీక్షా పటిమ,
పులివెందుల సింహమా..
పుడమిన ఉదయించిన రాజసమా... 
నువు తనువు చాలించి అమరుడవైనా... 
నువ్వొదిలెల్లిలిన ఆశయాల సాధనలో... చిరంజీవివే సుమా...  
నువ్వులేని  శూన్యం మము నిలువునా కుదిపేసినా... 
నువ్విచ్చిన  స్ఫూర్తే, మా ఎడతెగని ధీమా.. 
మరువగలమా ... మహాత్మా 
 విడువగలమా ... నీ వాత్సల్యం,ప్రేమ 
కధన రంగ సింగంలా 
ఎడతెగనీ నీ తెగింపు 
మధనపడే బ్రతుకుల్లో 
ఆదుకొన్న నీ ఓదార్పు  
అడుగడుగున వేళ్ళూనిన 
అరాచకానికి  నువ్విచ్చిన ముగింపు 
అక్కా చెల్లెళ్ళంటూ  ... 
నీ అనురాగపు పలకరింపు 
నేనున్నది   మీ కొరకంటూ 
పాదయాత్రతో నీ పిలుపు 
ధరిత్రి  ఉన్నంత వరకు
చెరగని చరిత్ర నీ తలంపు 
మా కోసం జనియించి 
మాకోసమే జీవించి 
మాకోసం పరితపించి
అంతలోనే నిష్క్రమించి 
తెలుగు ప్రజల గుండెల్లో 
రాజేసినావు ఆరని నిప్పు 
ఏడేడు లోకాల నువ్వు ఏడునున్నా గాని 
నీ ఆశయాల స్మరణమే మాకు ఊరడింపు 
ఇడుపులపాయలో ఇమిడిపోయిన నీ పవిత్ర ఆత్మకు  
శాంతి చేకూరాలని ఆ దేవుని అభ్యర్థిస్తూ ...  
(రాజన్నజయంతి సందర్భంగా ...వేవేల  నీరాజనాలతో  నా నివాళి )
                                     సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

                                             
                                                    





7, జులై 2015, మంగళవారం

ఎంతటి నెరజాణవే .....?



ఓ చిన్ని హృదయమా ... 
నీకెన్ని ఊహలే .... 
ఎన్నెన్ని ఊసులే ,
ఎంతటి నెరజాణ వే 
ఎంతెంత మాయలాడివే 
మైమరపున జాబిలితో విహరిస్తావు . 
నీలిమబ్బు నీడలపై నిదురిస్తావు . 
ఆకసాన హరివిల్లుపై అలిగి కూర్చుంటావు . 
తారల నడుమన చేరి తళుకును నేనంటావు . 

                                          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 



















                                       

6, జులై 2015, సోమవారం

ఎన్నాళ్ళిలా ....?



ఎన్నాళ్ళిలా .. 
 పావలా బతుకులో  ముప్పావలా వెతలు 
 పట్టెడు   మెతుకులకై పుట్టెడు అగచాట్లు . 
 కంట కన్నీళ్లు ,ఇంట గంజి నీళ్ళు .  
 భూమి పుత్రుల ఆత్మార్పణలు ,
 ఎన్నాళ్ళిలా 
 మంచం లేచిన మొదలు లంచపు లాంచనాలు . 
 గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలుతూ 
 మరమ్మత్తు చేయలేని మరబొమ్మ గా మారుతున్న వైనాలు
 కుప్పతొట్టికి బహూకరించిన పసిమొగ్గల  ఆక్రందనలు 
  చీత్కారంతో అమ్మల కు నడిరోడ్డు సత్కారాలు 
  ఎన్నాళ్ళిలా .. 
 అడుగడుగునా అబలలపై  అకృత్యాలు 
  అడ్డుకట్టలేని అవినీతి మురికి కూపాలు . 
  మసక బారిపోతున్న మానవత్వపు  ఆనవాళ్ళు . 
 మర జీవనాలు,అనురాగ రహిత జీవశ్చవాలు 
 నల్లధనం మూటలు ,కోటలు దాటిన మాటలు 
 ఎన్నుకొన్న నాయకుల వెన్నుపోట్లు ,పన్నుపోట్లు 
 అడుగడుగునా  విద్య విక్రయశాలలు . 
 పైసా లేక ఆసుపత్రుల్లో అసువులు బాసిన అభాగ్యులు 
 ప్రభుత్వంలో భుక్తాలు ,
 పాలనా యంత్రాంగంలో మంత్రాంగాలు 
  దొంగోడే దొరలా ..   నిలువు దోపిడీ విధానాలు . 
 నీరసించిన ధర్మపాదం . 
 పెచ్చుమీరిన  అధర్మ వాదం . 
 ఎన్నాళ్ళిలా ... 
 రాదంటారా కలలు గన్న సమాజం . 
 లేదంటారా .. సుభిక్షమయిన  జనజీవనం 
 అర్ధ రహితమంటూ  .... వృధా యత్నమంటూ 
ఈ వ్యవస్థ ఇంతేనని తమ  మట్టుకు తలపట్టుకు కూచోక 
మీ నుండే మొదలెడితే  .. మార్పు అనే మరమ్మత్తు.  
మన  వంతుగ కృషి చేస్తే  ..మాన్యమగు  వ్యవస్థ తధ్యం 
 ప్రతీ నీవు స్పందిస్తే ప్రపంచమే మారదా ... 
 పట్టు వీడక ప్రయత్నిస్తే పసిడి పండదా బీడు భూమిలో .... 
 ప్రయత్నిద్దాం ... ప్రయత్నిస్తూనే ఉందాం . 


                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                      http://pandoorucheruvugattu.blogspot.in