*మత్తు-గమ్మత్తు*
ఊది ఊది....ఊపిరి
ఆగిపోయేవరకు పీల్చేసై
గుట్టలకొద్దీ పొగాకుకట్టలు
లొట్టలు వేస్తూ కాల్చేసై 
జల్సా చెయ్,బలి చేసేయ్, బంగరుబ్రతుకును,బండలుచేసై
వెలిగించు రింగురింగులుగా..... 
పొగ గుప్పించు
ఎలాగూ... రేపటి నీ బ్రతుకు
 ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువేలే
పొగచూరిన,ఊపిరితిత్తులెలా 
మసిబారి పోతేనేం?
మాడి మసైపోతేనేం..?
నీ ఆయువు ఆవిరయితేనేం..?
నిండు జీవితం నీవల్లే
నిప్పులకొలిమయితేనేం..?
నీ ఇల్లాలి తాళిచెల్లిపోతేనేం ?
నీ బిడ్డల తలరాతలు
తలక్రిందులయితేనేం?
నిన్ను కన్నవాళ్ళ
 గుండె బ్రద్దలయితేనేం?
గుప్పుగుప్పు మంటూ
ఆ గబ్బును గబగబా..
ఆబగా లాగించెయ్
మత్తులోని గమ్మత్తును అమాంతం ఆస్వాదించెయ్
నువ్వు కాల్చేప్రతీ సిగెరెట్టు,
 ప్రతీక్షణం,నీలో కణకణాన్ని
కణకణమని భస్మంగావిస్తున్నా
నీ ఉసురుతీసేందుకు
ముసురు గాసుకొస్తేనేం..?
కాటికి దగ్గర దారి...  
కాలయముడితో 
 కాలక్షేపమే సరాసరి,
నీ వ్యసనానికి ప్రతిఫలంగా
నీవొళ్ళు,నిన్నునమ్ముకొన్నవాళ్ళ  
ఆశలకు నీళ్ళొదిలేసేయ్, 
నీ తనువు ఛిద్రమై
బ్రతుకునిరర్ధకమై,నిత్యం,
మృత్యుకేళీవిలాసంలో
ఊగిసలాడుతూ...
నీకు నీవే భారమై 
నీవారికీ..పెనుభారమై  
గమ్మత్తులకెగబడి మత్తుల్లో  
తూలుతూ మరమత్తు  
చెయ్యలేని మరబొమ్మగా 
మారి,మిగిలి తగలబెట్టు 
నీ వాళ్ళ  నిండు భవితను 
నిర్దాక్షిణ్యంగా ... 
(గమ్మత్తులు చూడాలని
మత్తుల్లో తూలుతూ
మరమ్మత్తు చేయలేని 
మరబొమ్మై మిగులుతున్న
నేటి జనావళిపై వ్యంగ్యంగా 
రాసిన కవిత)
(మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
దయచేసి మత్తుమందులకు
 బానిసలవ్వద్దని అభ్యర్థిస్తూ...)        
*సాలిపల్లిమంగామణి(శ్రీమణి)*
  
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి