పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

9, డిసెంబర్ 2018, ఆదివారం

ప్రకృతి కాంత


తూరుపు వేకువ వేళ
ఉదయించిన నులి వెచ్చని
అరుణారుణ కిరణం నేను
నిశిరాతిరి పున్నమిలో
శశి రాల్చిన వెన్నెలకు
వన్నెలిచ్చింది నేను
ఇంద్రధనుస్సులో సప్త వర్ణాలను
ఒలకబోసింది నేను
విరిసి విరియని మల్లియ రేకున
ఊగిస లాడిన హిమ బిందును నేను
సంకురాతిరి సంధ్య వెలుగులో
మెరిసిన రంగవల్లినీ నేనే
పురి విప్పిన మయూరికి
అరుదగు నాట్యం నేర్పిన
అచ్చర నర్తకి నేనే....
కొమ్మల దాగిన కోయిలమ్మకు
కమ్మని గాత్రాన్ని అరువిచ్చిన
గురువును నేనే
విరజాజికీ,విచ్చుకున్న చామంతికీ
పరిమళాన్ని పంచింది నేను
మెరిసిన తారకకు
తళుకుల నిచ్చిందీ నేను
ఎగిసే కెరటం నేనూ,
కురిసే మేఘం నేనే
మెదిలే కలలోనూ....
కదిలే అలలోనూ...
అణువణువులో...నేను
అవనియంతా...నేను
అన్నింటా నేనూ....
ఆద్యంతం నేనై ఆవహించియున్నా....
అందానికే అందాన్ని నేనూ
అందాల సామ్రాజ్యానికే
అసలు అధినేత్రినే నేనూ...
నాకు సాటి ఎవరూ లేరు
నాకు ధీటుగా ఎవరున్నారు
పంచభూతాలపై నాట్యమాడగలను
సింధూరపు భానుడనే
నా నుదుటన తిలకంగా దిద్దుతాను
కటిక చీకటితో నాకనులకు
కాటుక గీయగలను
వెండి  మబ్బునే నా నడుమకు
చీరగ చుట్టేస్తాను
నెలవంకనే అలవోకగా
నామెడలో ఆభరణం చేయగలను
గంగా, యమునా, క్రిష్ణా, పెన్నా
నదులేవైనా... సెలయేళ్ళైనా...
అన్నీ, నా చెలరేగిన కురులే గదా..
సప్త సంద్రాలైనా,లక్ష ద్వీపాలైనా
కొండ లైనా...కోన లైనా...
కోయిలమ్మ కూత లైనా...
అన్నీ నా అందానికి తీరుగా దిద్దిన తుదిమెరుగులు కావా....
అంటూ....మురిసిపోయింది
ప్రకృతి కాంత.....
మైమరచిపోయింది....
పరవశించి ప్రకృతియంతా....
                       శ్రీమణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి