అంతా మిథ్య,అబద్ధమేదో
అసలు వాస్తవమేదో
నేటి ప్రపంచమే
ఒక మాయాజాలం
అసలేదో సిసలేదో
అంతుబట్టని ఇంద్రజాల
మహేంద్రజాలం
అగుపించేవన్నీ
అభూతకల్పనలే
అడుగడుగునా తారసపడేవి
నగిషీ చెక్కిన
నకిలీ అవతారాలే
అన్నీ అంగుళమెత్తు
పులుముకున్న మేకప్ ముఖాలే
సహజత్వాన్ని వాస్తవాన్ని
ఉన్నదున్నట్టు ఆహ్వనించలేకున్నాం
పైపైమెరుగులకై అర్రులుచాస్తూ
అచ్ఛమైన దానిపై నిర్లక్ష్యం వహిస్తున్నాం
నాణ్యమేదో నకిలీయేదో
కనిపెట్టలేని కనికట్టు
లోగుట్టు పెరుమాళ్ళకెరుకయన్నట్టు
మనిషిలోపల మరోమనిషి
రంగురంగుల లోకంలో
అడుగడుగునా మోసమే
అసల ఆరాటమంతా
హంగు ఆర్భాటాల కోసమే
నాగరికత ముసుగుల్లో
నానాటికీ దిజారుతున్న విలువలు
ఆధునికత మోజుల్లో
చిలువలు పలవలుగా పెరుగుతున్న
ప్రాశ్చాత్యపు పోకడలు
అడుగడుగునా మేకప్ ముఖాలతో
మోహరించే లోకంలో
అచ్ఛమైన ముఖాలు ఇక
ఊహలకే పరిమితాలు కాబోలు.
*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి