శ్రీశ్రీకళావేదిక పుస్తకంలో
నాకోపేజీ పోటీలో
20 ఉత్తమ కవితలలో
ఒకటిగా నిలచిన నాకవిత
విజయ గీతం రాసుకోవాలి
కాలమా...
నేను ఏడవడం లేదు
కాసింత కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంతే
ఇదిగో ఇప్పుడే చీకటిని తుడిచేసి
వెలుతురు ముగ్గేస్తున్నా
శూన్యాన్ని కాల్చేసి
వెలుగులు పూయిస్తున్నా
కలికాలం పాత్రలో కలుషితమైన
కన్నీటిని ఒంపేసి
కాసిన్ని నవ్వులు నింపేస్తున్నా
పుస్తకంలో నాకొక పేజీ కావాలి
నేనొక విజయగీతం రాసుకోవాలి
మసలుతున్న రోజులన్నీ
మనోహరకావ్యంలా
మలచుకోవాలని వుంది
పోగేసుకున్న నాలుగు అక్షరాలను
కలబోసి నాలుగుతరాలకు
అందించాలి
విధి లాగేసుకున్న నాదైన క్షణాలకు
లక్షణంగా అక్షరరూపం ఇవ్వాలి
నా హృదయం చవిచూసిన
అనుభూతుల తాయిలాలను
అంతే భద్రంగా పదిలపరచుకోవాలి
పోగొట్టుకున్నదేమిటో...
పోగేసుకొన్నదేమిటో చక్కగా
లెక్క రాసుకోవాలి
నే చూసిన ఈ సమాజాన్ని
రేపటికై చిత్రించాలి
నే సంచరించిన
కాలగమనంలో నే సేకరించిన
అనుభవసారాన్ని ఆమూలాగ్రమూ
ఆ పేజీలో పొందుపరచుకోవాలి
ఆ చరిత్రకు పయనమయ్యేలోపు
ఈ ధరిత్రికి దూరమయ్యే లోపు,
అందుకే ఆపుస్తకంలో
నాకొక పేజీ కావాలి.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి