పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

27, మే 2016, శుక్రవారం

నిండు జీవితం.. నీటి బుడగరా!



కరగవద్దని బ్రతిమలాడిన కదలకుండునా పరుగులెత్తే కాలచక్రం
చెరగవద్దని వాదులాడినా కరగకుండునా   .. కమ్మని స్వప్నం .
పండుటాకును పదిలపరచినా .. తరువునొదలక మానునా .. మన్ను కలవక మానునా .. 
రాతిరికి రారాజైనా  వెన్నెలరేడుకి .. అంధకారం కమ్ముకోదా... అమావాస్య అలుముకొదా !
ప్రచండ భానుడైనా  ... సేద తీరడా రేయి మాటున .
అల అలసి పోదా  ... అరక్షణమయినా ..తీరం దరి చేరి,. 
విరిసి మురిసిన పరిమళ  కుసుమమయినా ... వసివాడక తప్పదు కదా ..
కారుమబ్బు కదలి ,కదలి ,కరిగి కరిగి కడలిఒడికి  చేరదా ......
వినీల గగనాన విహరించినా విహంగం విశ్రమించక తప్పదుగా ... ఏ క్షణమయినా ...
పంచభూతాలకూ తప్పని గమనం,ప్రకృతి ఆద్యంతానికి  తప్పని నిష్క్రమణం . 
వెలుగు నీడలెంత సహజమో ... 
ఆగమనం, నిష్క్రమణం అంతే సహజమన్న నిజాన్ని జీర్నిన్చుకోలేకపోవడం  
 మానవుని మనోదౌర్భాల్యం కదా ... 
 నిండు జీవితం..  నీటి బుడగ తీరు కదా .... నిష్క్రమించుట నిక్కమే కదా  ... 
పుట్టిన మొదలు  ఎందుకు మరి ఈ పోరాటం,దేనికోసం అర్ధంలేని ఆరాటం,కులం,మతం,
 అడుగడుగునా అవినీతి,స్వార్ధ తత్వం, పైసా కోసం పైశాచికత్వం,అమానుషత్వం,అరాచకత్వం,
వచ్చిన కర్తవ్యం మరచి బాడుగ ఇంటిని సొంతమనుకొనే మన అమాయకత్వం,
ఏనాటికైనా ఇహమొదలక తప్పదే! ఇంకెందుకు అర్ధం లేని వ్యర్ధ కలాపం;
అందుకే జీవించు ,రేపటి తరానికి ఆదర్శంగా .. 
ఆనందించు నీ కృషితో,
అందించు.. నిన్ను నమ్మిన వారికి నీ ఆత్మీయతానురాగాలతో నీ కష్టార్జితాన్ని,
పంచు.. పలువురికీ మంచిని,మానవతను
నిష్క్రమించు ఏ క్షణమయినా... చిరు నవ్వుతో... ఆత్మతృప్తితో ... 
జీవించు,
జీవితాన్ని సఫలం  గావించు ,జీవించి ఉన్న ప్రతీ క్షణం పదిలంగా అనుభవించు,
రేపటి తరానికి మార్గదర్శిగా పయనించు,ఆయువున్నంతవరకూ ..  
నువ్వున్న... లేకున్నా.. నువ్వాచారించిన నీ ధర్మం నిన్ను చిరంజీవిగా నిలుపుతుంది. 
 మహోత్కృష్టమయిన మానవ  జన్మ సార్ధక్యం తెలుపుతుంది 

                                                                   సాలిపల్లిమంగామణి@శ్రీమణి 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి