పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

5, జూన్ 2016, ఆదివారం

పచ్చని చెట్టుని....ఆయువు పట్టుని,



నేను,పచ్చని చెట్టుని,వెచ్చని మీ  ఆయువు పట్టుని,
ఆడుకోమన్నా.. వాడుకోమన్నా... కడుపు నింపుకోమన్నా... నా అణువణువు మీకర్పించి, మమ్ము కాపాడామన్నా.. ..
కొట్టొద్దని,గొడ్డలి పెట్టొద్దని,మొత్తుకొన్నా... మొరపెట్టుకొన్నా.. 
అర్ధించా,అదిలించా,కదిలించా,కడకు కల్లోలంతో బెదిరించా,
పరితపించా .. ప్రకోపించా... ప్రకృతి ప్రళయాలతో ప్రజ్వలించా !మీ పరివర్తనకై నిరీక్షించా,
నీరసించి పోయా,నీరుగారిపోయా..  మీ నిర్లక్ష్యపు ధోరణికి,
తడవ,తడవకూ ... పుడమి గుండె పగులుతున్నా... లేదే  మీలో చలనం 
 బిత్తరపోయిన ఉత్తరఖండ విలాపాన్ని కనులారా చూసినా.... మేలుకోరేం . 
మితిమీరిన పాపానికి ,రగులుతున్న భూతాపం రంకెలు వేస్తున్నా.. లక్ష్యపెట్టరే 
సునామీలా , సుడి గుండాలా,వరదలా,ఉప్పెనై ,హుదుద్ రక్కసి తుఫానులా, .. ముంచేసినా 
 పగులుతున్న ప్రకృతి   గుండె చప్పుడు మీ చెవికి చేరనప్పుడు ,
  విచిత్ర రోగాలతో విలవిలలాడినా ... మీ నోరు మెదపనప్పుడు 
సాంకేతికత పేరుతో పెచ్చుమీరుతున్న మర జీవనాలు 
పట్టణీకరణ తో పచ్చదనానికి మీరు పలికే వీడుకోలు 
మరుగవబోతున్న పిచ్చుకే రేపటి మీ  నాశనానికి ఆనవాలు,
ఇప్పటికే  జరగరాని ఘోరం జరిగిపోయింది,ఓజోను పొర చిరిగి చిరిగి హాలాహలాన్ని వెదజల్లుతోంది,మరుగుతున్న భూతాపం హరియించే మా జాతిని రక్షించే బదులు భక్షించేస్తే 
మిము రక్షించగ రాముడయినా ..... దిగిరాడే,
మానవ తప్పిదానికి ప్రకృతి ప్రతీకారంతో సర్వనాశనం చేయకముందే మేలుకోండి. మీ నేరాలను  మీరే సరిదిద్దుకొనే చిట్ట చివరి అవకాశం. 
ప్రకృతిని పరిరక్షించండి,పచ్చదనాన్ని కాపాడండి,పల్లెను రక్షించండి,
 ప్రకృతి భీభత్సానికి బీజాలు వేసిన మీరే,శరణాగతి అంటూ మోకరిల్లండి,,
లెక్కకు మించి మొక్కలు పెంచి,పచ్చదనానికి,నాంది పలకండి. 
రేపటి స్వచ్చ భారతి ప్రగతికి చెట్లను నాటి పసిడి మెట్లను నిర్మించండి, 
                (ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా చేయి చేయి కలపండి,కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించగ నడుం బిగించండి.)

                                                                               సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి