పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఎదురీత

*ఎదురీత*

బ్రహ్మ రాసిన
రాతలకన్నా...
బ్రహ్మాండంగా
గీతలు గీసుకుంటున్నా....
దేవుడిచ్చిన వెలితితో
బ్రతుకు బాటలో...
వెనుక పడుతున్నా.....
వెలుతురు కోసం
వెతుకుతునే వున్నా...
లేని కాళ్ళను అనునిత్యం
అతుకుతునే వున్నా...
అవహేళన పాలు చేస్తున్న
అవయవలోపాలను సైతం
అవలీలగా అధిగమిస్తున్నా
నాచేతులతోనే...
విధి విషమంటూ
దూషిస్తూకూచోలేక
తలరాతకు ఎదురీతను
నేర్చుకుంటున్నా....
నడవలేని నాకాళ్ళకు
నమూనాచిత్రం
గీసుకుంటున్నా
తీరని నా ఆశను
నెరవేర్చు కోవాలని
ఆరాటపడుతున్నా....
కాళ్ళు లేవుగానీ....
నేను కళాకారుణ్ణి మరి
కలసి రాని కాలమని
అలసి సొలసిపోతే ఎలా
కన్నీళ్ళే మైనా...
కాళ్ళను తిరిగిస్తాయా...
తలరాతను తిరగేస్తాయా..
అందుకే తీరికగా కూచుని
తీరని ఆశను సైతం
తనివితీరా చిత్రిస్తున్నా....
విధి ఆడిన చిత్రమైన
నాటకంలో చక్కగా నడుస్తూ
నటిస్తున్నా...
నా వంతు పాత్రకు
నేనైతే న్యాయమే చేస్తున్నా...
జాలి చూపులు మాత్రం వద్దు
జేజేలు పలకండి చాలు
నాలోని కళాకారునికి
కాళ్ళు తోడులేని నాచేతుల
నైపుణ్యానికి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి