*చిన్నబోవా మరి ..*
కలికిని, చిలుకల కొలికిని,
చెలియను, చంద్రుని నెచ్చెలిని
కలకంఠిని,కలువకంటిని నేను
కిన్నెరసానిని, వన్నెల అలివేణిని
భామినిని,సుందర సౌదామినిని
వలపుల విరిబోణిని, మెలికల మాలినిని
ఎలతీగబోణిని, ఎలకోయిల రాగాన్ని
అంచను, రాయంచను నేను,
మెలతను, విద్యుల్లతను
సురదనను, సుహాసినిని
సీమంతిని, సొగసుల చామంతిని నేను
నివ్వెరబోవా ..జవ్వని సౌందర్యానికి
నిలువలేక సరిసాటిగా ..సృష్టి అందాలు
చిన్నబోవా మరి ..
ఆ నింగి తారకలు
మిన్నకుండిపోవా..వెన్నెల రాతురులు
చెలరేగిపోవా మరి సెలయేటి గలగలలు
ఇల చేరిపోవా ..దివి చందనాలు
వరదలా కదలవా వింజామరలు
జలజలా రాలవా .. జలతారు మేఘాలు
వెలవెల బోవా.. మణులు మాణిక్యాలు
మూగబోవా మరి ముద్ద బంతి పూలు
పడచు ప్రాయాన పడతి పదనిస లివి
అతిశయించిన సొగసు మిసమిస లివి
ఊసులాడే సన్న జాజి బాసలివి
అసలు సిసలైన కన్నె మోజు రాశులివి.
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
Adbhuthamyna kivitha chakkani padala maalikalu great kavaetri sri mani garu ✍✍👌
రిప్లయితొలగించండి