పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

19, మార్చి 2017, ఆదివారం

అమ్మకన్నీటిచెమ్మ
ఆమాతృమూర్తికి  ఏం తెలుసు ... తను తరిమేయబడ్డానని,
కన్నకడుపుకేం తెలుసు కన్నబిడ్డలు  కటిక పాషాణాలని,
కలనయినా అనుకొందా ...
జన్మనిచ్చుటలో  మరు జన్మమెత్తిన అమ్మనే  అంగడికీడుస్తారని ,
నడిరాతిరి  నడివీధి కుప్పతొట్టికి తనను కానుకిస్తారని,
అరక్షణములో వస్తానని ఆరుబయటే వదిలేసి వెనుదిరిగి చూడకున్నా,..
నీరెండిన కళ్ళతో నిరీక్షిస్తూనే ఉంది,
 ఆ అమ్మను చూస్తే  అమ్మతనమే మూగబోయింది.
 ఆకాశం గుండె బ్రద్దలయ్యింది,నేలతల్లి సైతం పాలుపోక చూస్తుంది ,
 కన్నబిడ్డల కసాయి చర్యను కనిపెట్టలేని ఆ కనిపెంచినతల్లి  కడుదీనస్థితి చూసి .
 ఆ నిర్వికార  చూపులతో,నిశ్చేతనయైన ఆ శరీరాన్ని ముసురుతున్న మురికి జీవాలు అమాంతం స్వాధీనపరచుకొని ,దొరికినంతా దోచుకొంటూ రక్త మాంసాలు పంచుకొంటూ స్వైర విహారం చేస్తున్నా ... వాటిని అదిలించటానికీ కదిలే సత్తువలేక .   స్థాణువై .నిస్త్రాణమైనా  నిరీక్షిస్తూనే ఉంది.
అరక్షణం లో వస్తానంటూ...  తరలెల్లిన తన బిడ్డలు ఏ క్షణాన వస్తారో యని
అమ్మతనం మాత్రం ఆదమరచక చూస్తేనే ఉంది.  ఆ కన్నబిడ్డల రాక కోసం.
ఏమానవత్వపు  హృదయం అయినా చేరదీసి సేద తీర్చుదామన్నా !
తనను కానక తనబిడ్డలు తలమునకలవుతారని ఆ పిచ్చి తల్లి ఆరాటం
. అంగుళమయినా కదలనీదే ...
చావు బ్రతుకుల పోరాటంలో చివరి మజిలీ చేరుకొన్నా ..
ఆ తల్లి ని చూసిన ప్రతీ బిడ్డా చలించి పోతున్నా!
కన్న బిడ్డలే కాలయములై  కారు చీకటికి బలి ఇస్తే ,
ఆకలి దప్పులు మరచినా కడుపు తీపిని మాత్రం కడ దాకా దాచే ఉంచింది.
కన్న ప్రేగుబంధనాలను త్రెంచుకోలేక. 
దారి మరచి పోయారో,ఏమో ... అని తల్లడిల్లి , .
ఏ దారిన మీరెల్లినా ! నా వాళ్ళు జాడ కనిపిస్తే ఈ అమ్మకప్పగించండి .
అందాకా కనురేప్పేయక కాచుకొనే ఉంటా !కదలలేని నేను .మృత్యు వొచ్చి కభళిస్తానన్నా !
నా బిడ్డల చూసే వరకు నువు వేచే ఉండమని  మొరాయిస్తానంటూ ..ఆ అభాగ్యపు అమ్మ తన కన్నీటిచెమ్మలో కన్నబిడ్డల ప్రతిబింబం పదిలం గావిస్తూ...
  వదిలేసింది,వదులై పోయిన ఆ అమ్మ జన్మను,
 అమ్మతనాన్ని ,అనురాగాన్ని అమరం చేస్తూ .. కమ్మనైన అమ్మఆత్మ కాలగర్భంలో కలిసిపోయింది సమరం చేయలేక నేటి పైశాచిక తనయుల పై,తనువే చాలించింది . అదే అంగడి కుప్పతొట్టిదరి ఎదురుచూపుల ఎండమావిపై.
( దినపత్రికల్లోప్రతీ రోజు మనం చూస్తున్న ఎందరో అమ్మల ధీనస్థితి ఇది.
కన్నవారిని కానివారిగా కర్మానికి వదిలేయకండి,
కడవరకూ కంటికి రెప్పగా కాపాడుకోండి.)              
                                                                          సాలిపల్లి మంగామణి @శ్రీమణి