పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

24, ఏప్రిల్ 2016, ఆదివారం

అమ్మ పెట్టిన అరచేత గోరింట.

మరువగలమా! ఆనాటి గురుతులు 
వెలగట్టలేని మరులు,మాణిక్యాలు .
చేరిపేయగలమా! చెంగల్వ పూవులవి 
అమ్మణ్ణి ఆటల్లో గుమ్మాడిపూలు. 
ఎంత భాగ్యము నాది ,
కన్నుల పంట నైతి తల్లి గోదారి ఇంట.
 నిన్నటి తేనెల ఊటల తేటలు ఇంకా 
నా అధరపుటంచుల చవులూరిస్తుంటే 
ఆనాటి ఆపాత మధురాలు ఆపాదమస్తకం 
పులకరింతలతోటి తడిపేస్తూ ఉన్నాయి. 
ఎంత మధురమాపాతమధురాలు,
చింత తెలియని చిరుప్రాయ కధనాలు. 
అమ్మ పెట్టిన అరచేత గోరింట అది ఎంత మధురం
కమ్మకమ్మని అమ్మమ్మ నేతివంట ఎంత మధురం
తాతయ్య కాళ్ళపై గుమ్మాడి ఆట మధురం
కొమ్మ కొమ్మల దాగి కోతికొమ్మచ్చి ఆట మధురం
చిమ్మ చీకటివేళ అమ్మ లాలియను పాట మధురం 
గోధూళి వేళల్లోనర్తించు  గొబ్బిళ్ళ గౌరమ్మ మధురం
తల వాకిట్లో మెరిసేటి  ముత్యాల ముగ్గెంత మధురం
చెరువు గట్టున జుర్రిన తాటిముంజెల తేటెంత  మధురం
 మర్రి ఊడలతోటి ఉయ్యాల సయ్యాటలెంత మధురం 
ఏటి గట్టున విన్న ఎలకోయిలమ్మల  పాట ఇంకెంత మధురం
మచ్చుతునకలు మరి ,మరువగలమా... 
ఆణిముత్యాలసరులవి విడువగలమా... 
గుర్రు పెట్టిన తాత మీసాల ఆట. 
కర్రిఆవుల పొదుగుల్లో పొంగి పొర్లిన పాల తేనియల ఊట. 
 గిర్రుగిర్రున రంగులరాట్నాల మోత. 
తుర్రుమంటూ తూనీగల వెంట తుంటరి వేట. 
చద్దిబువ్వలోనంజు  ఘాటు ఆవకాయ మంట. 
అవ్వ పక్కలోరువ్విన  పిట్టకధల చిటపటా. 
మరువగలమా !మరి చిరునవ్వుల చిట్టా 
చేరిపేయగలమా !అది పసిడి వెన్నెల మూట 
( మొన్ననా పుట్టినూరు పండూరు  వెళ్ళిన తరుణంలో 
 చవిచూసిన అమూల్యమయిన అనుభూతి 
అది అమ్మ చేత పెట్టించుకొన్న నా అరిచేత గోరింటాకు 
అది మీ అందరితో పంచుకోవాలనే ఆరాటంతో..... )

                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి