ఎందుకలా..?
ఎందుకలా ఆవేశపు
విల్లంబులు సంధిస్తావు
ఎందుకలా కోపమనే
పాపానికి తావిస్తావు
కోపమెపుడు శాపమే
అది మన పాలిట మనమే
విధించుకొన్న పాపమే
ఆలోచనారాహిత్యానికి
మూలం ఆవేశమే
ఆవేశం వివేకాన్ని అంతరింప
చేస్తుంది...సర్వ నాశనాన్ని
మనిషికి సంతరింపచేస్తుంది
తొందరపాటెపుడూ
చిందరవందరే ముందుకు
ఆవేశపు నిర్ణయమెపుడూ
అస్తవ్యస్తమే
ఆలోచనతో చేసే కార్యమెపుడు
ఖచ్చితంగా సఫలీకృతమే
మనిషికి శాంతమే ఆభరణం
మనసు స్వాంతనకు శాంతమే
ఆవశ్యకం
ఒక్కసారి ఆగ్రహాన్ని విడనాడి
అనునయించి చూడండి
అరక్షణంలో పగవాడే
మన శ్రేయస్సుకు అభిలషించే
ఆత్మీయుడై చేయందిస్తాడు
ఉగ్రత్వంతో ఊగిపోతే
ఉరిమి చూస్తూ సలసలా
మరిగిపోతే నలిగిపోయేది
మన హృదయమే
నాశనమయ్యేది మన శరీరమే
అందుకనే ఒక్కక్షణం ఆలోచించండి
ఆవేశాన్ని నియంత్రించండి
ఆలోచనతో అడుగులు
వేయండి
మీలో కోపాన్ని రూపుమాపి
శాంతమనే ఆభరణాన్ని
మీ మదిలో ధరించండి
మీ మనసును మీరే జయించి
మనీషల్లే జీవించండి.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి