పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, ఏప్రిల్ 2014, సోమవారం

ఉగాది పురస్కారం

తేది. 20.4.2014 న మానస సాహిత్య సాంస్క్రతిక అకాడమీ విజయవాడ వారి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో భాగంగా "ఉగాది పురస్కారం
"(కవితల విభాగంలో) అందుకుంటున్న శ్రీమణి @ శ్రీమతి సాలిపల్లి మంగామణి  ఈ శుభ సందర్బముగా తీసిన చిత్రములు


14, ఏప్రిల్ 2014, సోమవారం

చెబుతారా!ఎవరైనా


 
మల్లె  మనసు పారేసుకుంది పున్నమి   రాతిరిపై 

నిలువునా  తడిసి ముద్దయింది కలువ కన్య.  నెలరాజు వెన్నెల జడిలో
మిస మిసలాడుతుంది కుసుమం మధుపం  రాక  చూసి
కొత్త  పరదా  తొడిగింది   చిరుగాలి  చిట్టి చిలుకకులుకునుగని
గోరింటాకు పెట్టుకొంది  ఆ గగనం పృకృతిని  పరవశింపచేయాలని        

కొత్త నాట్యం నేర్చుతోంది ఆ  మయూరం  వయ్యారంగా మెరిసే  మేఘాన్ని చూసి 
గమ్మత్తుగా పాడుతోంది  గండుకోయిలమ్మ వాసంతపు పరిమళాన్ని  పసిగట్టి 
 సెలయేరు నయగారాలు పోతుంది కోనలమ్మ వైపు  కొంటెగ చూస్తూ 
మిన్నంటిన  సంబరంతో  అడుగుతోంది  తరుణి  తన్మయంతో  తన  పరువాన్ని 
కొత్త కొత్త  ఊహలు , క్రొంగొత్త కలలు , తీయ తీయని  అనుభూతులు 
అలవాటు లేని నిట్టూర్పులు , మైమరపులు , తుళ్ళింతలు 
ఈవేళలో  ఇలా  ఉక్కిరిబిక్కిరి  చేస్తున్నాయెందుకని 
ప్రకృతిలో  ప్రతి  సౌందర్యం  తనతో  తలబడుతున్నాయెందుకని 
గుండె చప్పుడు  గతి తప్పుతోంది  ఎందుకలా 
కంటికేమో  కునుకే  రానంది ఆకలి ఆమడదూరంగా ఉంటుంది   నిజంగా 
ఏమైంది  నాకీవేళ  ఎందుకంటా  ఈ ఆనంద హేల 
ఎవరైనా చెబుతారా !ఏమైందో  నాకీవేళా 
  
                                           సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 







13, ఏప్రిల్ 2014, ఆదివారం

తనువంతా కనులై


ఏమని  ఏమార్చను  కృష్ణయ్యా !  నీకై వేచిన నా కన్నులను 
ఎంతని ఊరడించను  కన్నయ్యా !నిన్నే వలచిన నా మదిని
జగడాలెందుకు ప్రియా !నాపైనీ  జవరాలను  నే కానా !
గిల్లికజ్జాలెందుకు కన్నయ్యా !పంతం  మానుకో  కొంతైనా !
ఎంతైనా నే నీ ప్రియ సఖినేగా !నువు మెచ్చిన నీ  నెచ్చెలి నేనేగా
నేరమేమి  చేశాను  నిన్ను చేరనీవు  నన్ను
ఆకలి మరిచా నీతో గడిపిన మధుర స్మృతులు నెమరు వేసుకొంటూ
దాహమూ  మరచిపోయా !నీ  ప్రణయామృత  ధారలు  సేవిస్తూ
నిద్దురెలాగూ  కరువైంది కన్నులకు
,మన  సాంగత్యపు  మధుర  ఘడియలె మదిని మదిస్తుంటే
నన్ను  నేనే మరచిపోయా! నాలో కొలువై  వున్న  నిన్నే ఆరాదిస్తూ
నీకై  తపిస్తూ  నిరతం నీ నామమే  జపిస్తూ నీ  రాకకై  పరితపిస్తూ
తనువంతా  కనులుగా  వేచియున్నా  నీకై , వేగిరంగా రమ్మంటూ
చిన్నికృష్ణా  నిన్ను  వేడుకొందు
                   
                             సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి
                                         

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

ప్రణయ గీతిక

   
                                 
ఎద నందనవనములో  వీచిన  సుమ సుగంధ  వీచిక
హృది  స్పందన  శృతి  లయగా  ఆలపించె  మృధు గీతిక
మది  సాంతం  మైమరచే  వింత  విషయ సూచిక
మనసంతా విరబూసిన మధురోహల  మధూలిక
అదే  ప్రణయ  గీతిక.   జంట హృదయాల  పెనవేసిన అనురాగ  మాలిక
విరబూసిన ప్రాయంలో అరవిరిసిన మరు మల్లిక
విహంగమై  విహరించే  వీనుల  విందైన  వేడుక
కలల మాటునా!  కనురెప్ప చాటునా !
కన్ను గీటుతూ పలకరించిన  పులకరింతల  ఆనంద  డోలిక
అదే ప్రణయ గీతిక . జంట హృదయాల పెనవేసిన  అనురాగ  మాలిక
పట్ట పగలే  పండువెన్నెల పడచు  వాకిట   పరచుకొన్న  పరువపు  చిరు కోరిక
ప్రతి  హృదయం పరవశించి, పాడే పాటకు పల్లవిగా
ఒకరికి ఒకరై  నివశించి , ఒకరిలో ఒకరై  ప్రవహించే జంట పరువాల అల్లిక
 నిండు   నూరేళ్ళు  పయనానికి,  ఏడేడు  జన్మల ప్రాతిపదిక
అదే ప్రణయ గీతిక ,జంట హృదయాల  పెనవేసిన అనురాగ మాలిక

                                                     సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

9, ఏప్రిల్ 2014, బుధవారం

నీ ధ్యాశలో



మొగలిరేకుల కొనల నుండి జాలువారిన నీటిబొట్టు నడిగా...
నీ గుట్టు తెలుసాయని
వాసంతపు పరవశాన మైమరచి పాడుతున్న ఎలకోయిల నడిగా...
నా తలపుల రేడు నీకెరుకాయని
రయ్ రయ్   మేనుకు హాయిగ తాకిన పిల్లగాలి నడిగా...
పిల్లవాణ్ణి పిలుచుకు రమ్మని
పచ్చని చిగురుమావి కొమ్మమీద  చిన్ని చిలక నడిగా...
నా చెలికాని జాడేదని
నిండు పున్నమి  పండువెన్నెలలో
చంద్రుని చూసి పులకించిన నీటికలువ నడిగా...
                                                                                        నా సెందురుని నీవెరుగుదువా యని                                                                విరితేనియ గ్రోలుచున్నమధులిహమ్ము నడిగా...
నా మది దోచిన సఖుడేడని
కొమ్మ నడిగా, పూరెమ్మ నడిగా
మలయమారుతమ్ము నడిగా
కొండ నడిగా, కోన నడిగా, వాగు నడిగా, వంక నడిగా ...
నా వన్నెల రేడు దాగున్న చోటేదని
 నువ్వేడ దాగినా,దోబూచులాడినా...
నా కనురెప్పల మాటున్నది నీ రూపు కాదా
నా అధరాలు పలికేది నీ నామమే కదా
నా మది ఊయలలూగేది నీ తలపుల పానుపుపై కాదా !
సప్తసంద్రాల ఆవల నీవున్నా...
నే సప్తపదులు నడిచేది నీతోటే కాదా!

సాలిపల్లి మంగా మణి  @ శ్రీమణి