పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, జులై 2016, ఆదివారం

ఆ తరుణం....!


మధురం గాదా ఆ తరుణం,ఎదురయి రాదా పున్నమి కిరణం.
అలవోకగా  నా హృదయం నీ చరణాల తాకినప్పుడు,
మకరందపు నా  అధరాలు  నీ ప్రణయ సుధా ఝరిలో జలకమ్ములాడినపుడు
నా అందెల రవళి, నీ మోహన మురళితో సయ్యాటలాడినప్పుడు
నా నీలి  నీలి కురులలో నీ చరములు విరులల్లినప్పుడు
నులు వెచ్చని నీ ఒడిలో పారాడే పాపాయిగ నే ఒదిగిపోయినప్పుడు
నా కులుకు,నీ తళుకు తన్మయమై నటనమాడినప్పుడు
కలవరమాయిన నా మదిలో నీ "కల"వరమై కనువిందు చేసినప్పుడు
నా మానస రాగంలో నీ సమ్మోహన సరాగాలు వినిపించినప్పుడు
నా చెంపల్లో విరబూసిన కెంపులు నీవైనప్పుడు,
తారక ముందర తారసపడ్డ వెన్నెలచంద్రుడు నీవైనప్పుడు
మేనక మెరుపుకి తడబడిపోయిన ఋషీన్ద్రుడు  నీవైనప్పుడు,
నా వలపుల జడిలో తొలకరి తునకవు  నీవై ఎదురొచ్చినప్పుడు,
అద్భుతమయిన ఆ అమృత తరుణం, మరణాన్నైనా మరిపించదా మరు క్షణం
వేణు మాధవా... వలచిన నీ సఖి మనసు, మల్లెలు విరిసిన పూదోటై
మదన గోపాలా ... పరిచా నా మదినే పరువపు పానుపుగా ...
కినుక సేయక చక చకరావా ,,,,చిలుకల కొలికికి కానుకకాగా
                                                                 సాలిపల్లి మంగా మణి@శ్రీమణి


14, జులై 2016, గురువారం

పడిపోయా... పడిపోయా...


నీ రూపుకు పడిపోయా... 
నీ కొంటె చూపుకి పడిపోయా..... 
నీ నీలి ఛాయకు పడిపోయా... 
నీ మురళికి పడిపోయా .. 
నీ పలుకుల రవళికి పడిపోయా... 
మోహనకృష్ణా!నీ మురిపాల లోగిలిలో 
ముద్దు మురిపాల కౌగిలిలో... 
నేనంటూ ,నాకంటూ, లేకుండా పడిపోయా 
పడిపోయా... నీ ప్రణయపు జడిలో .. 
తొలి చూపులోనే మైమరపులహాయిలో,
చెలికాడా ...  నీ  వలపుల వలలో  పడిపోయా... 
మైమరచిపోయా... మదిని వదిలేసిపోయా  ...   
మకరందంలో... 
నీ వలపుల సుమగంధంలో...  ముద్దయిపోయా 
నులు సిగ్గుల మొగ్గై పోయా .
నీ తలపే నా  ఎదలో  గుభాళించగానే , 
 అల్లిబిల్లి నా పరువం నీతో  పల్లవించగానే 
అలవోకగా నీ పిలుపే పలకరించగానే, 
నీ కలయిక నడిరేయిలో కల రాగానే 
 నీ అడుగుల సడి,నా అలజడిని  ఊరడించగానే ,
వింత వింత అనుభూతులు చెంతచేరగానే 
నీ వలపే కవ్వింపై,మేను తాకగానే  
మదనా .. నా  మది మధనా 
ప్రియ వదనా,, ,ప్రణయసుధారాధనా.... 
పడిపోయా... పడిపోయా నీ ప్రణయపు జడిలో 
మైమరపుల జడిలో,నులు వెచ్చని నీ ఒడిలో ......
ఈ గుప్పెడు గుండె సప్పుడు ఎప్పుడు నీ కోసమే,
తిప్పలు పెట్టక  ,చప్పున రావా కృష్ణా!
                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి 







.. 

13, జులై 2016, బుధవారం

తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను,


ఉత్తుంగ గంగా తరంగ గోదారి గంగ సోయగం  చూడంగ, 
రాజసమ్మొలికేటి రాజ మాహేంద్రి కీర్తి అతిశయించంగ ,
పుత్తడి అక్షరాల లిఖియించినా...సంపూర్ణమగునా ,నను గన్న గోదారి సౌందర్యమభివర్ణించంగ ,,అలలే మెరియంగ , గలగలలే గగనానికి వినిపించగ,చెంగు చెంగున  దూకె నిండు గోదారి గంగ. 
నిత్య కల్యాణి సిరులు మనకు గుమ్మరించంగా ,
ఆ సంభ్రమము కాంచంగ ,మది  వేయి అక్షువుల కోరంగ ,నింగి ,నేలను కూడి నాట్యమాడంగా , నెలవంక విభ్రమయై వీక్షించె విమల గోదారిగంగ, తల్లి గోదారమ్మ పాదాలు తాకంగ ప్రణమిల్లుతూ పారాణి దిద్దంగా సూరీడు సుతారంగా,అంభరమే మురిసేను,ముద్దాడ జూసేను, ముదిత గోదారిని సంభరంగా ,కోటి పుణ్యాల ఫలమెమో గోదారి నట్టింట నడయాడ,నా జన్మ సుకృతంబే గాద,కల్పతరువు,కామధేనువు కలగలిపిన గోదారి గంగ, కొలిచిన వారికి కొంగుబంగారు తల్లిగా,పిలిచినోడికి నిత్య సౌభాగ్యమొసఁగంగ,అమ్మ గోదారి కౌగిట ఒదిగిపోవాలని,కొంగు పట్టుకు గారాలు ఒలకబోయాలని,చిలుక పలుకులతోటి కవితలల్లాలని,చిన్ని ఆశ నాకు తూరుపు గోదారమ్మ నుదుటున తిలకమద్దాలని,తూరుపు గోదారమ్మ బిడ్డన్నేనంటూ ధిగ్దిగంతాలకూ చాటి చెప్పాలని,ఏనాటికైనా తల్లి గుండెల్లోనే కన్ను మూయాలని,చిన్ని ఆశ నాకు,గోదారి గంగమ్మ అందియగా అమరిపోవాలని,
                                               సాలిపల్లిమంగామణి@శ్రీమణి 
                   https://pandoorucheruvugattu.blogspot.com

12, జులై 2016, మంగళవారం

కడు బీదను కాను నేను,




కడు బీదను కాను నేను, కాసులు లేనంత మాత్రాన
నిరుపేదను అసలే కాను,ఎడతెగని సంపదలో మునిగి తేలుతుంటాను ,అనాథను అంటే అస్సలొప్పుకోను
ఆకాశం,నేల బాగా ఆత్మీయులు నాకు
జగమంతా కుటుంబం నాది,ప్రకృతిలో ప్రతీ అడుగూ నాదే
ఆదిదంపతులే అమ్మా నాన్నా నాకయినప్పుడు
పంచభూతాలు 
నా తోబుట్టువులే,మూడులోకాలూ మా చుట్టాలూళ్లే
అన్నీనావే,అంతా నాదే,కాపాడుకోవాలేగాని,తరగని నిక్కమయిన సంపద నాదే
ఊసులాడాలే గాని ఊరూ,వాడా నా వాళ్లే
ఆయువు నిలిపే వాయువు నాకుంది,తరతరాలకూ సరిపడా... ఆస్తి అది 
సూరీడు నావాడు,కొసరి,కొసరి కాంతిని వడ్డిస్తాడు.కోరినంతా .. కొదవలేకుండా 
నెలరేడు నా చెలికాడు,జలతారు వెన్నియల చందనాలు నాపై ప్రేమగా గుమ్మరిస్తాడు
 సెలయేరు,తల నిమిరి నీరిచ్చి ఊరడిస్తే, తరువమ్మ నీడిచ్చి ,ఫలమిచ్చి, పొట్ట నిమిరింది
పరవశించి ఆడమని నెమలి పిలిచింది
పాటలాలకించడానికి ఆమని రాగం ఉండనే ఉంది 
సయ్యాటలాడమని సంద్రం కబురెట్టింది 
పూ బంతులు,చామంతులు,సన్నజాజులు,సంపెంగలు,కధలు చెపుతుంటే 
అరవిరిసిన గులాబీలు,మరువము,మల్లియలపరిమళాలు వెదజల్లి జోల పాడుతుంటే 
పసిడి స్వప్నాలు నన్ను వాటేసుకొని నిద్రపుచ్చుతుంటాయి
మళ్లీ మా సూరీడు నులివెచ్చగా తాకి మేలుకొలుపుతాడు 
నిజమే.. కదా... మనకున్న ప్రకృతే మన నిజమయిన  సంపద,కదా 
!ఆలోచించండి
మనకు  కన్నతల్లి  తన రక్త మాంసాలు పంచి,జవసత్వాలిచ్చింది
సృష్టిలో ఏ జీవరాశులకు లేని  "ఆలోచన" అనే.అమూల్యమయిన ఆస్తినిచ్చింది తెలివితేటలిచ్చింది.  అంతటి మూలధనం మనకుంటే 
అనంత సౌభాగ్యం మన సొంతమే
 సృష్టే  అన్నీ అమర్చి నీకిచ్చినప్పుడు,ఎవరైనా బీదలుంటారా
 ప్రకృతిలో పంచభూతాలే  వాత్సల్యం కురిపించినప్పుడు ,అనాధలుంటారా 

     
                                                                     సాలిపల్లిమంగామణి@శ్రీమణి                          


11, జులై 2016, సోమవారం

నవ్వంటే తెలుసా ...?


ప్రేమే కొరవడితే,
ఆనందం ఆవిరయితే ,
ఆదరణ అందని వరమయితే ,
మనసు చితికి,చితికి,చితికి చేరువయితే,
పగిలిన గుండెకు అతుకులు వేస్తూ ..
పెను భారంగా బ్రతుకీడిస్తే ...
నమ్ముకొన్న బంధాలకై బందీ అవుతూ...
బ్రతుకు భారమై,నిర్వికారమై,
కాలయముడికి కబురు పంపినా ...
కాలయాపన చేస్తున్నాడంటూ ,ఎంతకాలం ఈ గుండెకు ఎండాకాలం
 వాసంతం వాసన గూడా తెలియక వాపోతూ .. 
కన్నుల జారిన కన్నీటికి సెలయేరు పోటీ పడుతుంటే 
ఎంతకాలం ఎండమావికై పరుగులిడిన ఎటకారపు పయనంలో 
 జీవన్మరణ ప్రళయంలో చిక్కుకొని తల్లడిల్లుతున్న
 ఒక దయనీయ హృదయం
బలవంతంగా నవ్వితేఎలా ఉంటుందో తెలుసా !
విగతజీవికి వింత చొక్కా ... తొడిగినట్టు,
నిప్పుకణికకు ,కొత్తచివుళ్లు తొడిగినట్టు ..
అమావాస్య కంటికి కాటుక  పూసినట్టు ,
ఎన్నో హృదయాల పరిస్థితి ఇది.
నిజం మాత్రమే చెప్పండి,ఈ మరజీవన గమనంలో 
ఎంత మంది మనస్పూర్తిగా నవ్వుతున్నారు. 
ఎంతమంది నిజమైన ఆనందం అనుభవిస్త్తున్నారు. 
నా ఉద్దేశ్య ప్రకారం  ,అచ్చమయిన నవ్వు,సంతోషం,ఏ  కొద్ది మందికో
ఆ భగవంతుని వరం. కదా ... 
నవ్వంటే తెలుసా ...? బలవంతపు కల్పన కాదు ,
 వెల్లి విరిసిన మనస్సంద్రపు అల.
నవ్వు అంటే పకపకలు  కాదు.
పరవశించి హృదయం పాడిన పదనిసలు,
ఆ స్వచ్ఛమయిన నవ్వుకోసం... వెతుక్కొందాం
స్వేచ్ఛగా నవ్వుకొందాం  ...
అలాంటి  నవ్వు, నాలుగు విధాలా చేటు కాదు,
కోటి వెన్నియలు వెల్లి విరిసిన చోటు.
(నేటి ఉరుకుల,పరుగుల యాంత్రిక జీవనంలో,అమూల్యమయిన అనుభూతులెన్నో కోల్పోతున్నాం.కొంతకాలానికి నవ్వడం కూడా మరచిపోతామేమో?ఆలోచించండి.)

                                                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి



9, జులై 2016, శనివారం

" భార్య"పాత్ర...అమృత పాత్ర.



" భార్య" స్త్రీ జీవితంలో  అతి మధురమైన పాత్ర,
ఆస్వాదించ గలిగితే అది , అత్యద్భుత అమృత పాత్ర.
కార్యేషు దాసీ,కరణేషు మంత్రీ,రూపేచ లక్ష్మీ,క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా... శయనేషు రంభా.. షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ..
 అంటూ స్త్రీ మూర్తిని ఎంత ఉన్నతంగా అభివర్ణించారో...  పెద్దలు 
భార్య అంటే కపటమెరుగక ఎల్లప్పుడూ తనని చేపట్టిన భర్తపైనే 
అచంచల విశ్వాసంతో,దైవంతో సమానంగా పూజిస్తూ,గౌరవిస్తూ ,
అనుక్షణం ఆతడి క్షేమం ఆకాంక్షిస్తూ ... ఆతని ప్రేమకై పరితపించేదే. 
అలాంటి భార్య ,భర్తకు భాద్యత కావాలే గాని బరువని భావించకూడదు. 
పెళ్లి బంధం కానీ బానిసత్వం కాకూడదు. 
భార్య అంటే అర్ధం ... త్యాగం, ఎవరు కాదన్నా... అవునన్నా వాస్తవం 
 మూడు ముళ్ళు పడగానే,నవమాసాలుకన్నప్రేగు బంధాన్ని,వదులుకొని 
ఆడపిల్ల అమాంతం  ఆడ,పిల్లగా మారితే అది త్యాగమేకదా ..... 
పదునెనిమిది వత్సరాల కన్నవారి వాత్సల్యం,ఏడడుగులతో భర్త వశమయ్యిదంటే,
పెళ్లి పేరుతో తుళ్ళి ఆడిన తన చిన్ననాటి ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచంలో ఇమిడిపోవడమంటే  ,త్యాగమే కదా .  
భార్య అంటే... నిజానికి పురాణాల్లో పేర్కొన్నట్టుగా అయితే భార్యలు రెండు విధాలు. 
ఏక చారిణీ,సపత్నిక 
భర్త హృదయ సామ్రాజ్యాన్ని ఏక చత్రాధిపత్యంగా 
మరో స్త్రీకి స్థానం లేకుండా అనుభవించే భార్య ఏకచారిణీ ,
ఒక పురుషుడికి బహుభార్యలు ఉంటే వారిలో ప్రతి భార్య,వేరొకరికి సపత్నిక అవుతుంది. 
కానీ ఇప్పటి మన వ్యవస్థలో,బహు భార్యత్వం,ఫ్యాషన్ గా మారుతున్న తరుణంలో 
ఏకచారిణీ అదృష్టం ఎంతమంది భార్యలకు దక్కుతుందో.. మరి 
భర్త భార్యకు భరోసా కావాలి గాని అర్ధంగాని ప్రశ్న గా మిగిలిపోతే ... ఎలా ?
మొత్తం భర్తలనే తప్పు అని అనను గానీ ,నిన్ను నమ్మి వచ్చిన భార్యకు
నీకు సాధ్యమైనంత వరకూ ప్రేమను పంచి చూడు .
 మీ ప్రపంచమీ సర్వాంగ సుందరంగా మారిపోతుంది. 
భార్యాభర్తల అనుబంధం ప్రేమ,నమ్మకాల పునాదితో నిర్మిస్తే ,
నిండు జీవితం నిత్య కళ్యాణమే ... ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ సంసారం సాగిస్తే 
విడాకులెందుకు,అనుమానాలెందుకు,తీర్పులెందుకూ .. తీర్మానాలెందుకు  
బ్రతుకు జట్కాబళ్లెందుకు,రచ్చబండలెందుకు,
ఒక్క తాటిపై ఇరువురూ నిలబడితే 
సంసారమెపుడూ చదరంగం గాదే .. చక్కని అనుబంధమేగా ... 
(ఇది నా ఉద్దేశ్యం మాత్రమే,భర్తలపై విమర్శకాదు,నాతో ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. ) 
                                                                              సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 








7, జులై 2016, గురువారం

నెల వంక సాక్షిగా......



మహమ్మదీయ సోదరులకూ,సోదరీమణులకు
 చిరు కవితా సుమాలతోశుభాకాంక్షల మాలిక 
నెల వంక సాక్షిగా,నెల రోజుల ఉపవాస ధీక్షగా సాగిన మీ భక్తికి 
మహిమాన్విత పవిత్ర ఖురాన్ అక్షరాలా రక్షగా .... పొందిన మీ శక్తికి 
ప్రేమకు ,శాంతికి,ఆలవాలమయిన మీ ఖ్యాతికి 
సహనానికి,క్షమకు ,మానవత్వ మాన్యతగా సాగిన మీ  లక్ష్యానికి  
దానం,దయాగుణాలకు దర్పణమై వెలిగిన మీ స్ఫూర్తికి 
సత్యతకు,సఖ్యతకు,సత్ప్రవర్తనా విధేయతకు కట్టుబడిన మీ ధర్మనిరతికి 
మానవసేవయే,దైవ సేవయని నమ్మి,
సాటి మనుజునిలో భగవంతుని 
గాంచిన మీ మానవత్వ జ్యోతికి,  
రంజాన్ పర్వదినాన  మా శిరస్సు వంచి నమస్కరిస్తూ .. 
వేవేల శుభాకాంక్షాభివందనాలు మహమ్మదీయ సహోదరులారా ... 
                                                 సాలిపల్లిమంగామణి@ శ్రీమణి 

6, జులై 2016, బుధవారం

నిన్నే చూస్తున్నా...


తూరుపు వేకువలో, కువకువ రాగంలో 
చిట్టి చినుకుల్ల జడిలో, చిగురాకు అలజడిలో
నడి రేతిరి వెన్నియలో, జాబిలి  నయగారపు హొయలో  
సంధ్యారావంలో,వింధ్యామరరాగంలో ..  
ఆనీలి మేఘంలో ,ఆ గగనపు హరివిల్లు వంపులో  నిన్నే చూస్తున్నా... 
ప్రతి సవ్వడిలో.. . ఆ ప్రకృతి ఒడిలో  ,నిన్నే చూస్తున్నా ...  
మరువపు సిరిలో ,మరు మల్లెల ఝరిలో,ఎగిసే ప్రణయపు  ఒరవడిలో 
పున్నమి వెన్నెల తాకిడిలో,సెలయేటి సందడిలో,ఆ సంద్రపు అలజడిలో 
చూస్తేనే ఉన్నా ... నువ్వొస్తావనీ ,
కలగంటూనే ఉన్నా... 
కనురెప్పల మాటునయినా ఉదయిస్తావని,
వింటూనే ఉన్నా ... నా గుప్పెడు గుండెలో 
నీ గుండె సప్పుడు. 
నిను వలచి,మైమరచి,నిన్నే తలచిన ఎదనే 
ఏమార్చలేకున్నా ... అనుక్షణం నీ ఊహలే 
విరి తేనియ జల్లులై, ఆ మదనుని విల్లులై 
కలవరపెడుతుంటే !ఘడియాగలేక 
నీ ఊహైనా రాక,తికమక పడుతున్నా...ప్రియసఖా 
కల కూడా రానంటే  నువు లేకుండా ... ఊపిరాగిపోదా... మరి 
విలవిలలాడిందే నా చిట్టి గుండే ... నిన్నే చూడాలని,
           (ఆ మాధవునికై రాధిక ప్రణయామృతం )


                                        సాలిపల్లి మంగామణి@శ్రీమణి


5, జులై 2016, మంగళవారం

అమర జీవీ .... అభివందనాలు మీకు.



 తెలుగు జాతి  వీరుడా ... తెల్లోడి గుండెల్లో చెళ్ళని ఝుళిపించిన కొరడా 
 మన్యపు మహా నాయకుడా ... మహోజ్వల విప్లవ మగధీరుడా .
ప్రచండ నిప్పుల సూరీడా... భరత జాతి  మెచ్చిన అసామాన్య  వీరుడా..  
మహోన్నత స్వాతంత్ర్య  ధీరుడా ... మరువలేని మన్నెపు మహనీయుడా 
మరువలేదు మేము , మిన్నంటిన మీ త్యాగనిరతి 
చెరిగిపోలేదు, మాలో  నువు చిందించిన రుధిర సంతకం 
కాలం కరుగుతు ఉన్నా... 
రోజులు దొరలిపోతున్నా ... ఓ దొరా ..  
నువ్వుమాకొసాగిన  అమృత స్వాతంత్ర్య ఫలం అక్షయమై అలరారుతుంది  
మా గుండెల్లో కొలువున్న  మారాజా ..
కదలాడుతునే ఉంది . నువ్వొదిలెళ్ళిన స్థైర్యం 
ఓ మహర్షీ ... మహా  చైతన్య స్ఫూర్తీ 
ఓ ... మానవత్వమూర్తీ .. మహోన్నత మన్యపు చక్రవర్తీ,
ఆచంద్రతారార్కం నీకు భరతజాతి వందనం 
నిన్నటి నీ త్యాగానికి నిరతం నీరాజనాల అభివందనం 
తెల్ల కుక్కల నిప్పుల తూటాల వేటలో... వందేమాతరమంటూ  నేల రాలినా 
వేల వందల తరాలైనా గాని వందనాలు మీకు. వందవందనాలు మీకు,
     
అభివందనాలు మీకు.                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి 
 


 

1, జులై 2016, శుక్రవారం

తుమ్మెదా ... ఓ తుమ్మెదా ..


తుమ్మెదా ... ఓ తుమ్మెదా ..
ఏడాదాగున్నావే తుమ్మెదా ... ఎద గిల్లి పోయావే తుమ్మెదా ...
హాయి,హాయిగ నువ్వు ఎగిరిపోయావు
తీయ,తీయని మధువును దోచేసినావు
మురిపించి ముచ్చట్ల ఊసులాడావు
అర ఘడియలో చూస్తే తుమ్మెదా ... . అస్సలు కానరావె తుమ్మెదా ..
మేఘాలు చాటుకు పరుగులు తీసావా ... తరుల పరదాల మాటున ఒదిగిపోయావా
చారెడేసి కళ్ళు తుమ్మెదా ... కాయల్లు గాసాయే తుమ్మెద
ఏడు మల్లెల మేను తుమ్మెదా ... అలసి సొలసినే తుమ్మెద
మెరిసే  పూబాలను నన్నే ... నీ వన్నెలతో మురిపించినావు
మైమరపు వెల్లువల వల్లో ... నిలువెల్లా ముంచేసినావే
ఆటలన్నావు ,పాటలన్నావు,మాటల్లో మదనుడి  తలనేదన్నావు 
మాయ మాటలతోటి తుమ్మెదా  ... మనసెత్తు కెళ్ళావే   తుమ్మెదా
తుంటరోడివి నువ్వు తుమ్మెదా .. ఒంటరి చేసి  జారుకొన్నావా ...
దిక్కుల మాటున నక్కి సక్కగున్నావో  ... గగనపు చుక్కల సందిట చిక్కావో ...
ఏ పూవుల ప్రక్కన చేరి సరసాలాడేవో   ... ఈ పూబాలనెట్టా ... ఆదమరిచావో ...
                              సాలిపల్లి మంగామణి@ శ్రీమణి