పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

7, సెప్టెంబర్ 2021, మంగళవారం

కలకానిదీ

*కలకానిదీ*

నమ్ముతారో లేదో మరి
ఒక చిత్రమైన కల నను రోజూ వెంటాడేది, చెక్కుచెదరనికొన్ని ప్రదేశాలు 
కనులముందు సాక్షాత్కరిస్తూ నన్ను  అనిశ్చిత ఆలోచనల వెంట తరుముతూ
ఏవో ఇంతకు మునుపే చవిచూసిన
అనుభూతుల తుంపరలో 
తడిచిపోతున్నట్టు

ఇప్పటికీ అదే కల 
కనురెప్పలు వాలగానే ఆక్రమించుకుని
కాలాన్ని వెనక్కి త్రిప్పి తీసుకెళుతున్న భావన, ఖచ్చితంగా ఆ ప్రదేశంలో 
నేను మసలిన మరపురాని స్మృతులేవో
నా మునుపటి ఉనికిని బలపరుస్తుంటాయి
పూర్వజన్మలో అది నా ఆవాసమా
అన్న అనుమానం స్వప్నం పూర్తయిన
ప్రతీసారి అదే సందేహంతో 
ఉదయాన్ని ఆహ్వానిస్తుంటాను

అక్కడ కనుచూపుమేరలోఎవ్వరూ లేరు
నా ఉనికి నాకే తెలియని నిశ్శబ్ద ప్రదేశం
ఒక్కటి మాత్రం గుర్తుంది 
ప్రకృతితో మమేకమైన నేను
నాప్రక్కన గుబురుగా అలుముకున్న
కాగితపు పూలచెట్లు 
నేలను ముద్దాడినట్లు 
గడ్డిపూలసోయగాలు
నే నిలబడివున్న దారి కాస్త పల్లంగా
అదేదారికేసి కొంచెం దూరంగా
దృష్టిని సారిస్తే బాగా ఎత్తుగా 
దారులకిరువైపులా బారులుతీరి
చిక్కగా అల్లుకొన్న కొమ్మలు, ఆకులతో 
మహావృక్షాలు కాబోలు 
తల ఎత్తిచూసినా
ఆకాశాన్ని కనపడకుండా అడ్డుపడుతున్నాయి
అస్సలు ఆ ప్రదేశానికి సూర్యుని
కిరణాలు అపరిచితమేమో అన్నట్లు
నా వెనుకగా తరాల తరబడి
నిలబడి అలసిపోయి 
వానల అలజడికి కరుగుతూ 
సగం నేలకొరిగిన మట్టిగోడలు
వర్షం వచ్చి వెలసిన జాడలు
కుడిచేతివైపు లోపలకు సన్నని త్రోవ
ఒక్కరు మాత్రమే నడిచేట్టు,

పచ్చదనం వెచ్చగా హత్తుకున్న
మట్టి పరిమళం మనిషినిమాత్రం
నేను ఒక్కదానినే మనసునిండా
ఏదో తెలియని మంత్రజాలంలా
సర్వం మరచి ప్రకృతిలో  పరవశిస్తూ
పంచభూతాల సాక్షిగా నేను
చుట్టుప్రక్కల ఏమాత్రం సంచారం
లేకపోయినా పక్షుల స్వరవిన్యాసం
మాత్రం చెవిని చేరుతూనే వుంది
నేనెవరో నాకు తెలియని సందిగ్దత
కానీ అది నేనేనని మాత్రం స్పష్టంగా
చెప్పగలను,
అసలు అక్కడ  అలా
ఎందుకు  నిలబడ్డానో 
నిర్మానుష్యంగావున్న ఆ ప్రదేశానికి‌,
నాకు మాత్రం
ఏదో జన్మాంతర సంబంధమా అన్న
అనుమానం తలెత్తుతుంది..
ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెనువెంటనే
ఎప్పుడూ ఆదారికేసి చూస్తూ
ఎదురుచూపులు చూస్తున్న 
నా నిలువెత్తుచిత్రం మాత్రం చిత్రంగా
ప్రతీ రాత్రీ స్వప్నంలా పలకరిస్తుంటుంది

ప్రతీసారీ అదేకల, అవే ప్రదేశాలు
అదే ఎత్తుపల్లాలదారీ,ఏమాత్రం
రూపు మారని మట్టిగోడలు 
పచ్చల ఆభరణం ధరించిన నేలా
పక్షులకువకువలూ, అన్నీ యధావిధిగా
నా కళ్ళముందు కావ్యంలా
ఆవిష్కరించబడుతూనే వున్నాయి
కనులు నిద్రకుపక్రమించిన 
అతితక్కువ సమయానికే అరుదెంచి
తెల్లారుతుండగానే కరిగిపోతూ
నన్ను అబ్బురపడేలా చేస్తాయి.

కలా లేక , కలకాని భ్రమా
లేక ప్రకృతి పట్ల నాకున్న అవ్యాజమైన
అనురక్తికి నాలో నిక్షిప్తమైన
భావాలకు ఊహాచిత్రమా...
ఏమో..ఏమైనా..గానీ
ప్రకృతి ప్రసన్నమై కలలా 
నన్నుతాకి వివశను చేస్తుంటే
మది వీణియ వింతహాయిరాగాలనే
ఆలపిస్తూ నన్ను ఆమనిలా 
పలకరిస్తూనే వుంది.
(కలకానిదీ..అంతరంగ/అనుభూతి ఆవిష్కరణ)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి