పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

20, ఆగస్టు 2018, సోమవారం

ప్రకృతి...ప్రకోపం

మహోగ్రరూపం,మహాగ్రరూపం
మహా ప్రతాపం,మహాప్రతాపం
మరుభూమిని తలపిస్తూ...
ప్రకృతి మ్రోగించిన
మరణమృదంగం .‌.‌‌.‌
మలయాళనేలపై మహాగంగమ్మ ప్రళయతాండవం‌
బ్రద్దలయిందేమో...
భళ్ళునఆకాశం....
వరుణుని భీకర ప్రకోపానికి....
చిగురుటాకులా ‌....
వణికిపోతున్న మలబారుతీరం
ఎక్కడ చూసిన....
ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్న
వాగులు,వంకలు
కుప్పకూలుతున్న
నిలువెత్తు కట్టడాలు ...
కుప్పలుతెప్పలుగా
పడివున్న కళేబరాలు,
ఎల్లలు దాటిన కల్లోలం
అసువులు బాసిన
అమాయక జీవాలు
కొండ పెళ్లలు ఫెళ్లు,ఫెళ్లున
జారిపడగా...తల్లి ,బిడ్డా...
జాడకానక,తల్లడిల్లేతలోదిక్కై..
ప్రాణమరచేత పట్టుకు
కళ్ళనీళ్ళే కడుపునింపే
కటిక చీకటి పహారా..
మృత్యు కౌగిట మూగ అభ్యర్ధనలు,
గ్రుక్కెడు నీళ్ళు లేక
బిక్కు బిక్కు మంటూ...
దిక్కుతోచని అభాగ్యుల
ఆర్తనాదాలు, హాహాకారాలు
పెను విధ్వంసం,పెను విధ్వంసం
అనంతపద్మనాభుడే
ప్రత్యక్ష సాక్షీభూతం....
మానవతప్పిదమో.....
మనస్వయంకృతాపరాధమో...
ప్రకృతి పైమానవ వికృతచర్యకు పర్యవసానమో!
ఈ పరమ విలయ తాండవం.
ప్రకృతి సోయగాలకు
నెలవైన....కేరళ
వెలవెలబోయింది
ఆపన్నహస్తం కోసం
వేయికన్నులతో
ఎదురుతెన్నులు చూస్తుంది
చేయూతనిద్దామా...
మానవత్వం పరిమళించగ
మనవంతుసాయంచేద్దామా‌...              
                     *శ్రీమణి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి