పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, ఏప్రిల్ 2018, మంగళవారం

కకావి"కలం"

కరం కదలకుంటుంది
కలం కదలనంటుంది
కల అయితే బావుణ్ణని
గుండె కలవరిస్తోంది
కకావికలమవుతోంది
కనులు మూసినా
కనులుతెరచినా
చిన్నారి ఆసిఫా
కన్నీటిప్రతిరూపం
కడుదీనంగా
కదలాడుతుంది
నిన్నటి
కటికచేదువిషమింకా
మ్రింగుడుపడకుంది
ఎంతటి అమానుషత్వం
ఎంతటి ఆటవికత్వం
ఎంతటిఅనైతికత్వం
మానవత్వం మంటగలసినక్షణం
మనిషి మన్యజంతువుగ
మారిపోయిన వైనం
రక్కసిమూకల కర్కశక్రీడలో
ముక్కలుచెక్కలైన
ముక్కుపచ్చలారని బాల్యం
కనులారా కాంచి కూడా
కదలిరాని ఆదైవం
సభ్య సమాజం తలలు
పాతాళానికి దించుకొనే
అతిభయానక క్షణం తలచుకొంటేనే తల్లడిల్లిపోతోంది
ప్రతీ కన్నతల్లి హృదయం
ఆడబిడ్డకు రక్షణలేని
రాకాసి సమాజంలో
జన్మనివ్వాలంటే
అమ్మ జడుసుకుంటుంది
కంటికిరెప్పలా
కాచుకొంటున్నా
వెంటాడివేటాడి
కాలనాగులై కాచి
కాటేస్తుంటే
కన్నులెదుటే
కన్నబిడ్డల
ఖననం గావిస్తుంటే
భగభగమండే
కడుపుకోతకు
బదులేంచెప్పాలి
మూణ్ణాళ్ళ ముచ్చటై
ముగిసిపోతున్న
వసివాడినపసిపాపల
కన్నీటికధనాలకు
ఏంచేసి
ప్రాయశ్చిత్తంచేయాలి
ఆ కామాంధుల
నట్టనడివీధిలో
నిలబెట్టి ఉరితీయాలా
బ్రతికుండగానే
భగభగమండే నిప్పుల్లో
తగలెట్టాలా...

సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి